ప్రతి ఊరిలో శివాలయం ఉండాలని హిందూ ధర్మంలో ఉంది. చిన్నదో, పెద్దదో శివాలయం ఉండకుండా ఏ ఊరు ఉండదు. అలాంటి ఊర్లేమైనా ఉంటే వాటిని శ్మశానంగా చూసేవారు. అందుకే పూర్వం రాజులు, చక్రవర్తులు ఊరూరా శివాలయాలు నిర్మించేవారు. శాతవాహనులు, చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు ఇలా ఎంతో మంది వారి పరిపాలనా కాలంలో అనేక ఆలయాలను నిర్మించారు. శివలింగాలను వివిధ రకాల వస్తువులతో తయారు చేస్తారు. ఎక్కువగా నల్ల రాతితో చేస్తారు. ఉత్తర భారత దేశంలో పాలరాయిని కూడా ఉపయోగిస్తారు. ఇళ్లలో పూజించే శివలింగాలను వారి ఆర్థిక స్థితి మేరకు బంగారం, వెండి, రాగి, మట్టితోనూ తయారు చేయించి పూజిస్తుంటారు.