ఏదైనా కొత్త సంబంధంలోకి అడుగుపెట్టిన తర్వాత బాధ్యతలు బాగా పెరుగతాయి. వీటితో పాటుగా ఒకరిపై ఒకరికి అంచనాలు కూడా పెరుగుతాయి. ఈ రెండే మీ బంధం ఎలా ఉండాలో నిర్ణయిస్తాయి. అయితే అంచనాలు కొన్నిసార్లు లింగంపై కూడా ఆధారపడి ఉంటాయి. అంటే భార్య ఇంటి పనులు చక్కబెట్టుకోగలగాలి. అలాగే కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. ఇక అమ్మాయిలు కూడా తమ భర్తల నుంచి ఎన్నో విషయాలను ఆశిస్తారు. రిలేషన్ షిప్ లో భాగస్వామిపూ కొన్ని అంచనాలను పెట్టుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ఈ అంచనాల వల్ల మీ మధ్య గొడవలు, కొట్లాటలు రాకుండా ఉండాలి. ఈ అంచనాలే మీరు విడిపోయేలా చేస్తాయి. మరి భాగస్వామి నుంచి ఎలాంటి అంచనాలు పెట్టుకోకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
నన్ను వదిలేస్తావా?
నన్ను వదిలేసి వెళ్లిపోతారేమో అన్న అభద్రత భావం ఆడవాళ్లలోనే కాదు మగవారిలో కూడా ఉంటుంది. ఈ కారణంగా వీళ్ల మనస్సులో సందేహం, అపనమ్మకం నిండిపోతాయి. అలాగే దీనివల్ల వీరు తరచుగా గొడవ పడొచ్చు. కానీ సంబంధం ఎప్పుడు ఒకేలా ఉండదని తెలుసుకోండి. వైవాహిక జీవితంలో గొడవలు, కొట్లాటలతో పాటుగా వివిధ హెచ్చుతగ్గులు వస్తూనే ఉంటాయి. అంత మాత్రానా విడిపోతారు అనుకోవడం పిచ్చితనమే అవుతుంది. అందుకే నన్ను వదిలేస్తావా అని పదేపదే మీ భాగస్వామిని అడగకండి. ఇది వాళ్లకు చిరాకు కలిగిస్తుంది.
మిమ్మల్ని సంతోషంగా ఉంచడమే మీ భాగస్వామి పని కాదు
సంతోషంగా ఉంచే బాధ్యత ఒకరి భుజాలపైనే ఉండకూడదంటారు నిపుణులు. ఇక మీ భాగస్వామి ఏ మూడ్ లో ఉన్నా మిమ్మల్ని ఎప్పుడూ సంతోషంగా ఉంచాలని ఆశించడం పెద్ద తప్పు. ఇలా సంతోషంగా ఉంచాలనుకునే ప్రయత్నం రెండు వైపుల నుంచి ఉండాలి. అప్పుడే మీ బంధం ఆనందంగా ముందుకు సాగుతుంది. ఒకరి అవసరాలు, పరిస్థితిని మరొకరు అర్థం చేసుకుంటే సంతోషంగా ఉంటారు. దీనివల్ల మీరు ప్రత్యేకంగా మీ భాగస్వామిని సంతోషపెట్టాల్సిన అవసరము కూడా ఉండదు.
ప్రతి దానికీ ఒప్పుకోవాలి
ఒక్కొక్కరి ఆలోచనలను ఒక్కోలా ఉంటాయి. అందుకే మీరు చెప్పే ప్రతిదానికి మీ భాగస్వామి అవును అని చెప్తారని ఆశించడం కూడా తప్పే అవుతుంది. దీనికోసం భార్యా లేదా భర్తపై ఒత్తిడి తేవడం, కోపగించుకోవడం లాంటి పొరపాట్లు చేయకండి. ఎందుకంటే వీటివల్ల గొడవలు, కొట్లాటలు మాత్రమే పెరుగుతాయి. అందుకే మీ భాగస్వామి అభిప్రాయాలను గౌరవించండి. అర్థం చేసుకోండి.