సింగిల్ విండో క్లియరెన్స్ ఇలా..
వినాయక మండపం ఏర్పాటు చేసే ప్రజల కోసం ప్రత్యేకంగా ఒక సింగిల్ విండో క్లియరెన్స్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఇంతకు ముందు వినాయక మండపం ఏర్పాటు చేయాలంటే అగ్నిమాపక శాఖ, పురపాలక శాఖ, విద్యుత్ శాఖ, పోలీసు శాఖల నుంచి నిరభ్యంతర (NOC) సర్టిఫికేట్ తీసుకోవాల్సి వచ్చేది. దీనికోసం ప్రజలు ఆయా శాఖల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఆ ఇబ్బందులు తొలగిస్తూ ప్రజల వెసులుబాటు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సింగిల్ విండో క్లియరెన్స్ విధానం తీసుకొచ్చింది.
వాట్సాప్ లోనే వివరాలన్నీ..
వినాయక మండపం ఏర్పాటు చేయాలనుకుంటే ప్రజలు 79950 95800 మొబైల్ నంబర్ కు Hi అని WhatsApp చేస్తే చాలు. నిరభ్యంతర పత్రం (NOC) పొందడానికి ఏమేం చేయాలో ఆ ప్రక్రియ మొత్తం WhatsApp ద్వారా మొబైల్ ఫోన్ కు వస్తుంది. మన వాట్సాప్‌కు వచ్చిన https://ganeshutsav.net/ లింక్‌ను క్లిక్ చేయాలి.
ఆన్ లైన్ లోనే NOC సర్టిఫికేట్..
https://ganeshutsav.net/ లింక్‌ను క్లిక్ చేశాక... ganeshutsav అనే వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది.
అక్కడ New Application (న్యూ అప్లికేషన్)పై క్లిక్ చేయాలి.
NOC కోసం దరఖాస్తు చేస్తున్న అప్లికెంట్ ఫోన్ నంబర్ నమోదు చేయాలి.
ఆ నంబరుకు ఓటీపీ వస్తుంది.
దాన్ని ఎంటర్ చేసిన తర్వాత గణేష్ మండపం ఏర్పాటు చేయదలచిన కమిటీ సభ్యుల వివరాలు నమోదు చేయాలి.
అంతేకాకుండా మండపం ఏర్పాటు చేసే ప్రదేశం, ఏ పోలీసు స్టేషన్ పరిధి లోకి వస్తుంది అనే వివరాలు ఇవ్వాలి.
తరువాత విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు, విగ్రహ ప్రతిష్ఠ ఏ రోజు జరుగుతుంది? నిమజ్జనం ఎక్కడ చేస్తారు? ఏ సమయంలో చేస్తారు? ఏ వాహనం ద్వారా నిమజ్జనం చేస్తారు..? వంటి వివరాలను నమోదు చేసి ఆన్‌లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి.
SHO పోలీసే కీలకం..
ఇలా ఆన్‌లైన్ లోనే చేసిన దరఖాస్తు సంబంధిత పోలీసు స్టేషన్ ఎస్. హెచ్.ఓ(SHO) వద్దకు వెళ్తుంది. అనంతరం ఎస్.హెచ్.ఓ (SHO) ఆధ్వర్యంలో పురపాలక శాఖ, అగ్ని మాపక శాఖ, విద్యుత్ శాఖలకు చెందిన సిబ్బంది ఒక బృందంగా ఏర్పడి మండపం ఏర్పాటు చేసే ప్రదేశాన్ని చూడటానికి వస్తారు. అన్ని విషయాలు పరిశీలించి సానుకూలంగా ఉంటే QR కోడ్ తో కూడిన నిరభ్యంతర పత్రం జారీ చేస్తారు. అనుమతి పొందడానికి అవసరం అయిన రుసుము వివరాలు తెలియచేస్తారు. కమిటీ సభ్యులు వారికి దగ్గరలో ఉన్న మీసేవ కేంద్రంలో ఆ డబ్బు చెల్లించి రసీదు తీసుకోవాలి. ఆ రసీదును మళ్లీ వెబ్ సైట్‌లో అప్లోడ్ చేయాలి. అప్పడు ఎస్. హెచ్.ఓ (SHO) వాటిని పరిశీలించి వెంటనే నిరభ్యంతర(NOC) పత్రాన్ని జారీ చేస్తారు.
మండపం నిర్వహణలో నిబంధనలు..
రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి కార్యక్రమాలూ నిర్వహించకూడదని పోలీసు శాఖాధికారులు తెలిపారు. హుండీలు, విలువైన వస్తువులు ఉన్న చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బలవంతంగా చందాలు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గణపతి మండపాల దగ్గర ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే సౌండ్ బాక్సులు ఉపయోగించాలన్నారు. గణపతి విగ్రహాలను రహదారులపై ఏర్పాటు చేయకూడదని కచ్చితంగా చెప్పారు. ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగేలా బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టకూడదని సూచించారు.
తరచూ పోలీసుల చెకింగ్..
ఈ నిరభ్యంతర పత్రాన్ని ప్రింట్ తీసి గణేష్ మండపంలో ఉంచాలి. కొందరు మండపాల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు చేస్తుంటారు. అలాంటివి జరగకుండా పోలీసులు తనిఖీలు చేస్తుంటారు. అలాంటి సమయంలో ఈ పత్రాన్ని చూపించాల్సి ఉంటుంది. పోలీసులు NOCపై ఉన్న QR కోడ్ ని స్కాన్ చేసి తనిఖీ చేస్తారు.