రాఖీ కట్టేటప్పుడు సోదరి చదవాల్సిన శ్లోకం ఏదో తెలుసా..?

First Published | Aug 18, 2024, 1:15 PM IST

భారత సంస్కృతి లో ఎన్నో పండగలు ఉన్నా.. రాఖీ పండుగక ఉన్న ప్రత్యేకత వేరు. కులమతాలకు అతీతంగా.. అన్నాచెల్లి.. అక్కా తమ్ముడు ప్రేమకు ప్రతీరూపంగా జరుపుకునే ఈ పండుగలో ప్రత్యేకతలు ఎన్నో.

rakshabandhan 2024 mantra

రాఖీ పండుగ వచ్చేసింది.. అన్నకోసం చెల్లి.. తమ్ముడుకోసం అక్క తమ సోదరుడికి ఎటువంటి కీడు జరగకూడదు అని రక్షను రాఖీ రూపంలో కడతారు. తమ సోదరి కి కానుకగా తమ్ముడు లేదా అన్న తన స్థాయికి తగ్గ కానుకలు ఇస్తుంటారు. అయితే ఒకప్పుడు  ఈపండుగ రక్తం పంచుకుని పుట్టిన సోదర సోదరీమణుల మధ్య మాత్రమే జరిగేది కాని ఇప్పుడు అలానే జరుపుకోవాలని లేదు.

ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా అవతలివారు ఎవరైనా సరే.. రక్త సబంధం ఉండాలని లేదు... ఆత్మ బంధం ఉంటే చాలు.. రాఖీ కట్టి....వారిని తమ కుటుంబికులుగా చేసుకుంటున్నారు. ఇక ఈరోజుల్లో ఆడవారికి రక్షణ లేకుండా పోయింది. వాయి వరుస లేకుండా.. మహిళలపై అత్యాచారాలు.. హత్యలు.. జరుగుతూనే ఉన్నాయి. ఈ టైమ్ లో ఈ రక్ష బంధన్ పండుగా ఆడవారిని రక్షించే సైనికులుగా ప్రతీ సోదరుడిని తయారు చేయాలని.. ఆడవారిపై అన్యాయంగా అత్యాచారం చేసే మృగాల పాలిట కొరడా జులిపించే పాశమవ్వాలని ప్రతీ  ఒక్కరు కోరుకోవాలి. 


ఇక  ఆత్మీయుల మధ్య అనుబంధాలకు, ఐకమత్యానికి, పరస్పర సహకారానికి చిహ్నంగా రక్షాబంధనం నిలుస్తుంది. రాఖీ పండుగ ను ఓ పద్దతి ప్రకారం చేసుకుంటారుమన భారతీయ సోదర సోదరీమణులు. ఆ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని, రాఖీ కట్టడానికి సిద్ధమవుతారు సోదరీమణులు. సోదరులు కూడా తమ ప్రియమైన సోదరీమణులు కట్టే రాఖీలను స్వీకరించి వారిని సంతోషపెట్టేలా వారికి బహుమానం ఇవ్వడానికి రెడీ అవుతారు.

అయితే రాఖీ కట్టేముందు సోదరి చదవాల్సిన మంత్రం ఒకటి ఉంది. ఇది కొన్ని ప్రాంతాల్లో.. కొంత మంది చదువుతుంటారు. తన సొదరుడికి నేను కట్టే ఈ రక్ష అతన్ని కాపాడాలని కోరకుంటూ ఈ క్రింది మంత్రం చదువుతుంటారు. 

యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః
తేన త్వామభి బద్నామి రక్ష మాచల మాచల" 

అనే శ్లోకాన్ని చదివి రాఖీ కడతారు. ఆ తరువాత హారతి ఇచ్చి, నుదుటన బొట్టు పెట్టి స్వీట్ తినిపిస్తారు. చెల్లెలు అన్న ఆశీర్వాదాన్ని.. అక్క అయితే తమ్ముళ్లకు ఆశీస్సులను అందిస్తారు.

హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రావణ మాసంలో జరుపుకునే ఈ పండుగను మన దేశ వ్యాప్తంగా సోదరులు సోదరీమణులు తమ మధ్య ఉన్న ప్రేమానురాగాలకు ప్రతీక గా జరుపుకుంటారు. సమాజంలో మానవతా విలువలు మంటగలుస్తున్న ఈ రోజుల్లో రాఖీ పౌర్ణమి వంటి పండుగలు జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోదర సోదరీమణుల మధ్య ఉండే అనుబంధానికి, ప్రేమానురాగాలకు ప్రతీకగా అద్దం పట్టే పండుగ  రాఖీ పండుగ కావడంతో మానవ సంబంధాల మెరుగుదలకు, విచక్షణకు ఈ పండుగ దోహదం చేస్తుంది.
 

Latest Videos

click me!