చారిత్రక నేపథ్యం..
శ్రీరామ చంద్రుడు రావణాసురుని వధానంతరం తిరిగి అయోధ్య వెళ్తుంటారు. ఈ సమయంలోనే రావనణ వధ కారణంగా తలెత్తిన బ్రహ్మహత్య మహాపాపం అని ఆ దోషాన్ని పోగొట్టుకోవడానికి ఈ కూడవెల్లి వాగు వద్ద శివలింగాన్ని ఏర్పాటు చేసి పూజించాలని అగస్త్య మహాముని శ్రీరాముడికి సూచిస్తారు. ఇందులో భాగంగానే హనుమంతుడిని కాశీ నుంచి శివలింగాన్ని తీసుకురమ్మని శ్రీరాముడు ఆజ్ఞాపిస్తాడు. అయితే ముహుర్త సమయం మించిపోతుండడం, ఆంజనేయుడు ఎంతకీ రాకపోవడంతో శ్రీరాముడే స్వయంగా వాగులోని ఇసుకతో ఒడ్డున సైకత లింగాన్ని ప్రతిష్టిస్తాడు.
అయితే అంతలోనే హనుమంతుడు మరో లింగాన్ని తీసుకొస్తాడు. అప్పటికే శ్రీరాముడు ప్రతిష్టించిన లింగాన్ని చూసిన హనుమంతుడు.. నేను తెచ్చిన లింగం ఎలా అని అడగ్గా.. 'బాధపడకు హనుమ, మొదట నీవు తెచ్చిన లింగానికి పూజలు చేసినాక, నేను ప్రతిష్టించిన సైకత లింగాన్ని పూజిస్తారు' అని చెప్పారంటా. దీంతో ఈ ఆలయంలో రెండు లింగాలు దర్శనమిస్తాయి. ఇసుక లింగం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండడం విశేషం. కొన్ని రోజుల క్రితం వరకు సైకత లింగానికి అభిషేకం చేసే వారు, అయితే ప్యాక్జేడ్ పాలతో అభిషేకం చేయడం వల్ల లింగం కరుగుతున్న విషయాన్ని గమనించిన ఆలయ అర్చకులు వెండితో ఒక కప్పును రూపొందించారు. ఇంతటి చారిత్రక నేపథ్యం ఉంది కాబట్టే ఈ ఆలయానికి భక్తులు ఇంత ఎత్తున తరలి వస్తుంటారు.
ఎలా చేరుకోవాలి.?
సిద్ధిపేట, మెదక్ రహదారిలో భూంపల్లి చౌరస్తా నుంచి కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం ఉంటుంది. హైదరాబాద్ - నిజమాబాద్ హైవేపై వెళ్తుండగా రామాయంపేట నుంచి 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. హైదరాబాద్ నుంచి భక్తులు చాలా సులభంగా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి వచ్చే వారు సిద్ధిపేట లేదా రామాయంపేట మీదుగా ఆలయానికి చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. జాతర సమయంలో సిద్ధిపేట జిల్లాలోని పలు ప్రధాన ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తుంటుంది.