ఒమర్ అబ్దుల్లా కేబినెట్ కు కాంగ్రెస్ దూరం ... ఎందుకో తెలుసా?

First Published | Oct 16, 2024, 10:02 AM IST

జమ్మూ కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమయ్యింది. అయితే ఒమర్ అబ్దుల్లా కేబినెట్ లో కాంగ్రెస్ చేరుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. 

Omar Abdullah

జమ్మూ కాశ్మీర్ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల కూటమి ఘన విజయం సాధించింది. అయితే ప్రభుత్వంలో మాత్రం కాంగ్రెస్ భాగమయ్యే అవకాశాలు లేవనే ప్రచారం జరుగుతోంది. ఒమర్ అబ్దుల్లా కేబినెట్ లో కాంగ్రెస్ చేరడంలేదని ... కానీ బయటనుండి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 

Omar Abdullah

ఇవాళ (అక్టోబర్ 16, బుధవారం) జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు కొందరు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు. శ్రీనగర్ లోని షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ లో ఈ కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేసారు.  

అయితే ఇప్పటివరకు ఒమర్ అబ్దుల్లా మంత్రివర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చోటు దక్కుతుందని అందరు భావించారు.  కాంగ్రెస్ కు ఓ మంత్రి పదవి, డిప్యూటీ స్పీకర్ పదవి దక్కుతుందనే ప్రచారం కూడా జరిగింది. జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా, ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ మీర్ పేర్లు వినిపించాయి. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ ఒమర్ అబ్దుల్లా కేబినెట్ కు దూరంగా వుండనుందనే ప్రచారం మొదలయ్యింది. 
 


Jammu & Kashmir

కాంగ్రెస్ నిర్ణయానికి కారణమిదేనా?

జమ్మూ కాశ్మీర్ లోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఫరూఖ్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ విజయం సాధించింది. ఈ పార్టీ 42 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. మ్యాజిక్ ఫిగర్ కు అడుగుదూరంలో నిలిచినా మిత్రపక్షం కాంగ్రెస్ 6 సీట్లను కలుపుకుని ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమయ్యింది. 

అయితే కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో ఓట్లు, సీట్లు సాధించలేకపోయింది. ఇదే ఒమర్ అబ్దుల్లా కేబినెట్ లో కాంగ్రెస్ చేరకపోడానికి కారణంగా తెలుస్తోంది. అయితే బయటినుండి ఒమర్ సర్కార్ కు పూర్తి మద్దతుగా నిలవనున్నట్లు కాంగ్రెస్ స్పష్టం చేసింది. 
 

Omar Abdullah

కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ తొలి సీఎంగా ఒమర్ : 

జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా కోల్పోయిన తర్వాత మొదటిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి విజయం సాధించింది. దీంతో కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ తొలి సీఎంగా ఒమర్ అబ్దుల్లా మారారు. 

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఫరూఖ్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ కు మద్దతుగా నిలిచారు. మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో ఎన్సి 42 సీట్లు సాధించింది.  ఆ తర్వాత బిజెపి అత్యధికంగా  29 సీట్లు సాధించింది. గతంలో బిజెపి సహాయంతో అధికారాన్ని చేపట్టిన పిడిపి ఈసారి చతికిలపడింది. ఆ పార్టీ భారీగా సీట్లు కోల్పోయి కేవలం 3 స్థానాలకే పరిమితం అయ్యింది. 

ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్టుకోలేకపోయింది. కనీసం రెండంకెల సీట్లు కూడా సాధించలేకపోయింది. కేవలం 6 స్థానాలకే కాంగ్రెస్ ను పరిమితం చేసారు జమ్మూ కాశ్మీర్ ఓటర్లు. కానీ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ విజయంలో కాంగ్రెస్ తో ముందుస్తు పొత్తు చాలా ఉపయోగపడింది. 

Jammu & Kashmir

జమ్మూ కాశ్మీర్ లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత : 

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 ని మోదీ సర్కార్ రద్దుచేసింది. అంతేకాదు రాష్ట్రహోదా కూడా తొలగించి జమ్మూ కాశ్మీర్, లడక్ వేరుచేసారు...  ఈ రెండింటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చారు. దీంతో 2019 నుండి అక్కడ రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది.  

అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమయ్యింది. దీంతో రాష్ట్రపతి పాలన ముగిసింది... ఈ మేరకు కేంద్ర హోంశాఖ అధికారిక నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. 
 

Latest Videos

click me!