మనాలి అందమైన ప్రకృతి అందాలు, పూల వనాలు, మంచుతో కప్పబడిన పర్వతాలు, యాపిల్ తోటలతో పర్యాటకులను ఆకట్టుకునేలా ఉంటుంది. మనాలి సందర్శన పర్యాటకులకు తప్పక నచ్చుతుంది. మనాలిలో ప్రధాన ఆకర్షణగా గ్రీన్ హిమాలయన్ పార్క్ (Green Himalayan Park), బియాస్ కుండ్ సరస్సు, రోహతంగ్ పాస్ (Rohtang Pass), హడింబ టెంపుల్, సోలన్ లోయ ఉన్నాయి.
వీటితో పాటు సందర్శనకు వీలుగా పండా డ్యాం, రఘునాథ్ టెంపుల్ (Raghunath Temple), చంద్రఖానీ పాస్ (Chandrakhani pass), జగన్నాథి దేవి టెంపుల్ ఇలా మొదలగునవి ఉన్నాయి. ఈ ప్రదేశాలు ఒకొక్కటి ఒకొక్క విశిష్టతను కలిగి పర్యాటకులను ఆశ్చర్యపరిచేలా ఉంటాయి. మనాలి వెళ్ళినప్పుడు ఈ ప్రదేశాలు తప్పక సందర్శించండి. వీటి సందర్శన మీకు మధురానుభూతిని కలిగిస్తుంది.
హడింబ టెంపుల్: హడింబ టెంపుల్ (Hadimba Temple) మనాలిలోని ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి. హిందూ పురాణాల ప్రకారం రాక్షసి అయిన హడింబి చెల్లెలు అయిన హడింబా దేవికి అంకితమిస్తూ (Dedicated) క్రీ.శ. 1533 లో నిర్మించారు. ఈ దేవాలయం భూమి నుంచి ఉద్భవించే ఒక పెద్ద రాతి నుంచి నిర్మించబడినది.
కనుక ఈ దేవాలయంలోని రాతిని దేవతకి ప్రతిరూపంగా భావించి భక్తులు పూజిస్తారు. ఈ ఆలయాన్ని పోలిన నిర్మాణాన్ని (Structure) మరెక్కడా నిర్మించకుండా ఉండేందుకు ఆలయ నిర్మాణంలో పాల్గొన్న కళాకారుల కుడిచేతిని నరికించాడు ఆనాటి రాజు. ఇక్కడ జరిగే ఘోర్ పూజను (Ghor Puja) తిలకించడానికి అనేక మంది భక్తులు వస్తుంటారు.
బియాస్ కుండ్ సరస్సు: మనాలిలో ఉన్న బియాస్ కుండ్ సరస్సుకు (Beas Kund Lake) ఒక ప్రత్యేకత ఉంది. మహాభారతాన్ని రచించిన మహర్షి వ్యాసుడు ఈ సరస్సులోనే స్నానమాచరించే వారని పురాణ కథనం. ఈ సరస్సులో స్నానమాచరిస్తే అన్ని చర్మ వ్యాధులు (Skin diseases) నయమవుతాయని ఇక్కడివారి నమ్మకం.
జగన్నాథి దేవాలయం: మనాలిలోని ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో జగన్నాథి దేవాలయం (Jagannathi Temple) ఒకటి. ఈ దేవాలయాన్ని 1500 సంవత్సరంలో క్రితం నిర్మించారు. భగవంతుడు విష్ణువు చెల్లెలు అయినా భువనేశ్వరిని దేవిని ఈ దేవాలయంలో పూజిస్తారు. ఈ దేవాలయ సందర్శన ఆధ్యాత్మిక (Spiritual) భావనను కలిగిస్తుంది.
సోలంగ్ లోయ: మనాలిలో ఉన్న మరొక ప్రత్యేక ఆకర్షణగా సోలంగ్ లోయ (Solang Valley) ఉంది. ఇక్కడ ప్రతి ఏడాది జరిగే వింటర్ స్కీయింగ్ ఫెస్టివల్ (Winter Skiing Festival) కు అనేక మంది పర్యాటకులు వస్తుంటారు. ఈ ప్రాంత సందర్శనలో పారా గ్లైడింగ్, మౌంటెన్ బైకింగ్, స్కీయింగ్ మొదలగు క్రీడలలో పాల్గొనవచ్చు. ఈ ప్రాంత సందర్శన పర్యాటకులను అమితంగా ఆకట్టుకునేలా ఉంటుంది.