దీపావళికి అందరూ లక్ష్మీదేవిని (Lakshmi devi) పూజిస్తారు. లక్ష్మీదేవికి సంబంధించి ఒక పురాణ కథ ఉంది. దీని గురించి తెలిసినవారు చాలా తక్కువ. లక్ష్మీదేవి ఒక రైతు ఇంట్లోనే ఎన్నో ఏళ్ల పాటు నివసించింది.
ప్రతి ఏడాది దీపావళి పండుగ కోసం మన దేశమంతా ఎదురుచూస్తూ ఉంటుంది. దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజిస్తారు. లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంటికి సంపద, ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని ఎంతోమంది భక్తుల నమ్మకం. అయితే లక్ష్మీదేవికి సంబంధించి ఒక కథ ఉంది. ఈ కథ గురించి తెలిసిన వారు చాలా తక్కువే.
25
దీపాలతో ఆహ్వానం
దీపావళి రోజున లక్ష్మీదేవి భూమిపైకి వచ్చి తిరుగుతుందని చెబుతారు. అందుకే ఆ రోజు ఇల్లు శుభ్రంగా ఉండాలని, దీపాలతో వెలిగిపోవాలని చెబుతారు. ఎక్కడైతే ఇల్లు శుభ్రంగా ఉండి, దీపాలతో వెలిగిపోతూ ఉంటుందో.. అక్కడే లక్ష్మీదేవి నివసిస్తుందని.. సంపదను శ్రేయస్సును అందిస్తుందని ఎంతో మంది నమ్మకం. అందుకే దీపావళి రోజు ఇల్లును శుభ్రం చేసుకుని దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు.
35
రైతు ఇంటికి లక్ష్మీదేవి
ఒక పురాణ కథ ప్రకారం ఓసారి విష్ణువు భూమిని సందర్శించాలని అనుకుంటాడు. అతడు తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు లక్ష్మీదేవి కూడా వస్తానని చెబుతుంది. అప్పుడు విష్ణువు తనతో రావాలంటే తన ఆజ్ఞలను పాటించాలని లక్ష్మీదేవికి షరతు విధిస్తారు. లక్ష్మీదేవి ఆ షరతును అంగీకరిస్తుంది. తరువాత ఇద్దరూ భూమి పైకి వస్తారు. కొంత సమయం సంచరించిన తర్వాత విష్ణువు దక్షిణం వైపు వెళ్లాలని అనుకుంటాడు. భర్తని అనుసరించి వెళుతుంది లక్ష్మీదేవి. వారిద్దరూ దారిలో ఒక అందమైన ఆవాల తోటను చూస్తారు.
పచ్చదనంతో, పసుపు పువ్వులతో నిండిన ఆ పొలం అమ్మవారికి నచ్చేస్తుంది. లక్ష్మీదేవి అక్కడే ఆగిపోయి ఆవాలు, పువ్వులతో తనను తాను అలంకరించుకుంటుంది. దగ్గరలో ఉన్న ఆ చెరకును తెంపి రసాన్ని తాగుతుంది. ఇది చూసి విష్ణువుకు ఒక విపరీతమైన కోపం వస్తుంది. నువ్వు నా ఆజ్ఞను ధిక్కరించావు కాబట్టి నీకు శిక్ష తప్పదు... నువ్వు 12 సంవత్సరాల పాటు ఈ ఆవాల పంట వేసిన రైతు ఇంట్లోనే నివసించాలి అని చెప్పి వెళ్లిపోతాడు.
అప్పటినుంచి లక్ష్మీదేవి 12 సంవత్సరాల పాటు ఒక రైతు ఇంట్లోనే నివసిస్తుంది. లక్ష్మీదేవి నివసించే చోట పేదరికం ఎలా ఉంటుంది? లక్ష్మీదేవి అడుగుపెట్టిన తర్వాత ఆ పేద రైతు ఇల్లు సంపదతో, శ్రేయస్సుతో కళకళలాడిపోతుంది. అతని ఇల్లు భోగభాగ్యాలతో నిండిపోతుంది. సరిగ్గా 12 సంవత్సరాలు గడిచిన తర్వాత విష్ణువు... లక్ష్మీదేవిని తీసుకువెళ్లడానికి భూమి పైకి వస్తాడు. కానీ రైతు ఆమెను విడిచి పెట్టేందుకు ఇష్టపడడు.
55
మాటిచ్చిన లక్ష్మీదేవి
అప్పుడు లక్ష్మీదేవి ప్రేమగా రైతుతో మాట్లాడుతుంది. ‘కుమారా.. నేను తప్పకుండా ప్రతి ఏడాది ఒకసారి మీ ఇంటికి వస్తాను. ఆరోజు మీ ఇంటిని శుభ్రంగా ఉంచి దీపాలు వెలిగించి భక్తితో నన్ను పూజించండి’ అని చెప్పి భర్తతో పాటు వెళ్లిపోతుంది. అప్పటినుంచి ప్రతి ఏటా దీపావళిని రోజున ఇంటిని శుభ్రం చేసి, దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజించే సాంప్రదాయం వచ్చిందని చెప్పకుంటారు.