
క్రీడా ప్రపంచంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. 2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించాల్సిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీ చుట్టూ ఇప్పుడు వివాదాల మేఘాలు కమ్ముకున్నాయి. దాయాది దేశం పాకిస్తాన్ కూడా భారత్‌లో ఆడేందుకు వెనుకాడుతున్న వేళ, ఇప్పుడు పొరుగుదేశం బంగ్లాదేశ్ ఏకంగా టోర్నీనే బహిష్కరిస్తామంటూ భీష్మించుకు కూర్చుంది. భద్రతా కారణాలను బూచిగా చూపిస్తూ భారత్‌లో అడుగుపెట్టేది లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) స్పష్టం చేయడం ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో చర్చనీయాంశమైంది.
భారత్‌లో జరగాల్సిన తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ చేసిన విజ్ఞప్తిని ఐసీసీ తోసిపుచ్చింది. షెడ్యూల్ మార్పులు సాధ్యం కాదని తేల్చి చెప్పినప్పటికీ, బంగ్లాదేశ్ వెనక్కి తగ్గలేదు. గురువారం ప్రభుత్వం, ఆటగాళ్లతో సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం, టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు పరోక్ష సంకేతాలు ఇచ్చింది. ఈ మొండి వైఖరి బంగ్లాదేశ్ క్రికెట్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. ఒకవేళ బంగ్లా తప్పుకుంటే, ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్ జట్టుకు ఆ అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. కానీ బంగ్లాదేశ్ మాత్రం ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తినే ప్రమాదం ఉంది.
ప్రపంచకప్ నుంచి తప్పుకోవడం అంటే సామాన్య విషయం కాదు. ఈ నిర్ణయం బంగ్లా బోర్డు ఖజానాకు చిల్లులు పెట్టనుంది. టోర్నీలో పాల్గొనకపోవడం వల్ల దాదాపు రూ. 4 కోట్ల పార్టిసిపేషన్ ఫీజును ఆ జట్టు కోల్పోనుంది. అంతకంటే పెద్ద దెబ్బ ఏమిటంటే.. ఐసీసీ నుంచి ప్రతి ఏటా సభ్య దేశాలకు వచ్చే రెవెన్యూ షేర్ కట్. ఇందులో సుమారు 20 మిలియన్ డాలర్ల మేర కోత విధించే అధికారం ఐసీసీకి ఉంది. నిబంధనల ఉల్లంఘన కింద అదనపు జరిమానాలు కూడా తప్పవు. కేవలం డబ్బులే కాదు, భవిష్యత్తులో ఐసీసీ టోర్నీలకు ఆతిథ్యం ఇచ్చే హక్కులను కూడా బంగ్లా కోల్పోవచ్చు.
ఈ వ్యవహారంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం ఐసీసీకి ఆగ్రహం తెప్పిస్తోంది. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రాజేశాయి. "భారత్ మాకు సురక్షితం కాదు, అక్కడ ఆడకూడదన్నది ప్రభుత్వ నిర్ణయం" అని ఆయన ప్రకటించడం, బోర్డు స్వయంప్రతిపత్తిని దెబ్బతీయడమే. ఐసీసీ నిబంధనల ప్రకారం క్రికెట్ బోర్డు నిర్ణయాల్లో ప్రభుత్వ జోక్యం ఉంటే ఆ బోర్డుపై నిషేధం విధించవచ్చు. గతంలో శ్రీలంక, జింబాబ్వే బోర్డులు ఇదే కారణంతో నిషేధానికి గురయ్యాయి. ఇప్పుడు బీసీబీ కూడా అదే జాబితాలో చేరే ప్రమాదం పొంచి ఉంది.
ఈ గొడవకు మూలాలు ఐపీఎల్ 2026 వేలంలో ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రూ. 9 కోట్లకు కొనుగోలు చేసిన బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను బీసీసీఐ రిలీజ్ చేయమని ఆదేశించడం, ఆ తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేయడం వంటి పరిణామాలు ఇరు దేశాల క్రికెట్ సంబంధాలను దెబ్బతీశాయి. "మా ఆటగాళ్లను అవమానిస్తే సహించం" అని బంగ్లా ప్రభుత్వం చేసిన హెచ్చరికలు ఇప్పుడు ప్రపంచకప్ బహిష్కరణ దాకా వెళ్ళాయి.
ఐసీసీ సమావేశంలో బంగ్లాదేశ్ వైఖరిపై తీవ్ర చర్చ జరిగింది. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మారుస్తారని ఆశించిన బంగ్లాకు భంగపాటు ఎదురైంది. స్వతంత్ర భద్రతా సంస్థల రిపోర్టుల ప్రకారం భారత్‌లో బంగ్లా జట్టుకు ఎలాంటి ముప్పు లేదని ఐసీసీ తేల్చి చెప్పింది. అయితే, బీసీబీ చీఫ్ అమీనుల్ ఇస్లాం మాత్రం తమ ప్రభుత్వంతో మరోసారి మాట్లాడటానికి 24 నుంచి 48 గంటల సమయం కోరారు. ఐసీసీ నుంచి ఏదైనా అద్భుతం జరుగుతుందని ఆయన ఆశిస్తున్నారు. కానీ, ఐసీసీ మాత్రం వెనక్కి తగ్గేది లేదని, బంగ్లా రాకపోతే ప్రత్యామ్నాయం చూసుకుంటామని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.
మొత్తానికి, ఫిబ్రవరి 7న మొదలవ్వాల్సిన మెగా టోర్నీకి ముందే బంగ్లాదేశ్ తీసుకున్న ఈ నిర్ణయం తాను తీసుకున్న గొయ్యిలోనే తానేపడే విధంగా ఉందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జింబాబ్వే తర్వాత రాజకీయ కారణాలతో ఐసీసీ టోర్నీకి దూరమవుతున్న జట్టుగా బంగ్లాదేశ్ నిలుస్తుందా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.