సచిన్ టెండూల్కర్ అన్‌స్టాపబుల్ రికార్డులు.. వీటిని టచ్ చేయడం కూడా కష్టమే !

Published : Feb 27, 2026, 07:07 PM IST

Unbreakable World Records : సచిన్ టెండూల్కర్ క్రికెట్ లో ఎన్నో రికార్డులను సాధించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 34357 పరుగులు, 100 సెంచరీలతో తనదైన ముద్రవేశాడు. అయితే, సచిన్ సాధించిన 7 అన్ బ్రేక్ బుల్ రికార్డులు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
18
చరిత్ర తిరగరాసిన సచిన్ టెండూల్కర్.. ఈ రికార్డులు బద్దలు కొట్టే మొనగాడు లేడా?

క్రికెట్ ప్రపంచంలో గాడ్ ఆఫ్ క్రికెట్ అని పిలవబడే సచిన్ టెండూల్కర్ పేరు వినగానే రికార్డుల పరంపర గుర్తుకు వస్తుంది. దాదాపు రెండు దశాబ్దాల పాటు ప్రపంచ క్రికెట్‌ను ఏలిన సచిన్, తన కెరీర్‌లో అనేక మైలురాళ్లను అధిగమించారు. 

నవంబర్ 15, 1989న అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సచిన్, నవంబర్ 14, 2013న తన సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలికారు. ఈ 24 ఏళ్ల కాలంలో ఆయన సృష్టించిన కొన్ని రికార్డులు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. సింహం నోటి నుంచి వేటను లాక్కోవడం ఎంత కష్టమో, సచిన్ నెలకొల్పిన ఈ 7 ప్రపంచ రికార్డులను బ్రేక్ చేయడం కూడా అంతే కష్టం. వాటిలో..

28
1. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికంగా 34,357 పరుగులు

సచిన్ టెండూల్కర్ తన సుదీర్ఘ కెరీర్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి మొత్తం 34,357 పరుగులు సాధించారు. ఈ రికార్డును అందుకోవడం ఏ బ్యాటర్‌కైనా దాదాపు అసాధ్యం. ప్రస్తుత తరం ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ మాత్రమే సచిన్ తర్వాత అత్యధిక పరుగుల రేసులో ఉన్నారు. కోహ్లీ ఇప్పటివరకు 28,215 పరుగులు చేశారు. సచిన్ రికార్డును అందుకోవాలంటే కోహ్లీ ఇంకా వేల పరుగులు సాధించాల్సి ఉంటుంది. 24 ఏళ్ల పాటు స్థిరంగా ఆడితే తప్ప ఈ ఘనత సాధించడం ఎవరికీ సాధ్యం కాదు.

38
2. 200 టెస్ట్ మ్యాచ్‌ల రికార్డు

టెస్ట్ క్రికెట్ చరిత్రలో 200 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఆటగాడు సచిన్ టెండూల్కర్. టెస్ట్ ఫార్మాట్‌లో సుదీర్ఘ కాలం పాటు ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ ఆడటం చాలా సవాలుతో కూడుకున్న పని. నేటి కాలంలో టీ20 లీగ్‌ల ప్రాధాన్యం పెరగడంతో, ఏ క్రికెటర్ కూడా 200 టెస్టుల మార్కును చేరుకునేలా కనిపించడం లేదు. సచిన్ తన 24 ఏళ్ల కెరీర్‌లో 15,921 టెస్ట్ పరుగులు సాధించి ఈ రికార్డును పదిలం చేసుకున్నారు.

48
3. 463 వన్డే మ్యాచ్‌ల ప్రపంచ రికార్డు

వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అత్యధికంగా 463 మ్యాచ్‌లు ఆడిన ఘనత కూడా మాస్టర్ బ్లాస్టర్‌దే. డిసెంబర్ 18, 1989న పాకిస్థాన్‌తో తన తొలి వన్డే ఆడిన సచిన్, మార్చి 18, 2012న అదే పాకిస్థాన్‌పై తన చివరి వన్డే ఆడారు. సచిన్ వన్డే కెరీర్ 22 ఏళ్ల 91 రోజుల పాటు కొనసాగింది. ఇంతటి సుదీర్ఘ కాలం వన్డే క్రికెట్‌లో కొనసాగడం నేటి తరం ఆటగాళ్లకు కలగానే మిగిలిపోయే అవకాశం ఉంది.

58
4. అంతర్జాతీయ క్రికెట్‌లో 4,076 ఫోర్లు

అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ మొత్తం 4,076 ఫోర్లు బాదారు. ఇందులో వన్డేల్లో 2,016, టెస్టుల్లో 2058, టీ20ల్లో 2 ఫోర్లు ఉన్నాయి. సచిన్ తర్వాత శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర 3,015 ఫోర్లతో రెండో స్థానంలో ఉన్నారు. యాక్టివ్ క్రికెటర్లలో విరాట్ కోహ్లీ 2,772 ఫోర్లతో ఉన్నప్పటికీ, సచిన్ రికార్డును అధిగమించడం ఆయనకు అంత సులభం కాదు.

68
5. ఒకే క్యాలెండర్ ఇయర్లో 1,894 వన్డే పరుగులు

1998 సంవత్సరంలో సచిన్ టెండూల్కర్ బ్యాట్‌తో విలయతాండవం చేశారు. ఆ ఒక్క ఏడాదిలోనే 34 వన్డే మ్యాచ్‌లు ఆడి 1,894 పరుగులు సాధించారు. ఇందులో 9 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 65.31 సగటుతో సాగిన ఈ పరుగుల ప్రవాహం 28 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉంది. నేటికీ ప్రపంచంలో ఏ బ్యాటర్ కూడా ఒకే ఏడాదిలో ఇన్ని వన్డే పరుగులు సాధించలేకపోయారు.

78
6. వన్డేల్లో అత్యధికంగా 18,426 పరుగులు

సచిన్ తన వన్డే కెరీర్‌లో 452 ఇన్నింగ్స్‌ల్లో 44.83 సగటుతో 18,426 పరుగులు చేశారు. ఇందులో 49 శతకాలు, 96 అర్ధ శతకాలు ఉన్నాయి. ప్రస్తుతం వన్డే మ్యాచ్‌ల సంఖ్య తగ్గిపోతుండటం వల్ల భవిష్యత్తులో ఈ రికార్డును ఎవరైనా బ్రేక్ చేయడం అసాధ్యమని క్రికెట్ పండితులు చెబుతుంటారు. వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ (ఫిబ్రవరి 24, 2010) సాధించిన ఘనత కూడా ఆయనదే.

88
7. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు

సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన అత్యంత గొప్ప రికార్డు 100 అంతర్జాతీయ సెంచరీలు. క్రికెట్ చరిత్రలో ఈ మైలురాయిని చేరుకున్న ఏకైక బ్యాటర్ ఆయనే. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 85 సెంచరీలతో రేసులో ఉన్నారు. 37 ఏళ్ల కోహ్లీ మరో 16 సెంచరీలు చేస్తే తప్ప సచిన్ రికార్డును అధిగమించలేరు. వయస్సు, ఫామ్ దృష్ట్యా కోహ్లీకి ఇది పెను సవాలుగా మారనుంది.

Read more Photos on
click me!

Recommended Stories