గర్భిణీలు వంకాయలు తినొచ్చా?

First Published | May 19, 2024, 11:50 AM IST

వంకాయలను తింటే కాళ్ల నొప్పులు, వాపు పెరుగుతాయని చాలా మంది వంకాయలను అస్సలు తినకూడరు. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా వంకాయలు తినకూడదని చెప్తుంటారు. దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే? 

గర్భధారణ అనేది చాలా సున్నితమైన సమయం. ఇలాంటి సమయంలో గర్భిణీలు చాలా  జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తినే, తాగే విషయంలో అస్సలు నిర్లక్ష్యంగా ఉండకూడదు. తల్లి, బిడ్డకు హాని కలిగించే లేదా గర్భధారణలో ఏదైనా సమస్యను కలిగించే ఆహారాలను గుర్తించి వాటిని పొరపాటున కూడా తినకూడదు. అయితే చాలా మంది గర్భంతో ఉన్నప్పుడు వంకాయలను తినకూడదని చెప్తుంటారు. ఎందుకంటే ఇది గర్భిణీలకు హాని కలిగించే కూరగాయ అని నమ్ముతారు. అయితే నిజంగా వంకాయ గర్భిణీలకు హాని కలిగిస్తుందా? లేదా? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

గర్భిణీ స్త్రీలు వంకాయ తినకూడదు అనేది కేవలం ఒక అపోహ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. నిజమేంటంటే? వంకాయలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి తల్లీ, బిడ్డ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వంకాయలో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది. ఇది గర్భాశయంలో పెరుగుతున్న బిడ్డ మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది. అలాగే న్యూరల్ ట్యూబ్ లోపాలను తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. 


brinjal

వంకాయలో పొటాషియం కూడా మెండుగా ఉంటుంది. ఇది ఎలక్ట్రోలైట్లను నిర్వహించడానికి సహాయపడుతుంది. అలాగే రక్తపోటు ఆరోగ్యకరంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది. అంతేకాదు వంకాయలో విటమిన్ కె కూడా ఉంటుంది. ఇది తల్లీ, బిడ్డ ఎముకలను బలంగా చేయడానికి సహాయపడుతుంది. అలాగే ఇది రక్తం గడ్డకట్టడానికి కూడా అవసరం. 

వంకాయలో జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి తోడ్పడే డైటరీ ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. గర్భధారణ సమయంలో ఎక్కువగా వచ్చే మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే వంకాయలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది గర్భిణీలు మరీ బరువు పెరగకుండా కాపాడుతుంది. 

వంకాయలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించే ఎన్నో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. వంకాయలో ఉడే రిబోఫ్లేవిన్ ,బయోఫ్లవనాయిడ్స్ రక్తపోటును తగ్గిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. 

వంకాయను ఎలా తినాలి?

ప్రెగ్నెన్సీ సమయంలో వంకాయను తినాలంటే ముందుగా వాటిని బాగా ఉడికించాలి. అలాగే లిమిట్ లోనే తినాలి. వంకాయ తిన్న తర్వాత గొంతు చికాకు లేదా దురద వంటి సమస్యలు వస్తే మాత్రం ఆలస్యం చేయకుండా హాస్పటల్ కు వెళ్లండి. 

Latest Videos

click me!