అసలు ఎవరీ హర్దీప్ సింగ్ నిజ్జర్? : అతడి హత్యకు, భారత్ కెనడా మధ్య వివాదానికి సంబంధమేంటి?

First Published | Oct 15, 2024, 4:48 PM IST

హర్దీప్ సింగ్ నిజ్జర్ ... ఇతడిని భారత్ ఉగ్రవాది అంటుంటే కెనడా మాత్రం మహాత్ముడు అంటూ కొనియాడుతోంది. అతడి హత్య ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలనే దెబ్బతీసే స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో అసలు ఎవరీ నిజ్జర్? అతడి హత్యకు కారణమేంటి? భారత్ కెనడా మధ్య వివాదానికి, ఇతడి హత్యకు సంబంధమేంటి? అనేది తెలుసుకుందాం. 

India Canada Row

India Canada Row : భారతీయులు అత్యధికంగా వున్న దేశాల్లో కెనడా ఒకటి. అలాంటి దేశంలో దేశ దౌత్య సంబంధాలు రోజురోజుకు మరింత క్షీణిస్తున్నాయి. సిక్కు వేర్పాటువాది, ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో హత్యకు గురయ్యాడు ... ఇది భారత్ పనే అని కెనడా ఆరోపిస్తోంది. తమ దేశ పౌరసత్వం కలిగిన నిజ్జర్ హత్యను కెనడా చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ హత్య ఇరు దేశాల మధ్య చిచ్చురేపింది. 

India, canada

భారత్-కెనడా వివాదం ఇలా సాగింది : 

ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం... ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లే భారతీయులు సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇలా భారతీయులు ఎక్కువగా వున్న దేశాల్లో కెనడా ఒకటి. ముఖ్యంగా పంజాబ్ నుండి కూడా అత్యధిక సిక్కులు కెనడాకు వెళ్లారు. ఇలా కెనడాలో స్థిరపడ్డ పంజాబీల్లో ఒకరు హర్దీప్ సింగ్ నిజ్జర్.

అయితే ఇతడు సామాన్యుడు కాదు... కెనడా నుండే భారత్ లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించాడు...'ఖలిస్తాన్' పోరాటానికి నాయకత్వం వహించాడు. అయితే దేశాన్ని ముక్కలు చేయాలన్న డిమాండ్ ను భారత్ వ్యతిరేకిస్తోంది... దీంతో ఖలిస్తాన్ పై నిషేధించింది. 2‌020 లో కెనడా నుండి ఖలిస్తాన్ కార్యకలాపాలను నిర్వర్తిస్తున్న నిజ్జర్ ను ఉగ్రవాదిగా ప్రకటించింది. నిజ్జర్ ను మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన మోదీ సర్కార్ అతడి తలపై రూ.10 లక్షల రివార్డ్ ప్రకటించింది. 

అయితే గతేడాది 2023 జూన్ 18న కెనడాలోని సిక్కుల ప్రార్థనా స్థలం గురుద్వారా ప్రాంగణంలో నిజ్జర్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని దుండగులు నిజ్జర్ ను గురుద్వారా పార్కింగ్ స్థలంలో కాల్చిచంపారు. ఈ హత్య భారత్, కెనడాల మధ్య సంబంధాలను దెబ్బతీసింది.  

తమ దేశ పౌరసత్వం కలిగిన నిజ్జర్ హత్యను కెనడా సీరియస్ గా తీసుకుంది. దీంతో ఇప్పటికే ఉగ్రవాదిగా ప్రకటించిన నిజ్జర్ ను ఇంత దారుణంగా కాల్చిచంపింది భారతే అని అనుమానం వ్యక్తం చేసింది. కెనడా ప్రధాని ట్రూడో ఏకంగా ఆ దేశ పార్లమెంట్ వేదికగా నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ప్రమేయం వుందని ప్రకటించాడు. కెనడా గడ్డపై ఈ దేశ పౌరుడిని విదేశీ శక్తులు హత్య చేయడం సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనంటూ హౌస్ ఆఫ్ కామన్స్ లో ఆ దేశ ప్రధాని ట్రూడో వ్యాఖ్యానించారు. 

నిజ్జర్ హత్యతో భారత్ కు ఎలాంటి సంబంధంలేదని ... ఖలిస్తాన్ ను ఉగ్రవాద సంస్థగా గుర్తించి నిషేదం విధించిన తర్వాత విదేశాల్లో వున్న అతడిని హత్య చేయించాల్సిన అవసరం ఏం వచ్చిందని మోదీ ప్రభుత్వం అంటోంది. నిజంగానే భారత నిఘా సంస్థల ప్రమేయం వుందని స్పష్టమైన ఆధారాలను అందిస్తే పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. కానీ ట్రూడో ప్రభుత్వం కేవలం ఆరోపణలకు పరిమితం అయ్యింది... వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో భారత్ కు ఆధారాలు సమర్పించలేకపోతోంది.  
 


Hardeep Singh Nijjar

కెనడా పార్లమెంట్ లో నిజ్జర్ కు నివాళి : 

కెనడా పౌరుడు నిజ్జర్ హత్యతో భారత ప్రమేయం వుందని ఆ దేశ ఇంటెలిజెన్స్ సంస్థ అనుమానిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ  దేశ ప్రధాని ట్రూడో ప్రకటించారు. ఇలా నిజ్జర్ హత్య జరిగిన మూడు నెలల తర్వాత కెనడా ప్రధాని ఆ దేశ పార్లమెంట్ వేదికగా ఈ ఆరోపణలు చేసారు.  

