ప్రతి దసర పండుగ నాడు జమ్మిచెట్టును పూజించి దాని ఆకులను పంచిపెడుతుంటారు. నిజానికి దసరా నాడు జమ్మి చెట్టును పూజించడం వెనుక ఒక ఆధ్యాత్మిక కథే ఉంది. మహాభారతంలో పాండవులు తమ అజ్ఞాతవాసం సమయంలో వారి ఆయుధాలను జమ్మి చెట్టు మీద దాచిపెట్టారని చెప్తారు. వీరి అజ్ఞాతవాసం పూర్తైన తర్వాత జమ్మిచెట్టుమీదున్ ఆయుధాలను తీసుకెళ్లి కౌరవులతో యుద్దం చేశారు.
దీంట్లో వారు విజయం సాధించినందుకు జమ్మి చెట్టును విజయానికి సంకేతంగా భావిస్తారు. పురాణాల ప్రకారం.. దసరా పండుగ నాడు జమ్మి చెట్టును దర్శించుకుని ఆకులను ఇంటికి తెచ్చి పూజ చేస్తే మన జీవితంలో అంతా మంచే జరుగుతుందని చెప్తారు. అలాగే మన జీవితంలో ఉన్న సమస్యలు, అడ్డంకులు తొలగిపోయి విజయం సాధిస్తారు. అన్నీ శుభాలే జరుగుతాయని పండితులు చెప్తారు.
జమ్మి ఆకులను ఇంటికి తెచ్చిన తర్వాత ఏం చేయాలి?
దసరా పండుగ నాడు ఉదయాన్నే తలస్నానం చేసి దేవుళ్లకూ పూజ చేయాలి. ఆ తర్వాత జమ్మి చెట్టు దగ్గరికి వెళ్లి నమస్కరించి కుంకుమ, పసుపులను సమర్పించాలి. తర్వాత దీపాన్ని వెలిగించాలి.
ఆ తర్వాత ఆకులను తీసుకోవాలి. చెట్టు నుంచి తీసుకున్న ఆకులను బంగారంగా భావించి పండుగ నాడు ఫ్రెండ్స్ కు, ఇరుగుపొరుగు వారికి బంధువులకు ఇస్తారు. ఈ ఆకులను ఇలా పంచిపెట్టడాన్ని సువర్ణదానం అని కూడా అంటారు. ఇలా దానం చేయడాన్ని ఐశ్వర్యానికి, ఆర్థికాభివృద్ధికి సంకేతంగా భావిస్తారు.