హిందువులు దేవుళ్ళకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. పండుగలు వచ్చాయంటే ఇళ్లన్నీ పూజలతో కళకళలాడిపోతూ ఉంటాయి. చాలామంది ప్రతిరోజూ పూజ చేయకుండా కనీసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోరు. అయితే పూజ చేసేటప్పుడు దీపం, అగరవత్తులు ఎంత ముఖ్యమో పువ్వులు అంతకన్నా ఎక్కువ ముఖ్యం.
పూజకు తప్పనిసరిగా ఒక పుష్పం ఉండాలి అని పెద్దలు అంటారు. అలా దేవుడికి సమర్పించే పుష్పాలని వాసన చూడకూడదని పిల్లలకి పెద్దలు చెప్తారు. కానీ కారణం మాత్రం చెప్పరు. ఆ కారణమేమిటో ఇప్పుడు చూద్దాం. పువ్వులు దైవశక్తి ని ఆకర్షిస్తాయని నమ్ముతారు.
నిర్దిష్టమైన పువ్వులు నిర్దిష్ట దేవతల పవిత్రతను ఆకర్షించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అటువంటి పుష్పాలని భగవంతుడికి సమర్పించినప్పుడు విగ్రహం లోని భగవంతుని చైతన్యం నుంచి మనం వెంటనే ప్రయోజనం పొందుతాము.
అలాంటి పువ్వులని మనం వాసన చూడటం వల్ల ఆ పువ్వులకి ఉన్న పవిత్రత పోతుందని పెద్దల నమ్మకం. అలాగే కిందపడిన పువ్వు కూడా పవిత్రతని కోల్పోతుంది. అలాంటి పువ్వులని కూడా భగవంతునికి సమర్పించకూడదు అని చెప్తారు పెద్దలు.
ఒక్కొక్క అది దేవతకి ఒక్కొక్క ప్రీతిపాత్రమైన పూలు ఉంటాయి. వాటిని ఆయా దేవతలకు సమర్పించినప్పుడు మన కార్యసిద్ధి కూడా త్వరగా జరుగుతుంది. వినాయకుడికి తెల్ల జిల్లేడు పువ్వులు ఇష్టం కాబట్టి వాటితో పూజ చేయడం చాలా మంచిది. అలాగే పరమేశ్వరుడికి ఉమ్మెత్త పువ్వు అంటే పరమ ప్రీతి.
అలాగే కాళీమాతకి ఎర్రమందారం, మహావిష్ణువుకి పారిజాత పుష్పాలు అంటే చాలా ఇష్టం. ఈ పూలతో ఆయా దేవతలని పూజించటం వలన మనం అనుకున్న పనులు త్వరగా నెరవేరుతాయి. అలాగే పక్కవారి ఇంట్లో వాళ్ళ అనుమతి లేకుండా పూలు కోసి ఆ పూలతో దేవుడిని పూజించటం వలన ఫలితం ఉండదు సరి కదా పాపం అంటుకుంటుంది.