జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమార స్వామి కుమారుడు నిఖిల్ గౌడ వివాహం ఏప్రిల్ 17వ తేదీ అంటే మరికాసేపట్లో జరగనుంది. నిఖిల్ గౌడ హీరోగా తెరంగేట్రం చేసి ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కాగా.. ఇటీవల నిఖిల్ గౌడ కి రేవతి అనే యువతితో ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది.
నిశ్చితార్థాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆ తర్వాత దేశంలో కరోనా విజృంభించడంతో.. దాదాపు చాలా మంది శుభకార్యాలు వాయిదా వేసుకున్నారు. అయితే.. కుమారస్వామి మాత్రం తన కుమారుడి వివాహాన్ని వాయిదా వేయాలని అనుకోకపోవడం గమనార్హం.
ఏప్రిల్ 17వ తేదీ ఏలా లేదన్నా.. పెళ్లి జరిపించాలని ఆయన భావించారు. ఈ మేరకు పెళ్లి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే.. పెళ్లికి ఎవరినీ ఆహ్వానించడం లేదని ఆయన చెప్పారు.
ఈ మేరకు తన అభిమానులకు ఓ వీడియో సందేశాన్ని పంపారు. పెళ్లికి తమ పార్టీ కార్యకర్తలను, అభిమానులను ఆహ్వానించి.. అంగరంగ వైభంగా చేయాలని తనకు ఉందని..కాకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కావడం లేదని చెప్పారు.
కార్యకర్తలు, ముఖ్య నేతలంతా తమ ఇళ్లల్లో ఉండే.. వధూవరులను ఆశీర్వదించాలని కుమారస్వామి కోరడం గమనార్హం. అతిథులు ఎవరూ లేకుండానే పెళ్లి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
లాక్ డౌన్ అనంతరం సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత గ్రాండ్ రిసెప్షన్ ఉంటుందని సమాచారం. కాగా, కాంగ్రెస్ నేత క్రిష్ణప్పకు మనవరాలు వరుస అయ్యే రేవతిని నిఖిల్ గౌడ పెళ్లి చేసుకోనున్నాడు.
రామనగరలో ఉన్న ఫామ్‌హౌస్‌లో పెళ్లి జరగనుంది. బెంగళూరును రెడ్‌జోన్‌గా కేంద్రం ప్రకటించింది. రామనగర ప్రాంతం గ్రీన్‌జోన్ పరిధిలో ఉంది.
రామనగరలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని, పైగా.. 60 మంది కుటుంబ సభ్యులు మాత్రమే పెళ్లికి హాజరవుతారని కుమారస్వామి తెలిపారు.
11 నుంచి 12 మంది వైద్యులు తమ కుటుంబంలోనే ఉన్నారని.. వారిని సంప్రదించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
రామనగర ప్రాంతం గ్రీన్‌జోన్‌లో ఉందనే విషయాన్ని పక్కనపెడితే.. ఈ వివాహ వేడుక రామనగర జిల్లాలో కరోనా వైరస్‌కు కారణం కాదని తాను చెప్పగలనని కుమారస్వామి వ్యాఖ్యానించారు.
జేడీఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరూ కూడా ఈ వివాహ వేడుకకు రావొద్దని.. అందరూ ఇళ్లలోనే ఉండి ఈ జంటను ఆశీర్వాదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉండగా..నిఖిల్(28), రేవతి(22) నిశ్చితార్థం ఫిబ్రవరి 10న బెంగళూరులో జరిగింది. వివాహం కూడా బెంగళూరునే చేయాలని తొలుత నిశ్చయించినప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రామనగరలో చేయాలని నిర్ణయించారు.
కుమారస్వామి గ్రీన్ జోన్ పరిధిలోనే పెళ్లి చేస్తున్నామని చెబుతున్నప్పటికీ.. మే 3 వరకూ దేశంలో ఎలాంటి సామాజిక, రాజకీయ, క్రీడా, మతపరమైన సభలతో పాటు ఇతర వేడుకలు కూడా నిర్వహించరాదని హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించినట్టే అవుతుంది.