ఈ ఏడాది జూన్ 18 తో నిజ్జర్ హత్య జరిగి ఏడాది పూర్తయ్యింది. దీంతో కెనడా పార్లమెంట్ దిగువ సభ నిజ్జర్ కు నివాళి అర్పించారు. ఇది భారత్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. భారత్ లో హింసాత్మక ఘటనలకు కారణమైన ఓ ఉగ్రవాదిని పార్లమెంట్ లో నివాళి అర్పించడం దారుణమని భారత్ అంటోంది. ఇలా ఖలిస్తాన్ ఉగ్రవాదికి కెనడా అంతటి ప్రాధాన్యత ఇవ్వడంపై భారత్ మండిపడుతోంది. 
 

Hardeep Singh Nijjar

అసలు నిజ్జర్ హత్య పాల్పడిందెవరు? 

45 ఏళ్ల నిజ్జర్ హత్యకేసులో ముగ్గురు భారతీయ పౌరులను కెనడా పోలీసులు అరెస్ట్ చేసారు. కరుణ్ బ్రార్ (22), కమల్ ప్రీత్ సింగ్ (22), కరణ్ ప్రీత్ సింగ్ (28) అనే ముగ్గురు యువకులను అరెస్ట్ చేసారు. ఈ ముగ్గురు చాలాకాలంగా కెనడాలోని అల్బెర్టాలో నివాసం వుంటున్నారు. ఇలా నిజ్జర్ హత్యకేసులో పట్టుబడ్డ నిందితులు భారతీయులు కావడంలో ట్రూడో ఆరోపణలకు బలం చేకూరింది. 

 అయితే భారత్ వాదన మరోలా వుంది. అంతర్జాతీయ స్థాయిలో మంచి సత్సంబంధాలు కొనసాగిస్తూ అన్ని దేశాలతో స్నేహంగా మెలుగుతున్న భారత్ ను పాక్ ఐఎస్ఐ టార్గెట్ చేసిందా? నిజ్జర్ హత్య కూడా ఐఎస్ఐ ఏజెంట్ల పనేనా? కెనడాతో భారత సంబంధాలు దెబ్బతీసే కుట్రలో భాగంగానే ఇలా చేసారా? అంటే కొన్ని అంతర్జాతీయ  మీడియా సంస్థల కథనాలు అవుననే అంటున్నాయి. నిజ్జర్ ను చంపేసి ఈ నేరం భారత ప్రభుత్వం మోపాలని ఐఎస్ఐ కుట్ర పన్నిందనే ఆరోపణలు వున్నాయి. 
 

India, canada

మరింత క్షీణించిన భారత్-కెనడా సంబంధాలు : 

నిజ్జర్ హత్యతో మొదలైన కెనడా-భారత్ వివాదం తాజాగా మరింత ముదిరింది. ఈ హత్యానేరాన్ని భారత్ పై మోపుతూ ఇందుకు కెనడాలోని భారత రాయబార కార్యాలయ అధికారుల హస్తం వుందని ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఆ దేశంలోని భారత హైకమీషనర్  సంజయ్ కుమార్ వర్మ పేరును అనుమానితుల జాబితాలో చేర్చింది. అంతేకాదు అక్టోబర్ 13న ఈయనను విచారించాల్సి వుందంటూ కెనడా ప్రభుత్వం భారత విదేశాంగ శాఖకు సందేశం పంపింది.  

కెనడా వ్యవహార తీరును భారత్ తప్పుబడుతోంది... అలాగే కౌంటర్ యాక్షన్ కు కూడా ప్రారంభించింది. ఇందులో భాగంగానే భారత్ లోని కెనడా తాత్కాలిక హైకమీషనర్ స్టివార్ట్ వీలర్,  డిప్యూటీ హైకమీషనర్ ప్యాట్రిక్ హెబర్ట్ లతో పాటు మరో నలుగురు అధికారులు మేరీ కేథరీన్ జోలి, అయాన్ రోస్ డెవిడ్ ట్రైస్, ఆడమ్ జేమ్స్ చుప్కా, పౌలా ఓర్జులాలపై నిషేదం విధించింది. అక్టోబర్ 19వ తేదీ రాత్రి 11.59 గంటలలోపు భారత దేశాన్ని వీడాలని వారికి ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో కెనడాలోని భారత దౌత్య అధికారులను స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. 
 

Hardeep Singh Nijjar

అసలు ఎవరీ నిజ్జర్ : 

హర్దీప్ సింగ్ నిజ్జర్ ... పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ జిల్లాలోని భర్సింగ్ పురాలో అక్టోబర్ 11, 1977లో జన్మించారు. అయితే అతడు చిన్నప్పటి నుండే ఖలిస్తాన్ ఉద్యమానికి ఆకర్షితుడయ్యాడు. అయితే 20 ఏళ్ల వయసులో అంటే 1997 లో తప్పుడు పాస్ పోర్ట్ తో కెనడాకు వెళ్లి స్థిరపడ్డాడు. 

దేశం వీడినా నిజ్జర్ లో ఖలిస్తాన్ భావాలు తొలగిపోలేదు. దీంతో అతడు అక్కడినుండి ఖలిస్తాన్ ఉద్యమంలో పాల్గొని పంజాబ్ లో కార్యకలాపాలు సాగించేవాడు. ఇలా భారత్ లో పలువురి హత్యకు కూడా ఇతడు కుట్రలు పన్నినట్లు ఆరోపణలున్నాయి. ఇలా విదేశాల్లో వుంటూ భారత్ లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలను పాల్పడుతున్న నిజ్జర్ ను 2020 లో ఉగ్రవాదిగా ప్రకటించారు. ఆ తర్వాత మూడేళ్లకు అతడు హత్యకు హత్యకు గురవగా ఇది భారత్ పనే అని కెనడా ఆరోపిస్తోంది. ఇది తీవ్ర వివాదంగా మారి రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను దెబ్బతీస్తోంది. 

Latest Videos

click me!