వినాయక చవితి రోజు గణపతిని తులసీ దళాలతో పూజించవచ్చా? పురాణాల్లో ఏం చెప్పారంటే

First Published Sep 4, 2024, 10:25 PM IST

విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడి పుట్టిన రోజు వచ్చేస్తోంది. బాధ్రపద శుద్ధ చవితి రోజు విఘ్నేశ్వరుడికి విశేషంగా పూజలు చేస్తారు. ఆ రోజు 21 రకాల పత్రాలతో పూజిస్తారు. మరి ఆ లిస్టులో తులసీ దళాలు ఉన్నాయా..  లేవా.. ఎందుకంటే సాధారణ రోజుల్లో అయితే వినాయకుడికి తులసీ దళాలతో పూజించరు. మరి చవితి పండగ కదా.. తులసీ దళాలలో పూజించవచ్చో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.

వినాయక చవితి పండగను భక్తులంతా చాలా ఘనంగా జరుపుకుంటారు. పెద్ద నగరాల నుంచి చిన్న తండాల వరకు ప్రతి కాలనీ, వీధిలో గణపతి విగ్రహాలు నెలకొల్పి 9 రోజులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. పట్టణాల్లో అయితే డీజే సౌండ్లు, ప్రత్యేక ప్రోగ్రామ్‌లతో సందడి చేస్తుంటారు. అయితే ప్రభుత్వం అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు కొన్ని చర్యలు చేపట్టింది. అనుమతులు తీసుకొనే ప్రత్యేక కార్యకలాపాలు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. 
 

వినాయకుడి పుట్టుక జరిగింది ఇలా..
వినాయకుడిని పార్వతీ దేవి సున్నిపిండితో తయారు చేసింది. స్నానం చేసేందుకు సిద్ధమవుతూ సున్నిపిండిని  కలుపుతుండగా యథాలాపంగా ఓ బాలుడి రూపం చేస్తుంది పార్వతి. అది చూడటానికి చాలా అందంగా ఉండటంతో అమ్మవారు ప్రాణం పోస్తుంది. ఆ బాలుడి ముద్దులొలికే మాటలు వింటూ స్నానానికి ఆలస్యమవుతోందని గుర్తించి బాలుడిని కాపలా ఉండమని పార్వతీ దేవి స్నానానికి వెళుతుంది. ఇంతలో శివుడు బయట నుంచి వచ్చి పార్వతీ దేవి మందిరంలోకి వెళుతుండగా బాలుడు అడ్డుకుంటాడు. వారి ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదంలో శివుడు కోపంతో బాలుడి శిరస్సు ఖండిస్తాడు. పార్వతీ దేవి వచ్చి విషయం తెలుసుకొని తన బిడ్డను బతికించాల్సిందేనని పట్టుపట్టడంతో శివుడు గజాసురుడు అనే ఏనుగు తలను అతికించి తిరిగి ప్రాణం పోస్తాడు. ఇది గణపతి పుట్టుక వెనున కథ. ఆ రోజునే మనం అందరం వినాయక చవితి చేసుకుంటాం. 
 

Latest Videos


అసలు వినాయక చవితి రోజు తులసీ దళాలతో పూజ చేయవచ్చో లేదో , పండితులు ఏమి చెబుతున్నారు. పురాణాల్లో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. 

పురాణాల్లో ఏముందంటే..
వినాయకుడికి తులసీ దళాలతో పూజ చేయకూడదని రెండు పురాణాల్లో రాసి ఉంది. అవి ఏంటంటే శివ పురాణం, గణేశ పురాణం. శివ పురాణంలో ఏముందంటే.. ఒకసారి గణపతి ధ్యానం చేస్తుండగా తులసి ఆయన వద్దకు వచ్చిందట. ఆయన ధ్యాన రూపం నచ్చి తనను వివాహం చేసుకోమని కోరిందట. ఈ ప్రపోజల్ ఇష్టం లేరి విఘ్నేశ్వరుడు తులసీ దేవితో పెళ్లి తిరస్కరించాడట. ఆగ్రహం వ్యక్తం చేసిన తులసి వినాయకుడికి ఇక ఎవరితోనూ వివాహం జరగకూడదని శపించిందట. దీనికి ప్రతిగా వినాయకుడు కూడా తులసిని శపించాడట. ఇకపై తనకు తులసీ దళాలతో పూజ చేయకూడదని ముల్లోకాలకు తెలియజేశాడట. గణేశ పురాణంలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. 
 

పండితులు ఏం చెబుతున్నారు..
సాధారణంగా నిత్యం చేసే ఆరాధనలో తులసీ దళాలతో వినాయకుడిని పూజించడం కరెక్టు కాదని పండితులు చెబుతున్నారు. పురాణాల్లో ఉన్న కథల ఆధారంగా ఇలా చేయవద్దని భక్తులకు సూచిస్తున్నారు. అయితే ఉత్తర భారత దేశంలో కొన్ని ప్రాంతాల్లో నిత్య పూజలోనూ తులసీ దళాలు ఉపయోగిస్తారు. 
 

వినాయక చవితికి తులసీ దళాలతో పూజించవచ్చా లేదా..
పురాణాల ప్రకారం గణపతికి తులసీ దళాలతో పూజించడం ఇష్టం లేనప్పటికీ ఒక్క వినాయక చవితి రోజు మాత్రం పూజించవచ్చని పండితులు చెబుతున్నారు. వినాయక చవితి రోజు 21 రకాల పత్రాలతో గణపతిని పూజిస్తారు. ఆ 21 రకాల్లో దూర్వా, బిల్వ, ఆర్గవద, దాడిమి, బదరీ, కరక, దేవదారు, శమీ, అశ్వత్థ, అర్జున, మాధుక, నేరేడు, వంటి పత్రాలున్నాయి. ఈ 21లో తులసీ పత్రం కూడా ఉందని పండితులు చెబుతున్నారు. ఒక్క వినాయక చవితికి మాత్ర తులసీ దళాలను పూజించవచ్చని, ఎలాంటి దోషాలు ఉండవని చెబుతున్నారు. 
 

click me!