నవరాత్రుల్లో దుర్గామాతను తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో పూజించి పూలను సమర్పిస్తుంటారు. మరుసటి రోజు దేవతను అలంకరించే సమయంలో ఈ పూలన్నింటీని తొలగించి కొత్త పూలను సమర్పిస్తారు. అయితే చాలా మంది ఈ పువ్వులు దేనికీ పనికి రావని పారేస్తుంటారు. ఈ పువ్వులనే కాదు ఇంట్లో పూజ చేసిన పువ్వులను కూడా ఇలాగే చేస్తారు. కానీ ఈ పువ్వులు మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి.
మీకు తెలుసా? పూజకు ఉపయోగించిన పూలను ఇంటి నుంచి తోట పనుల వరకు ఎన్నో విధాలుగా ఉపయోగించొచ్చు. అందుకే దుర్గామాతకు లేదా ఇంట్లో దేవుడికి సమర్పించిన పువ్వులను తిరిగి ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
దేవుడికి సమర్పించిన పాత పూలతో ఏం చేయాలి?
మనలో చాలా మంది పూజ చేసిన తర్వాత చాలా వస్తువలను దేనికీ ఉపయోగపడవని భావిస్తుంటారు. వాటిని చెత్తలో వేస్తుంటారు. కానీ వీటితో ఎన్నో పనులు చేయొచ్చు. ముఖ్యంగా మీరు వీటిని మొక్కలకు ఎరువుగా ఉపయోగించొచ్చు. తోటపనిని ఇష్టపడే వారికి ఎండిపోయిన పువ్వులను ఎన్నో విధాలుగా సహాయపడతాయి.
ఉపయోగించిన పువ్వులతో అగర్ బత్తిని ఎలా తయారు చేయాలి?
దేవుడికి సమర్పించిన పువ్వులను మీరు అగర్ బత్తీలను తయారుచేయడానికి కూడా ఉపయోగించొచ్చు. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అయితే మీరు ఉపయోగించే పువ్వులు మురికిగా లేదా చెడిపోయినవి అయ్యి ఉండకూడదు.
శుభ్రమైన పువ్వులను తీసుకుని వాటి కాడలను తొలగించి రేకులను ఎండలో బాగా ఎండబెట్టండి. ఆ తర్వాత పువ్వులను గ్రైండర్ లో వేసి బాగా గ్రైండ్ చేసుకోండి. ఆవు పేడ పిడకలు, గుగ్గుల పొడి, కర్పూరం, లవంగాలు, గంధం, సుగంధ ద్రవ్యాలు, నెయ్యి వేసి కలపాలి. ఇప్పుడు తయారు చేసిన మెటీరియల్ నుంచి అగర్ బత్తీలను తయారు చేసుకోవాలి.