Navratri: శరన్నవరాత్రులు... అమ్మవారి పూజా విధానం.. ఏ రోజు ఎలా చెయ్యాలంటే?

First Published Oct 3, 2021, 11:23 AM IST

Navratri: ప్రతి ఏడాది శుక్లపక్షం ఆశ్వయుజ మాసం దశమి రోజు విజయదశమి పండుగ వస్తుంది. ఈ పండుగకు తొమ్మిది రోజుల ముందు దేవీ నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

Navratri: ప్రతి ఏడాది శుక్లపక్షం ఆశ్వయుజ మాసం దశమి రోజు విజయదశమి పండుగ వస్తుంది. ఈ పండుగకు తొమ్మిది రోజుల ముందు దేవీ నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఇక ఈ నవరాత్రులలో అమ్మవారు ఒక్కో అవతారంలో దర్శనమిస్తుంది. ఇక ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించడానికి కొన్ని నియమాలు పాటించాలి. ముందుగా పూజా విధానాలు తెలుసుకోవాలి.
 

దేవీ నవరాత్రులు ముందురోజే అన్ని పూజాసామాగ్రి సిద్ధం చేసుకోవాలి. పూజమందిరంలో 9 అంగుళాలు ఎత్తుగల పీఠాన్ని ఏర్పరుచుకోవాలి. ఆ పీఠముపై ఎర్రని వస్త్రమును పరచి అందులో బియ్యం పోసి దానిపై సువర్ణ కలశమును ఉంచాలి. ముందుగా కలశమునకు దారం చుట్టి అందులో స్వచ్ఛమైన నీటిని నింపి లవంగములు, యాలకులు, జాజికాయ, పచ్చ కర్పూరము వంటి కొన్ని సుగంధ ద్రవ్యాలను వేయాలి. 
 

అంతేకాకుండా నవరత్నాలు, పంచలోహాలు, పసుపు, కుంకుమ, రక్త చందన, మామిడి, చందనాదులు, మారేడు, మోదుగ, మర్రి, జమ్మి చిగుళ్ళు, పరిమళ పుష్పాలను ఉంచాలి. ఇక ఆ కలశంపై టెంకాయను సిద్ధం చేసుకోవాలి. ముందుగా పీచు తీయని, ముచిక కలిగిన టెంకాయను తీసుకొని దానికి ఎర్రని చీర, రవిక వేసి కలశముపై పెట్టాలి. ఇక కలశమును చందన, కుంకుమ, పుష్పాలతో అలంకరించుకోవాలి.
 

భూమిపైన పడుకోవాలి: ఎవరైతే నవరాత్రి పూజలు చేయడానికి సిద్ధంగా ఉన్నారో.. వారు భూమిపైనే పడుకోవాలి. సంసారిక సుఖంకి దూరంగా ఉండాలి. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకొని స్నానమాచరించాలి. మౌనంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలి. అమ్మవారిని తలుచుకొని పూజ చేసి సాయంకాలం వరకూ ఉపవాసం ఉండి నక్షత్రము దర్శించిన తర్వాత భోజనం చేయాలి.
 

అమ్మవారికి ధరించే వస్త్రాలు: అమ్మవారికి ఎర్రటి వస్త్రములు ధరించాలి. ఎర్రచందనం, చందనం, పసుపు,  కుంకుమను ధరించాలి. ముత్యాల పగడాలు, రుద్రాక్ష మాలికలను ధరించాలి. అమ్మవారికి ఇష్టమైన బాల షడక్షరి, లలిత పంచదశాక్షరీ, రాజా రాజేశ్వరి, మహా షోడాషాక్షరీ మహా మంత్రాలను జపించాలి. అమంగళకరమైన మాటలను మాట్లాడకుండా అమ్మవారిని తలచుకుంటూ ఉండాలి.
 

అమ్మవారిని పూజించే విధానం: ముందుగా విఘ్నేశ్వర పూజను చేయాలి. రక్షాబంధన, కలశ పూజ చెయ్యాలి. ప్రాణప్రతిష్ట కరన్యాసములు చేయాలి. సహస్రనామములతో, త్రిశతీ నామములతో, అష్టోత్తర శతనామాలతో, దేవి ఖడ్గమాల నామములతో, పసుపు, కుంకుమ, హరిద్రాక్షతలు, కుంకుమాక్షతలు, రక్త చందనాక్షతలు, శ్రీచందనాక్షతలు, బిల్వదళములు, తులసిదళములు, పరిమళ పుష్పాలతో అర్చన చేయాలి.
 

అమ్మవారిని నిత్యం ఆరాధించే విధానం: తొమ్మిది అవతారాలలో అలంకరించుకొని పూజించాలి. సింహవాహనంపై అష్టభుజాలతో, అష్టవిధ ఆయుధాలతో సౌమ్య స్వరూపిణిగా చతుర్భుజాలతో సింహాసనంపై కూర్చొని శిరస్సుపై కిరీటంలో చంద్ర వంకను ధరించిన అమ్మవారి విగ్రహాన్ని స్థాపించుకొని నిత్యం పూజలు చేయాలి.అమ్మవారికి ఇష్టమైన ఫలములను, చలివిడి, వడపప్పు, పానకము, తేనె, పంచదార, పెరుగు సమర్పించి మంగళహారతి ఇచ్చి అమ్మవారిని నమస్కరించుకోవాలి
 

పూజ ఫలితం కోసం చేయాల్సిన విధానం: అమ్మవారికి ఇష్టమైన దేవి భాగవత, సౌందర్యలహరి పారాయణలను చేసుకోవాలి. కొన్ని అర్చనలతో నిత్యం అమ్మవారిని పూజించాలి. అమ్మవారికి ఇష్టమైన భజన గీతాలను వినిపించాలి. సహస్ర నామాలను స్మరించాలి. నిత్యం అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించాలి. హోమాలు చేయడంవల్ల అమ్మవారికి సంతృప్తి కలుగుతుంది. ఇలా చేయడం వల్ల ఫలితం ఉంటుంది.

click me!