తిరుమలలో లడ్డూ ఒకటే కాదు. ఈ ప్రసాదాలు కూడా చాలా ఫేమస్

First Published | Sep 24, 2024, 10:28 PM IST

కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదం తయారీలో నిషేధిత పదార్థాలు వాడారన్న విషయంపై దేశ వ్యాప్తంగా రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల మధ్య విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అసలు స్వామి వారికి లడ్డూ ప్రసాదంతో పాటు ఎలాంటి ప్రసాదాలు నైవేద్యంగా పెడతారో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే లడ్డూ ప్రసాదం కల్తీ అయ్యిందని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా వెల్లడించారు. దీంతో దేశ వ్యాప్తంగా ప్రముఖులు, పండితులు వైసీపీ నాయకులు, ఆ పార్టీ అధినేత జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. మెట్లు కడిగి పూజ చేశారు. అసలు తిరుమలలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ఎన్ని రకాల ప్రసాదాలు నైవేద్యంగా పెడతారో మీకు తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం రండి.
 

తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వైకుంఠంగా పేరుపొందింది. శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా ఇక్కడ వెలిశాడని భక్తుల విశ్వాసం. అష్టాక్షరి మంత్రమైన ‘ఓం నమో నారాయణాయ’ ఈ క్షేత్రంలో మార్మోగుతూనే ఉంటుంది. పచ్చని చెట్లు, కొండలు, జలపాతాల మధ్య స్వామి వారి ఆలయం శోభాయమానంగా వెలిగిపోతూ కనిపిస్తుంది. చల్లని వాతావరణం మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది. ఎటుచూసినా గోవింద నామాలు, వెంకటేశ్వరుడి చిత్రాలు, విగ్రహాలు మనం నిజంగానే వైకుంఠంలో ఉన్నామా అన్నట్లుగా ఉంటుంది. 


వెంకటేశ్వర స్వామి వారి కైంకర్యాలు..
స్వయంభూగా వెలసిన వెంకటేశ్వర స్వామికి బాగా ఇష్టమైనవి లడ్డూ ప్రసాదం. వీటితో పాటు ఆయనకు రోజుకో వెరైటీ చొప్పున వివిధ రకాల ప్రసాదాలు నైవేద్యంగా పెడతారు. అలంకారప్రియుడిగా, ఉత్సవ ప్రియుడు, నైవేద్య ప్రియుడు అయిన వెంకటేశ్వర స్వామికి రాజుల కాలం నుంచి అనేక రకాల పదార్థాలు నైవేద్యంగా సమర్పిస్తున్నారు. వీటిలో ఏ ఏ రాజులు ఎంతెంత ఆస్తి  స్వామి వారి పేరు మీద రాసిచ్చారో ఆలయంలో శాశనాలపై  చెక్కి ఉంది. 1933 లో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడింది. అప్పటి నుంచి ఎంతో నిష్ఠగా వెంకటేశ్వర స్వామికి త్రికాల నైవేద్యం పెడుతున్నారు. 
 

నైవేద్య సమయాలు..
ఈ నైవేద్యం పెట్టే సమయాలను మూడు భాగాలు గా విభజించారు. వాటిని మొదటి గంట, రెండో గంట, మూడో గంట అని పిలుస్తారు. ఆది, సోమ, మంగళ, బుధ, శని వారాల్లో వెంకటేశ్వర స్వామికి సమర్పించే నైవేద్య సమయాలు ఒకేలా ఉంటాయి. గురు, శుక్రవారాల్లో మాత్రం రెండో గంట సమయం మారుతుంది. ప్రతి రోజు స్వామి వారికి తొలి నివేదన ఉదయం 5.30 గంటలకు పెడతారు. రెండో గంట ఉదయం 10 గంటలకు నివేదిస్తారు. మూడో గంట రాత్రి 7.30 నిమిషాలకు ఉంటుంది. గురు, శుక్రవారాల్లో రెండో గంట ఉదయం 7.30 నిమిషాలకు నైవేద్యం పెడతారు. 
 

రోజూ నైవేద్యం పెట్టే ప్రసాదాలు..
ప్రతి రోజూ ఉదయం 5.30 నిమిషాలకు మొదటి గంట సమయంలో శ్రీవారికి నైవేద్యంగా చక్రపొంగలి, కదంబం, పులిహోర, దద్దోజనం, మాత్ర ప్రసాదాలతో పాటు, లడ్డూలు, వడలు నివేదిస్తారు. తరువాత వాటిని బేడి ఆంజనేయస్వామివారితోపాటు ఆలయంలోని ఉపాలయాలకు పంపిస్తారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే రెండో గంటలో పెరుగన్నం, చక్రపొంగలి, పులిహోర, మిర్యాల పొంగలి, సీర, సేకరబాద్ నైవేద్యంగా పెడతారు. రాత్రి 7.30కు  మూడవ గంటలో కదంబం, మొలహోర, తోమాల దోశలు, లడ్డూలు, వడలను నివేదిస్తారు. 
 

ప్రత్యేక ప్రసాదాలివే..
ఆదివారం ప్రత్యేకంగా గరుడ ప్రసాదంగా ప్రసిద్ది చెందిన పిండిని స్వామివారికి సమర్పిస్తారు. సోమవారం విశేష పూజ సందర్బంగా 51 పెద్ద దోశలు, 51 చిన్న దోశలు, 51 పెద్ద అప్పాలు, 102 చిన్న అప్పాలను స్వామివారికి నివేదిస్తారు. మంగళవారం ప్రత్యేకంగా మాత్ర ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతారు. బుధవారం ప్రత్యేకంగా పాయసం, పెసరపప్పును నివేదిస్తారు. గురువారం జిలేబి, మురుకు, పాయసాలను నైవేద్యంగా చెల్లిస్తారు. శ్రీవారికి అభిషేక సేవ జరిగే శుక్రవారం ప్రత్యేకంగా పోళీలను సమర్పిస్తారు. శనివారం కదంబం, చక్రపొంగలి, పులిహోర, దద్దోజనం, మిర్యాలపొంగలి, లడ్డూలు, వడలు, సీర, సేకరాబాద్, కదంబం, మొలహోర, తోమాల దోశలను నివేదన  చేస్తారు. 

Latest Videos

click me!