Matsya Dwadashi 2023: విష్ణుమూర్తి 24 అవతారాలలో.. మొదటి అవతారం మత్స్యావతారంగా పరిగణించబడుతుంది. ఈ అవతారంలో విష్ణుమూర్తి చేప రూపం ధరించి భూమిని రక్షించాడు. మత్స్య ద్వాదశి విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. ఈ సంవత్సరం మత్స్య ద్వాదశి డిసెంబరు 23 అంటే ఈ రోజునే జరుపుకుంటున్నారు.
మత్స్యా ద్వాదశి ప్రాముఖ్యత
మార్గశిర్ష మాసంలోని శుక్లపక్షం ద్వాదశి రోజున విష్ణుమూర్తి మత్స్యావతారాన్ని స్వీకరించాడని.. అందుకే ఈ రోజును మత్స్య ద్వాదశిగా జరుపుకుంటారని నమ్ముతారు. హిందూ విశ్వాసాల ప్రకారం.. మత్స్య ద్వాదశి ఉపవాసాన్ని ఆచరించే వారికి మంచి ఆరోగ్యం, శ్రేయస్సు, విజయం లభిస్తాయి. మత్స్య ద్వాదశి రోజున విష్ణుమూర్తి మత్స్య రూపాన్ని పూజించడం వల్ల జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి సుఖశాంతులు కలుగుతాయి.
ఇలా పూజ చేయండి
మత్స్య ద్వాదశి నాడు ఉదయాన్నే నిద్రలేచి స్నానమాచరించాలి. ఆ తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఇంటి ఆలయాన్ని బాగా శుభ్రం చేసి విష్ణువు విగ్రహం లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించాలి. ఆ తర్వాత నీరు, పాలు, నువ్వులు, నెయ్యి మొదలైన వాటితో అభిషేకం చేయాలి. అయితే ముందు వినాయకుడినే పూజించాలి.
ఆ తర్వాత విష్ణువును పూజించే సమయంలో ఆయనకు పూలు, ధూపం, దీపం, నైవేద్యం, కుంకుమ మొదలైనవి సమర్పించాలి. తర్వాత లక్ష్మీ, సరస్వతి సమేత విష్ణుమూర్తిని పూజించాలి. ఈ సమయంలో విష్ణువు మంత్రాలను పఠించాలి. పూజ చేసేటప్పుడు మత్స్యావతారం కథను ఖచ్చితంగా చదవండి. ఆ తర్వాత స్వీట్లను సమర్పించి.. చివరగా హారతి ఇచ్చి అందరికీ ప్రసాదం పంచండి.