BCCI: ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు సొంత మైదానాల సమస్యను ఎదుర్కొంటున్నాయి. జనవరి 27లోగా తమ మైదానాలు ఖరారు చేయాలని బీసీసీఐ గడువు విధించింది. లేదంటే ప్రత్యామ్నాయ నగరాలను కేటాయించే అవకాశం ఉంది.
ఐపీఎల్ 2026 సీజన్ సమీపిస్తున్న వేళ, రెండు కీలక ఫ్రాంచైజీలైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) తమ సొంత మైదానాల విషయంలో తీవ్ర ఇబ్బందిలో పడ్డాయి. ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జనవరి 27 వరకు గడువు విధించింది.
25
ఆర్సీబీకి బెంగళూరులోని..
ఆర్సీబీకి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం హోమ్ గ్రౌండ్ కాగా, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం విధించిన కొత్త నిబంధనలు వారికి తలనొప్పిగా మారాయి. స్టేడియం వెలుపల రోడ్ల నిర్వహణ, అగ్నిమాపక దళం వంటి ప్రభుత్వ బాధ్యతలను ఫ్రాంచైజీయే చూసుకోవాలని ప్రభుత్వం షరతు పెట్టింది. డీజే నిర్వహణకు అనుమతి నిరాకరించడం కూడా ఆర్సీబీ యాజమాన్యానికి నచ్చడం లేదు. ఈ సమస్యలపై కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ తో కలిసి ప్రభుత్వంతో చర్చలు జరపనుంది. చర్చలు విఫలమైతే ఆర్సీబీ తమ మైదానాన్ని మార్చుకునే అవకాశం ఉంది.
35
రాజస్థాన్ రాయల్స్ జట్టుకు
మరోవైపు, రాజస్థాన్ రాయల్స్ జట్టుకు జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం సొంత మైదానం. అయితే, ఇక్కడ సమస్య ప్రభుత్వంతో కాదు, రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్(ఆర్సీఏ)లో నెలకొన్న పాలనాపరమైన గందరగోళం. చాలా కాలంగా ఎన్నికలు జరగకపోవడంతో జైపూర్ లో మ్యాచ్ లు నిర్వహించడంపై బీసీసీఐ అసంతృప్తిగా ఉంది.
పరిస్థితులు మెరుగుపడకపోతే ఆర్ఆర్ జట్టు జోధ్ పూర్ లేదా ఇతర నగరాలకు తరలించవచ్చు. ఐపీఎల్ షెడ్యూల్ ఖరారుకు మైదానాలపై స్పష్టత అవసరం కావడంతో, నిర్ణీత గడువులోగా మైదానాలు ఖరారు కాకపోతే బీసీసీఐ ప్రత్యామ్నాయ నగరాలను కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.
55
బీసీసీఐ కఠిన నిర్ణయం
ఇది ఐపీఎల్ సజావుగా సాగడానికి బీసీసీఐ తీసుకుంటున్న కఠిన నిర్ణయం కానుందని చెప్పొచ్చు. ఫ్రాంచైజీలు, రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లు, ప్రభుత్వాలు కలిసి పని చేసి ఈ సమస్యలను త్వరగా పరిష్కరించాలని క్రీడా విశ్లేషకులు సూచిస్తున్నారు. మరి ఈ ఫ్రాంచైజీలు తమ హోం గ్రౌండ్లు ఎప్పటిలోగా తేల్చుకుంటాయో వేచి చూడాలి.