తిరుమలలో లడ్డూ.. మరి విజయవాడ, శ్రీశైలం, కాణిపాకంలో ప్రసాదాలేంటో తెలుసా?

First Published | Sep 26, 2024, 4:31 PM IST

తిరుమల లడ్డూ ప్రసాదం చాలా ఫేమస్. అయితే దీని తయారీలో జంతువుల కొవ్వు పదార్థాలు కలిపారన్న విషయం అందరినీ షాక్ కు గురిచేస్తోంది. దీంతో అసలు తిరుమల లడ్డూ ఏవిధంగా తయారు చేస్తారని అందరూ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కథనంలో తిరుమల లడ్డూతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఎలాంటి ప్రసాదాలు పెడతారు? వాటిలో వాడే సరకుల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 
 

తిరుమల వెంకటేశ్వర స్వామి
కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైనది లడ్డూ. అందుకనే భక్తులకు కూడా లడ్డూ ప్రసాదాన్నే ఎక్కువగా ఇస్తుంటారు. 1940 సంవత్సరంలో కళ్యాణోత్సవాల సమయంలో మాత్రమే మనం ఇపుడు చూసే లడ్డూలు తయారు చేసేవారు. భక్తుల కోరిక మేరకు కొంత కాలంగా ప్రతి రోజు తయారు చేసి పంచుతున్నారు. దీన్ని తయారుచేయడానికి ప్రత్యేక పద్ధతి ఉంది. దాన్ని దిట్టం అని పిలుస్తారు. 

లడ్డూ తయారీలో వాడే సరకులు ఏమిటంటే..
ఆవు నెయ్యి, శనగపిండి, చక్కెర, యాలుకలు, ఎండు ద్రాక్ష, కలకండ, ముంతమామిడి పప్పు 
 

శ్రీశైలం మల్లికార్జున స్వామి 
12 జ్యోతిర్లింగాలలో రెండోది మల్లికార్జున స్వామి క్షేత్రం. అంతేకాకుండా 18 మహా శక్తి పీఠాలలో ఆరోది ఇక్కడ ఉన్న భ్రమరాంబ దేవి ఆలయం. ఒకే ఆలయ ప్రాంగణంలో రెండు విశిష్టమైన దేవదేవులు ఉండటం శ్రీశైలం ప్రత్యేకత. శ్రీశైలానికి శ్రీగిరి, సిరిగిరి, శ్రీపర్వతం, శ్రీనాగం వంటి పేర్లు కూడా ఉన్నాయి. సత్యయుగంలో నరసింహస్వామి, త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపరయుగంలో పాండవులు, కలియుగంలో నిత్యం లక్షల మంది భక్తులు శ్రీశైలాన్ని దర్శిస్తున్నారు. ఈ క్షేత్రంలో ముఖ్యంగా పులిహోర, చక్కెర పొంగలిని ముఖ్య ప్రసాదాలుగా భక్తులకు పంచుతారు. 

పులిహోర తయారీలో బియ్యం, కరివేపాకు, ఎండుమిర్చి, నెయ్యి ఉపయోగిస్తారు.
చక్కెర పొంగలి తయారీలో బియ్యం, పప్పు, బెల్లం, నెయ్యి, ఎండ ద్రాక్ష వినియోగిస్తారు. 


విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం విజయవాడ కనకదుర్గమ్మ గుడి. కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారి గురించి తపస్సు చేశాడు. కరుణించిన అమ్మవారిని తన హృదయస్థానంలో కొలువుండమని కీలుడు కోరాడట. రాక్షస సంహారం అనంతరం కీలుడు పర్వతంగా మారడంతో అమ్మవారు కీల పర్వతంపై కొలువు తీరిందట. అందుకే కీలాద్రిగా పేరు వచ్చింది. ఇంద్రుడు ఇక్కడకు వచ్చి పూజలు చేయడంతో ఇంద్ర కీలాద్రిగా పేరుపొందింది. భక్తుల కొంగుబంగారంగా మారిన విజయవాడ క్షేత్రంలో అమ్మవారి ప్రసాదం భక్తులకు ముఖ్యంగా పులిహోర, లడ్డూ పంచుతారు. 

పులిహోరను బియ్యం, శనగపప్పు, చింతపండు, నూనె, బెల్లం, కరివేపాకు, ఎండుమిర్చితో తయారు చేస్తారు.
లడ్డూను శనగ పిండి, పంచదార, జీడిపప్పు, కిస్మిస్, ఎండుద్రాక్ష, యాలకులు, జాజికాయ, పచ్చ కర్పూరం, నెయ్యి ఉపయోగించి తయారు చేసి భక్తులకు పంచుతారు.

అన్నవరం సత్యనారాయణ స్వామి
అన్నవరంలో ఉన్న సత్యనారాయణ స్వామి టెంపుల్ హిందూ-వైష్ణవ దేవాలయం. ఈ ఆలయం రత్నగిరి కొండపై ఉంది. విష్ణువు అవతారమైన వీర వెంకట సత్యనారాయణ ఈ కొండపై కొలువుదీరారు. స్థలపురాణం ప్రకారం మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేశారు. విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పొందుతారు. ఒకరేమో భద్రుడు. ఆయన విష్ణుమూర్తి గురించి తపస్సు చేసి వరం పొంది శ్రీ రామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాద్రిగా మారారు. ఇంకొకరు రత్నకుడు ఆయనకు కూడా విష్ణువు గురించి తపస్సు చేయగా, మహావిష్ణువు శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి రూపంలో రత్నగిరి కొండపై కొలువుతీరారట. సత్యనారాయణ స్వామికి ఇష్టమైన ఆహారం కేసరి ప్రసాదం. అయితే ఇక్కడ తయారు చేసే ప్రసాదం టేస్ట్ ఎక్కడా దొరకదు. 

ఎర్ర గోధుమ నూక, బెల్లం, పటిక, పంచదార

కాణిపాకం వినాయకుడు
ఈ దేవాలయాన్ని 11వ శతాబ్ద ప్రారంభంలో చోళ రాజు మొదటి కుళుత్తుంగ చోళుడు నిర్మించాడు. తరువాత 1336లో విజయనగర సంస్థాన చక్రవర్తులు దీన్ని అభివృద్ధి చేసారు. చారిత్రక కథనం ప్రకారం వికలాంగులైన ముగ్గురు అన్నదమ్ములకు చెందిన ఓ పొలంలోని బావిలో వినాయకుడు స్వయంభూగా వెలిశాడు. బావిలో నీరు లేకపూడిపోవడంతో గునపంతో తవ్వుతుండగా ఆ అన్నదమ్ములకు ఈ విగ్రహం కనిపించింది. స్వామి అనుగ్రహంతో వారికి అంగవైకల్యం పోవడంతో ఊరి జనం అంతా స్వామివారికి కొబ్బరి కాయల నీటితో అభిషేకాలు చేయడం ప్రారంభించారు. అందుకే కాణిపరక అన్న తమిళ పేరు ఆ ఊరికి వచ్చింది. తర్వాత కాలంలో కాణిపాకంగా మారింది. వరసిద్ధి వినాయక స్వామికి నిత్యం పులిహోర, పరమాన్నం నైవేద్యంగా పెడతారు. ప్రత్యేక సందర్భాల్లో కుడుములు నైవేద్యంగా సమర్పిస్తారు. 

కుడుముల తయారీకి వాడే పదార్థాలు
బియ్యం పిండి, బెల్లం తుమురు, కొబ్బరి తురుము, యాలకుల పొడి, నెయ్యి

Latest Videos

click me!