ఒకప్పుడు పెళ్లి అంటే పెద్దలు మాత్రమే కుదిర్చేవారు. పెళ్లి తర్వాత మాత్రమే దంపతులు మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదు మొత్తం మారిపోయింది. ప్రేమ వివాహాలు మాత్రమే కాదు.. పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా.. ముందే అన్నీ మాట్లాడేసుకుంటున్నారు. ఒకరి అభిరుచులు మరొకరు తెలుసుకున్న తర్వాతే పెళ్లిదాకా వెళ్తున్నారు. అయితే... పెళ్లి ముందు మాట్లాడుకునే సమయంలో ఏవేవో కబుర్లు కాకుండా.. కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా మాట్లాడుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అసలు ఎలాంటి విషయాలు మాట్లాడాలి..? ఏవి మాట్లాడటం వల్ల... భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉంటాయి అనే విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం...
couples
పెళ్లికి ముందే.. మీరు బంధంలోకి అడుగుపెట్టే వ్యక్తితో... కమ్యూనికేషన్ ఏర్పరుచుకోవాలి. మాట్లాడటం మాత్రమేకాదు.. ఎలా మాట్లాడతారు అనే విషయం కూడా తెలుసకోవాలి. సంబంధంలో మీ కమ్యూనికేషన్ శైలి , వ్యక్తిత్వం చాలా ముఖ్యమైనవి. పరస్పరం కమ్యూనికేషన్ శైలుల గురించి బహిరంగంగా మాట్లాడటం, మీరు వైరుధ్యాలు, విబేధాలు , వాదనలను ఎంత చక్కగా నిర్వహిస్తారో అన్వేషించడం ముఖ్యం. విభిన్న పరిస్థితులకు మీరు ఎలా స్పందిస్తారు, మీరు ఎలా మారవచ్చు అనేదాని గురించి చర్చించడం చాలా ముఖ్యం. ఇవి ముందే తెలిస్తే.. భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉంటాయి.
పెళ్లికి ముందే మాట్లాడుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు శారీరకంగా సన్నిహితంగా ఉండటం, మానసికంగా కనెక్ట్ అయిన అనుభూతి, మీ వివాహం ఎలా ఉంటుందో ఊహించడం వంటి అంశాలలో మీరు ఏమి ఆశించారు. వివాహం, నిబద్ధత , మీరిద్దరూ కలిసి నాణ్యమైన సమయాన్ని ఎలా గడపాలని అనుకుంటున్నారు..? లాంటి విషయాల్లో . మీ ఆలోచనలను బహిరంగంగా వ్యక్తపరచండి. ఒకరి అభిప్రాయాలను మరొకరు క్లియర్ గా వినే ప్రయత్నం చేయాలి.
పెళ్లి తర్వాత కూడా ఎవరికి వారికి పర్సనల్ స్పేస్ అనేది కచ్చితంగా ఉండాలి. ఒకరిని మరొకరు రూల్ చేయాలి అని చూడటం కూడా మంచి విషయం కాదు. ఈ విషయం గురించి కూడా ముందు మాట్లాడుకోవాలి. ఎవరి పర్సనల్ స్పేస్ లోకి మరొకరు వెళ్లే ప్రయత్నం చేయకూడదు. దాని గురించి కూడా ముందే క్లారిటీగా మాట్లాడుకోవడం ముఖ్యం.
మరో ముఖ్యమైన విషయం.. పెళ్లి చేసుకునే ముందు మీ భాగస్వామితో మీ ఆర్థిక పరిస్థితి గురించి బహిరంగంగా , పారదర్శకంగా ఉండటం చాలా అవసరం. ఆదాయం, అప్పు, పొదుపు , ఖర్చు అలవాట్ల గురించి నిజాయితీగా చర్చించడం ముఖ్యం. అదనంగా, మీరు జంటగా ఉమ్మడి ఖర్చులు, ఆర్థిక లక్ష్యాలను ఎలా నిర్వహిస్తారు అనే దానితో పాటు దీర్ఘకాలిక బడ్జెట్ , ఆర్థిక ప్రణాళిక గురించి మాట్లాడండి. ఈ బహిరంగ సంభాషణ ఇద్దరు భాగస్వాములు ఒకరి ఆర్థిక పరిస్థితి గురించి మరొకరు తెలుసుకునేలా చేస్తుంది.
వీటితోపాటు... కుటుంబాన్ని ప్రారంభించే విషయం గురించి కూడా మాట్లాడుకోవడం చాలా అవసరం. మీరు ఎంత మంది పిల్లలను కావాలని అనుకుంటున్నారు..? ఎప్పుడు కావాలి అనుకుంటున్నారు అనే విషయం గురించి కూడా ముందే మాట్లాడుకుంటే.. ఇద్దరికీ ఒక అవగాహన ఉంటుంది... భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉండేందుకు కూడా సహాయపడుతుంది.