అధిక రక్తపోటు వల్ల గుండెపోటు, స్ట్రోక్, మెంటల్ స్ట్రెస్, కొన్ని సార్లు మరణం కూడా సంభవించవచ్చు. అందుకనే హైబీపీని సైలెంట్ కిల్లర్ అంటారు. ఇది ధమనిలో అసాధారణంగా రక్తపోటు పెరిగేలా చేస్తుంది. ఇలా హైబీపీకి వివిధ కారణాలు ఉన్నాయి. అయితే లైఫ్ స్టైల్ లో మార్పులు, అధికంగా ఉప్పు తీసుకోవడం, ఊబకాయం, వయస్సు పెరగడం, జన్యుపరమైన కారకాలు, జీవనశైలి అలవాట్లు, ధూమపానం, ఒత్తిడి రక్తపోటుకు సాధారణ కారణాలు. అధిక రక్తపోటును చాలా కాలం పాటు గుర్తించకపోతే అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.
మందులు వేసుకోవాలా వద్దా?
రక్తపోటుకు మందులు ఉన్నప్పటికీ మాత్రలు వేసుకోవడం అలవాటుగా మారకూడదు. కొన్ని యోగా ముద్రల సహాయంతో మీరు మీ అధిక రక్తపోటును నివారించుకోవచ్చు. ముద్ర యోగా సహజ పద్ధతులను ఉపయోగించడం ద్వారా మీరు మీ రక్తపోటును నియంత్రించవచ్చు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
యోగా ముద్రలు నిజంగా అధిక రక్తపోటుకు సహాయపడతాయా?
కొన్ని పరిశోధన అధ్యయనాల ఫలితాలు యోగా ముద్రలు అధిక రక్తపోటును తగ్గిస్తాయని చూపిస్తున్నాయి. యోగాలోని ముద్రలు ఒత్తిడి, ఆందోళనను తగ్గించే సడలింపు చికిత్సకు సమానం. ఇది అధిక రక్తపోటు రోగులు గుండె సమస్యలు, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి, స్ట్రోక్ మొదలైన వాటి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవడంలో కొన్ని ముద్రలు అద్భుతమైన చికిత్సగా ఉంటాయని శాస్త్రీయంగా నిరూపితమైంది.
జూన్ 2020 అధ్యయనం ప్రకారం 15 నిమిషాల అపాన వాయు ముద్ర అభ్యాసం హైపర్‌టెన్సివ్ రోగులలో అధిక రక్తపోటును తగ్గించిందని తేలింది.
2016లో ప్రచురితమైన మరొక అధ్యయనం ప్రకారం వైద్య సేవలు సులభంగా అందుబాటులో లేనప్పుడు అత్యవసర పరిస్థితుల్లో హ్యాండ్ ముద్రలను ఉపయోగించవచ్చని సూచించింది.
మీ ధమనులలో రక్త ప్రవాహానికి నిరోధకత, మీ గుండె పంప్ చేసే రక్తం మొత్తం రక్తపోటును ప్రభావితం చేస్తాయి. మీ గుండె ఎంత రక్తాన్ని పంప్ చేస్తుందో, మీ ధమనులు ఎంత చిన్నగా ఉన్నాయో మీ రక్తపోటు నేరుగా పెరుగుతుంది. మీ సిస్టోలిక్, డయాస్టోలిక్ రక్తపోటు విలువలను సమీక్షించడం ద్వారా వైద్య నిపుణుడు అధిక రక్తపోటును నిర్ధారించగలరు. మీకు ఉత్తమమైన చికిత్సా విధానాన్ని నిర్ణయించగలరు.
సిస్టోలిక్ పీడనం అనేది గుండె ధమనుల ద్వారా రక్తాన్ని పంప్ చేయడం ద్వారా కలిగే పీడనం. ఇది పైన రాసిన సంఖ్య. డయాస్టోలిక్ పీడనం అనేది హృదయ స్పందనల మధ్య గుండె విశ్రాంతిగా ఉన్నప్పుడు ధమనులలో ఉండే పీడనం. ఇది కింద రాసిన సంఖ్య. అందువల్ల 120/80 కంటే ఎక్కువ సంఖ్యల కలయికను హైబీపీగా పరిగణిస్తారు. అధిక రక్తపోటును నియంత్రించడానికి అనేక మందులు ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక వినియోగం దుష్ప్రభావాలకు దారితీస్తుంది.
ముద్రలు హైబీపీ స్థాయిలను ఎలా నియంత్రిస్తాయి?
మనం గుండెకు సంబంధించిన ముద్రలు చేసినప్పుడు అది చిన్న రక్త నాళాల చుట్టూ ఉన్న కండరాలలో ప్రభావాలను చూపిస్తుంది. ఇది ఇరుకైన రక్త ధమనుల విస్తరణకు దారితీస్తుంది, ఇది రక్తాన్ని సులభంగా ప్రవహించడానికి సహాయపడుతుంది. అందువల్ల ముద్ర చేతి కదలికలు చేయడం అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.
అధిక రక్తపోటుకు ముద్రలు ఇలా..
శరీరం ద్వారా శక్తి ప్రవాహాన్ని నిర్దేశించడానికి యోగాలో కొన్ని సూక్ష్మ ముద్రలను తరచుగా ఉపయోగిస్తారు. ఈ ముద్రలను ధ్యానం, ప్రాణాయామంతో కలిపి చేస్తారు. చేతిలో ఉండే కొన్ని నిర్దిష్ట ప్రాంతాలు మెదడు, గుండె పనితీరును ప్రభావితం చూపుతాయని ధ్యాన గురువులు చెబుతున్నారు.
మెదడుకు సంకేతాన్ని పంపడం ద్వారా శరీరం శక్తి నమూనాను మార్చవచ్చు. సూక్ష్మ శరీరంలో ప్రాణ వాయువుల కదలికను నియంత్రించడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. ధమనులలో రక్తపోటును నియంత్రించడానికి వ్యాన వాయు ముద్ర పనిచేస్తుంది. వ్యాన వాయు ముద్ర వంటి ముద్రలు శరీరంలోని గాలి, భూమి మూలకాలను సమతుల్యం చేయడం ద్వారా అధిక రక్తపోటును తగ్గిస్తాయి. దీని ప్రకారం, అపాన వాయు ముద్ర, సూర్య ముద్ర, వినాయక ముద్ర, ప్రాణ ముద్ర, పృథ్వీ ముద్రలు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయని కొందరు వైద్యులు కూడా చెబుతున్నారు. అయితే ఏదైనా యోగా లేదా ముద్ర అభ్యాసాన్ని ప్రారంభించే ముందు యోగా నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.