Abhishek Sharma : సున్నాల హ్యాట్రిక్.. అభిషేక్ శర్మకు ఏమైంది?

Published : Feb 18, 2026, 08:32 PM IST

Abhishek Sharma : టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో సున్నాకే అవుటై ఘోర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వరుస డకౌట్లతో చెత్త రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

PREV
16
వరల్డ్ నంబర్ 1 బ్యాటర్ వాట్ ఈజ్ దిస్? వరుసగా మూడోసారి సున్నాకే అవుట్

ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాటర్ అనిపించుకున్న అభిషేక్ శర్మ ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో అత్యంత పేలవమైన ఫామ్‌తో కొనసాగుతున్నాడు. బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నెదర్లాండ్స్‌తో జరిగిన గ్రూప్-ఏ చివరి లీగ్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ మరోసారి సున్నాకే అవుటయ్యారు. ఈ టోర్నీలో ఆయనకు ఇది వరుసగా మూడో డకౌట్ కావడం గమనార్హం. కేవలం డకౌట్ అవ్వడమే కాకుండా, ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక డకౌట్లు అయిన భారత ఆటగాడిగా సంజూ శాంసన్ పేరిట ఉన్న చెత్త రికార్డును అభిషేక్ సమం చేశాడు.

26
నెదర్లాండ్స్ స్పిన్నర్ ఉచ్చులో అభిషేక్ శర్మ

భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత, నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ బంతిని ఆఫ్ స్పిన్నర్ ఆర్యన్ దత్‌కు అందించారు. భారత టాప్ ఆర్డర్‌లో ముగ్గురు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉండటంతో ఈ వ్యూహం పలించింది. ఆర్యన్ దత్ వేసిన మొదటి ఓవర్‌లోనే అభిషేక్ తడబడ్డారు. మొదటి రెండు బంతులను జాగ్రత్తగా ఆడిన అభిషేక్, మూడో బంతికి అనవసరంగా షాట్ ఆడేందుకు ప్రయత్నించారు. వేగంగా వచ్చిన బంతిని క్రాస్ బ్యాట్‌తో ఆడే క్రమంలో బంతి బ్యాట్‌కు చిక్కకుండా నేరుగా వెళ్లి స్టంప్స్‌ను కొట్టింది. దీంతో కేవలం మూడు బంతులు ఆడి సున్నాకే వెనుదిరిగారు.

36
సంజూ శాంసన్ చెత్త రికార్డు సమం చేసిన అభిషేక్ శర్మ

ఈ డకౌట్‌తో అభిషేక్ శర్మ 2026 క్యాలెండర్ ఇయర్ లో తన ఐదో టీ20 డకౌట్‌ను నమోదు చేశారు. గతంలో 2024లో సంజూ శాంసన్ ఒకే ఏడాదిలో ఐదుసార్లు సున్నాకే అవుటై ఈ చెత్త రికార్డు సాధించాడు. ఇప్పుడు అభిషేక్ శర్మ కేవలం ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లోనే ఆ రికార్డును చేరుకోవడం గమనార్హం. ఈ ఏడాది ఆయన ఆడిన గత ఎనిమిది టీ20ల్లో ఐదుసార్లు డకౌట్ కాగా, మిగిలిన ఇన్నింగ్స్‌ల్లో 84, 68* వంటి మంచి స్కోర్లు సాధించినప్పటికీ, నిలకడలేమి జట్టును ఆందోళనకు గురిచేస్తోంది.

46
అభిషేక్ శర్మ : ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ డకౌట్లు

టీ20 ప్రపంచకప్ చరిత్రలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో సున్నాకే అవుటైన ఆటగాళ్ల జాబితాలో అభిషేక్ శర్మ చేరారు. గతంలో భారత్ నుంచి ఆశిష్ నెహ్రా, వెస్టిండీస్ నుంచి ఆండ్రీ ఫ్లెచర్, ఉగాండా నుంచి రోజర్ ముకాసా ఈ చెత్త రికార్డును కలిగి ఉన్నారు. ఫిబ్రవరి 7న అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో అలీ ఖాన్ బౌలింగ్‌లో అవుటైన ఆయన, అనారోగ్యం కారణంగా నమీబియా మ్యాచ్‌కు దూరమయ్యారు. తిరిగి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సల్మాన్ అఘా బౌలింగ్‌లో డకౌట్ అయ్యారు, ఇప్పుడు నెదర్లాండ్స్‌పై కూడా అదే విధంగా అవుట్ అయ్యాడు.

56
గవాస్కర్ సలహాను బేఖాతరు చేస్తూ..

వరుసగా రెండోసారి డకౌట్ అయినప్పుడు దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిషేక్ శర్మకు ఒక కీలక సలహా ఇచ్చారు. మొదట భారీ షాట్లకు వెళ్లకుండా కనీసం ఒక్క పరుగు తీసి ఖాతా తెరవడానికి ప్రయత్నించాలని సూచించారు. కానీ, నెదర్లాండ్స్ మ్యాచ్‌లో కూడా అభిషేక్ బౌండరీ బాదాలనే తొందరలో తన వికెట్ పారేసుకున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఏడాదిలో అత్యధిక డకౌట్లు చేసిన ప్రపంచ రికార్డు పాకిస్థాన్‌కు చెందిన సైమ్ అయూబ్ (6 డకౌట్లు - 2025) పేరిట ఉండగా, అభిషేక్ 5 డకౌట్లతో రెండో స్థానంలో నిలిచారు.

66
సూపర్ 8పైనే అభిషేక్ శర్మ ఆశలు

ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఎదుర్కొన్న ఎనిమిది బంతుల్లో అభిషేక్ ఒక్క పరుగు కూడా చేయలేకపోయారు. లీగ్ దశలో ఘోరంగా విఫలమైనప్పటికీ, ఫిబ్రవరి 22న దక్షిణాఫ్రికాతో జరగబోయే సూపర్ 8 మ్యాచ్‌లోనైనా ఆయన తిరిగి ఫామ్‌లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. జట్టు మేనేజ్మెంట్ ఆయనపై నమ్మకం ఉంచుతుందా లేదా అనేదే ఇప్పుడు మిగిలిన ప్రశ్న.

Read more Photos on
click me!

Recommended Stories