
నోయిడా : గ్రేటర్ నోయిడాలోని సెక్టార్ ఫై 2లోని కండోమినియం అపార్ట్‌మెంట్ యజమానుల సంఘం తమ అపార్ట్ మెంట్ వాసులకు పెట్టిన ఓ కొత్త నిబంధన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అపార్ట్ మెంట్ వాసులు కామన్ ఏరియా లేదా పార్క్‌లలో వచ్చేప్పుడు దుస్తుల విషయంలో కొన్ని గుర్తుంచుకోవాలని కోరింది.
జూన్ 10న హిమసాగర్ అపార్ట్‌మెంట్ జారీ చేసిన సర్క్యులర్ లో అపార్ట్ మెంట్ వాసులు తమ ఫ్లాట్‌ల బయట కామన్ ఏరియాల్లో "లుంగీలు, నైటీలు ధరించి" తిరగకూడదని ప్రత్యేకంగా కోరింది. ఈ నిర్ణయాన్ని దీనిని కొందరు స్వాగతించారు, అయితే, ఇది వ్యక్తిగత స్వేచ్ఛను స్థూలంగా అతిక్రమించడమే అని మరికొందరు తీవ్రంగా విమర్శించారు.
దీనిమీద అపార్ట్ మెంట్ ప్రెసిడెంట్ సీకే కల్రా మాట్లాడుతూ.. ‘తాము ఎవరిపైనా వివక్ష చూపలేదని, ప్రతి రోజు అందరూ కలిసి యోగా చేస్తున్నప్పుడు.. ఇలా లుంగీలు, నైటీలు లాంటి.. "వదులుగా ఉన్న బట్టలు" ధరించే వ్యక్తుల గురించి కొన్ని ఫిర్యాదులు వచ్చిన తర్వాత ఇలా చేశామని.. అపార్ట్ మెంట్ వాసులను వీటిని అనుసరించమని అభ్యర్థించామని, ఇది ఫిర్యాదుదారులను అసౌకర్యానికి గురిచేసిందన్నారు.
"కొన్ని రోజుల క్రితం, కొంతమంది మహిళలు లుంగీ ధరించి యోగా చేస్తున్న సీనియర్ సిటిజన్‌పై ఫిర్యాదు చేశారు. మొదట, మేంప్రజలను మౌఖికంగా అభ్యర్థించాం. తరువాత, సంఘం నుంచి ఒక సర్క్యులర్ తేవాలని నిర్ణయించుకుంది" అని కల్రా చెప్పారు. సర్క్యులర్ లో ఇలా ఉంది: "మీరు అపార్ట్ మెంట్ లోని కామన్ ఏరియాలో తిరుగుతున్నప్పుడు, మీ ప్రవర్తన, దుస్తులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరుతున్నాం. తద్వారా మీ ప్రవర్తనపై ఎవరికీ అభ్యంతరం చెప్పే అవకాశం ఉండదు. మీ పిల్లలు కూడా ఇది నేర్చుకుంటారు. కాబట్టి, ప్రతి ఒక్కరూ ఇంట్లో వేసుకునే దుస్తులైన లుంగీ, నైటీ ధరించి తిరగవద్దని అభ్యర్థన." అని ఉంది.
దీనిమీద హిమసాగర్ నివాసి డాక్టర్ యశ్ వీర్ సింగ్ మాట్లాడుతూ... ‘సర్క్యులర్‌తో నాకేం సమస్య కనిపించలేదు. దీనివల్ల ఎలాంటి జరిమానా విధించడం లేదు. లుంగీ కట్టుకుని కామన్ ఏరియాలో తిరుగుతున్న వారిని నేనెప్పుడూ చూడలేదు, ఎవరింటికైనా వచ్చిన అతిథులు కావచ్చు. ఇక్కడ నివాసితులు చాలా క్రమశిక్షణతో ఉంటారు" అని అతను చెప్పాడు.
మరొక నివాసి, పంకజ్ మాట్లాడుతూ, సర్క్యులర్ గురించి తనకు తెలియదని, అయితే అది తేడాగా ఏమీ కనిపించలేదని అన్నారు. "తల్లిదండ్రులుగా, ఇది నా పిల్లలకు మంచిదని నేను భావిస్తున్నాను. కమిటీ తప్పుగా ఏమీ అడగలేదు. దాన్ని ఫాలో అవ్వాలని నేను భావిస్తున్నాను" అని పంకజ్ చెప్పారు.
140 మందికి పైగా సభ్యులుగా ఉన్న ఫెడరేషన్ ఆఫ్ నోయిడా రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ సెక్రటరీ జనరల్ కెకె జైన్ మాట్లాడుతూ.. "ఒక వ్యక్తి స్వేచ్ఛగా ఉండాలని భావిస్తున్నాం. అతను లేదా ఆమె కోరుకున్నది ధరించొచ్చు. ఒక వ్యక్తి ఇష్టం ప్రకారం దుస్తులు ఉండాలి" అన్నారు. గ్రేటర్ నోయిడాలోని యాక్టివ్ సిటిజన్స్ గ్రూప్‌కు చెందిన అలోక్ సింగ్ మాట్లాడుతూ, "ప్రతి ఒక్కరూ తమకిష్టమైన దుస్తులు ధరించే స్వేచ్ఛ ఉండాలి. కానీ సమాజంలో సభ్యుడిగా, తక్షణ పరిసరాల సామాజిక ఆమోదాన్ని గుర్తుంచుకోవాలి" అన్నారు.
60 మందికి పైగా సభ్యులుగా ఉన్న నోయిడా ఫెడరేషన్ ఆఫ్ అపార్ట్‌మెంట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజీవ్ సింగ్ మాట్లాడుతూ, రెసిడెంట్స్ అసోసియేషన్‌లు తమ స్వంతంగా అలాంటి నిబంధనలను రూపొందించలేవని అన్నారు. "పౌర సమాజంలో దుస్తుల కోడ్‌లను నిర్వచించడం అనేది వలసవాద మనస్తత్వం కనిపిస్తుంది. ప్రజలు ఏదైనా నిర్దిష్ట రకమైన దుస్తులను ధరించడాలని, అలాగే ఉండాలని పరిమితం చేయలేము.
జనాల ఇష్టాన్ని గౌరవించాలి. అయితే, అది హాని కలిగించకుండా జాగ్రత్త వహించవచ్చు. ఏదైనా నిర్దిష్ట కమ్యూనిటీ మతపరమైన లేదా సాంస్కృతిక భావాలు రుద్దకూడదు. సంక్షేమ సంఘాలు తమంతట తాముగా అలాంటి నిబంధనలను రూపొందించలేవు, నాగరిక ప్రపంచంలో, మనం ప్రజల మనోభావాలను, వారి ఇష్టాలను గౌరవించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.