హిందూ సంప్రదాయంలో దేవాలయ సందర్శన అనేది కేవలం దైవ దర్శనంతో ముగిసిపోదు. ధ్వజస్తంభానికి నమస్కరించడం నుండి గర్భాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడం వరకు ప్రతి పనిలోనూ ఒక అర్థం, ఒక పరమార్థం దాగి ఉంది. అసలు గుడి చుట్టూ ప్రదక్షిణలు ఎందుకు చేయాలి..? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
26
అసలు ప్రదక్షిణ అంటే ఏమిటి?
దేవుడు కొలువైన గర్భగుడి చుట్టూ భక్తులు తిరగడమే ప్రదక్షిణ. సాధారణంగా 3, 5, 11 సార్లు ప్రదక్షిణలు చేస్తారు.. కొన్ని ఆలయాల్లో 101, 111 కూడా చేస్తారు. అంగ ప్రదక్షిణ, మరికొందరు పొర్లుదండాలు పెడుతుంటారు.
అయితే 'ప్రదక్షిణ' అనే పదంలో చాలా అర్థం దాగుంది. 'ప్ర' అంటే పాప వినాశనం, 'ద' అంటే కోరికల నెరవేర్పు, 'క్షి' అంటే జన్మ రాహిత్యం, 'ణ' అంటే జ్ఞానోదయం అని అర్థం. అంటే మనలోని అజ్ఞానాన్ని పోగొట్టుకుని, దైవ చింతనతో ముందుకు సాగడమే ప్రదక్షిణ ఉద్దేశం.
36
ప్రదక్షిణ వెనక ఆధ్యాత్మిక కారణాలు (Spiritual Reasons)
దైవమే కేంద్ర బిందువు
మనం ప్రదక్షిణ చేసేటప్పుడు దైవం మనకు కుడి వైపున ఉంటారు. మన జీవిత చక్రానికి భగవంతుడే కేంద్ర బిందువు అని, మన జీవితం ఆయన చుట్టూనే తిరుగుతుందని చెప్పడానికి ఇది ఒక సంకేతం. మన అహంకారాన్ని వీడి, భగవంతుని శరణు వేడుతూ చేసే ప్రక్రియ ఇది.
పాప పరిహారం
తెలిసి తెలియక చేసే కాయిక, వాచిక, మానసిక దోషాలు ప్రదక్షిణ చేయడం ద్వారా తొలగిపోతాయని భక్తుల నమ్మకం. "ఆత్మ ప్రదక్షిణ" ద్వారా మనలో ఉన్న పరమాత్మను మనం గౌరవించుకుంటాం.
దైవంపై మనసు లగ్నం చేయడం
మనిషికి అనేక ఆలోచనలు ఉంటాయి... కాబట్టి వాటితోనే గుడికి వెళుతుంటారు. ఇలా వేరే ఆలోచనలో ఉండగా మనసును దైవంగా లగ్నం చేయలేం. అందుకే ప్రదక్షిణల ద్వారా శరీరాన్ని, మనసును ప్రశాంతంగా మార్చుకోవడానికి సమయం దొరుకుతుంది. ప్రదక్షిణల అనంతరం కొద్దిసేపు కూర్చుని ప్రశాంతమైన మనసుతో దైవదర్శనం చేసుకోవాలి.
ప్రాచీన హిందూ దేవాలయాల నిర్మాణం వెనుక కేవలం ఆధ్యాత్మిక అంశాలే కాదు గొప్ప ఇంజనీరింగ్, సైన్స్ దాగి ఉంది. అందుకే గుడిలో పాటించే విషయాల్లో కేవలం భక్తి మాత్రమే కాదు ఇతర అంశాలు దాగుంటాయి. మరి ప్రదక్షిణ చేయడం వల్ల కలిగే కొన్ని శాస్త్రీయ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
అయస్కాంత శక్తి (Magnetic Energy)
సాధారణంగా ప్రాచీన దేవాలయాలను భూమి అయస్కాంత తరంగాలు ఎక్కువగా ఉండే చోట నిర్మించారు. గర్భాలయంలోని మూలవిరాట్ కింద 'యంత్రాలను' ప్రతిష్ఠించడం వల్ల ఆ విగ్రహం ఒక శక్తి కేంద్రంగా (Energy Center) మారుతుంది. మనం ఆ గర్భాలయం చుట్టూ నడిచినప్పుడు, ఆ సానుకూల శక్తి (Positive Energy) మన శరీరంలోని నాడులకు అందుతుంది.
శక్తి ప్రవాహం క్రమబద్దం
మనం ఎప్పుడూ కుడి వైపు నుండే (Clockwise) ప్రదక్షిణ చేస్తాం. సైన్స్ ప్రకారం, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగే దిశకు, మన ప్రదక్షిణ దిశకు అనుసంధానం ఉంటుంది. ఇది మన శరీరంలోని శక్తి ప్రవాహాన్ని క్రమబద్ధం చేస్తుంది.
56
సహజమైన ఆరోగ్య ప్రయోజనాలు
స్వచ్ఛమైన గాలి : దేవాలయ ప్రాంగణాల్లో తులసి, వేప, రావి వంటి చెట్లు ఉంటాయి. అందుకే ప్రదక్షిణలు చేయడం వల్ల గుడిలో ఎక్కువసేపు గడిపే అవకాశం ఉంటుంది... తద్వారా ఈ చెట్ల నుండి వచ్చే స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను మనం పీలుస్తాం.
ఆక్యుప్రెజర్ : ఎంతటివారైనా చెప్పులు బయటే వదిలి గుడిలోకి వెళ్లాలి.. ఇలా ఖాళీ కాళ్లతో ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. గుడిలో ఉండే రాతి నేల మీద నడవడం వల్ల పాదాల్లోని నాడులు ఉత్తేజితమై ఒత్తిడి తగ్గుతుంది. దీనివల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
66
3. ప్రదక్షిణలు ఎలా చేయాలి?
శాస్త్రం ప్రకారం ప్రదక్షిణలు చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి.
ప్రదక్షిణ చేసేటప్పుడు గబగబా పరుగెత్తకూడదు. "గర్భవతి అయిన స్త్రీ నెమ్మదిగా నడిచినట్లు" అత్యంత భక్తితో, నిదానంగా నడవాలి.
చేతులు జోడించి, మనసులో దైవ నామస్మరణ చేస్తూ ఉండాలి.
అనవసరమైన మాటలు మాట్లాడకూడదు.
ప్రదక్షిణ అనేది కేవలం ఒక శారీరక వ్యాయామం మాత్రమే కాదు, అది మనస్సును ప్రశాంత పరిచే ఒక ధ్యానం. భక్తితో చేసే ప్రదక్షిణ మానసిక బలాన్ని ఇస్తే, దాని వెనుక ఉన్న సైన్స్ మనకు శారీరక ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అందుకే గుడికి వెళ్లినప్పుడు ప్రదక్షిణలు చేసి భక్తిని చాటుకుంటూనే ఆరోగ్యాన్ని పొందుదాం.