వినాయక చవితి వ్రతం చేస్తే మీ జీవితంలో కలిగే అనూహ్య మార్పులివే

First Published | Aug 31, 2024, 12:41 PM IST

వినాయక చవితి రోజున విఘ్నేశ్వరుడికి పూజ చేయడం హిందూ సంప్రదాయంలో చాలా ముఖ్యమైన విషయం. విఘ్నేశ్వరుడు (గణేష్) మనం చేసే పనుల్లో ఆటంకాలను తొలగించేవాడని భక్తుల విశ్వాసం.  అంతే కాకుండా ఆ పనులు విజయవంతం చేస్తాడని నమ్ముతారు. ఏ పని మొదలు పెట్టినా ముందుగా వినాయకుడికి పూజ చేయడం హిందూ సంప్రదాయంలో ఆచారం. మరి వినాయకుడి పుట్టిన రోజైన భాద్రపద శుద్ధ చవితి రోజు పూజ చేస్తే కలిగే ప్రత్యేక ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
 

వినాయక చవితి అనేది హిందూ సంప్రదాయంలో ప్రత్యేకమైన పండగ. గణేశుడు పుట్టినరోజుగా ఈ పండుగను జరుపుకోవడం ద్వారా కుటుంబంలో ఆనందం, ఐక్యత పెరుగుతుందని భావిస్తారు. పురాణాల ప్రకారం ఈ పండగను కృత యుగం నుంచి భక్తులు చేస్తున్నారు.  వినాయక చవితి పండుగను కృతయుగంలో మొదటగా దేవతలు నిర్వహించారట. ముఖ్యంగా ఈ పండుగను స్వయంభువ మనువు గణేశుడి పూజను నిర్వహించడమే వినాయక చవితి పండగకు మొదలు అని కొంతమంది పండితులు తెలిపారు. అప్పటి నుండి ఈ పండుగను ప్రతి యుగంలో, ప్రతి సంవత్సరం భక్తుడు విశ్వాసంతో నిర్వహిస్తున్నారని ప్రతీతి.  కృతయుగం నుండి మొదలై, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంలోనూ విఘ్నేశ్వరుడికి నిరాటంకగా పూజలు కొనసాగుతున్నాయి. అందువల్ల ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలంటే భక్తులు నమ్మకంగా వినాయక చవితి పండగను చేయాలి.
 

అడ్డంకులు తొలగిస్తాడు..
వినాయకుడు విఘ్నాలకు అధిపతి. అంటే ఎటువంటి ఆటంకాలనైనా ఆయన తొలగించగలడట. వినాయకుడికి గణేశుడు, విఘ్నేశ్వరుడు, గణనాథుడు ఇలా అనేక పేర్లు ఉన్నాయి. ఒక్కో పేరుకు ఒక్కో ప్రత్యేక శక్తి ఉంటుందని పండితులు చెబుతున్నారు. మరి విఘ్నేశ్వరుడిగా భావించి పూజ చేస్తే మనం చేసే పనుల్లో ఆటంకాలను ఆయన తొలగిస్తాడట. ముఖ్యంగా వినాయక చవితి రోజు పూజ చేస్తే భవిష్యత్తులో వచ్చే అన్ని విఘ్నాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. 
 


శుభారంభాన్నిస్తాడు..
హిందూ సంప్రదాయంలో ఏ పనైనా ప్రారంభించడానికి ముందు గణపతిని పూజించడం ఆనవాయితీ. ఎందుకంటే ఆ పని సక్రమంగా ప్రారంభమై విజయవంతం చేసేలా విఘ్నేశ్వరుడు శుభారంభాన్ని ఇస్తాడట. మరి చవితి పండగ వినాయక పూజకు అత్యంత శ్రేష్ఠమైన రోజని పురాణాల ద్వారా తెలుస్తోంది. మన లక్ష్యాన్ని నిర్ధేశించుకొని వినాయక చవితి పండగ రోజు విఘ్నేశ్వరుడికి పూజ చేసి, తర్వాత పని ప్రారంభిస్తే కచ్చితంగా నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు. ఏ పనైనా ఆటంకాలు లేకుండా సాగాలంటే విఘ్నేశ్వరుడికి పూజ చేయడం చాలా ముఖ్యం. అందువల్ల ప్రారంభంలోనే ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు, శుభారంభం కలిగేందుకు విఘ్నేశ్వరుడి పూజ చేయడం మంచిదట.
 

ఆధ్యాత్మిక శ్రేయస్సు కలిగిస్తాడు..
మనం ఏ పనిచేసినా సంతృప్తి, మనశ్శాంతి చాలా ముఖ్యం. రెండు సాధించడానికే అందరూ అనేక లక్ష్యాలు పెట్టుకుంటారు. అలాంటి దీర్ఘకాలిక లక్ష్యం నెరవేరేందుకు తరచూ విఘ్నేశ్వరుడిని పూజించడం మంచిదని వేద పండితులు చెబుతున్నారు.  ముఖ్యంగా వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుడికి శక్తి కొద్దీ నివేదనలు పెట్టడం ద్వారా మన మనసు తృప్తి చెందుతుందట. అందువల్ల అనుకున్న లక్ష్యాలు సాధించడానికి మనసు సహకరిస్తుందని ప్రవచన కర్తలు చెబుతున్నారు. మనసు నిశ్చలంగా ఉంటేనే ఎంత పెద్ద పనైనా ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతుందట. అలా జరిగితేనే పని పూర్తయి, ఫలితం పొందగలుగుతామని అంటున్నారు. ప్రత్యేక పండగల సమయంలో విఘ్నేశ్వరుడికి పూజ చేయడం వల్ల ఆధ్యాత్మిక శాంతి, శ్రేయస్సు ఆ భగవంతుడు కలిగిస్తాడని భక్తులు నమ్ముతారు. 
 

మన ద్వారా ధర్మాచరణ
ఈ ప్రపంచం ధర్మాచరణను ఆధారంగా చేసుకొని నడవాలి. అయితే పురాణాల ప్రకారం అధర్మం యుగయుగానికి పెరుగుతూ పోతుందట. ప్రస్తుతం సొసైటీలో జరుగుతున్న ఘటనలు కూడా ఇదే కరెక్టని నమ్మేవిధంగానే ఉన్నాయి. అందువల్ల విఘ్నేశ్వరుడు మన ద్వారా  ధర్మం ఈ భూమిపై నాలుగు పాదాలతో నడిచేలా చేసేందుకు మనకు సహకరిస్తాడట. ముఖ్యంగా వినాయక చవితి రోజు గణేశుడిని పూజించడం ద్వారా మనలో ఉండే అధర్మమైన కోరికలు నశిస్తాయట. తద్వారా సమాజానికి మంచి పనులు చేయాలన్న ఆలోచనలు మనకు విఘ్నేశ్వరుడు కలిగిస్తాడని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా మనం ధర్మాచరణలో పాలుపంచుకోవడానికి గణాధిపతి అవకాశం కల్పిస్తాడట. 

Latest Videos

click me!