లాక్‌డౌన్ నేపథ్యంలో డీమార్ట్, మోర్ లాంటి సూపర్‌మార్కెట్లకు వెళుతున్నారు. ఈ సమయంలో బాస్కెట్, కార్ట్ హ్యాండిల్స్, ఆఫర్స్‌కు సంబంధించిన పాంప్లేట్స్, ఫుడ్ ప్యాకింగ్ చేసిన వస్తువులను ముట్టుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. వైరస్ సోకిన వారు ఎవరైనా వాటిని తాకినప్పుడు వాటి ద్వారా మీకు వైరస్ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల వాటిని పట్టుకునే ముందు మీరు వీలైనంత వరకు శానిటైజర్‌లని ఉపయోగించడం గ్లౌజ్‌లను వాడటం మంచిది. నిత్యావసరాలను తీసుకొచ్చే బ్యాగులను తిరిగి వినియోగించాల్సి వస్తే వేడి నీటితో శుభ్రం చేయడం మంచిది
అపార్ట్‌మెంట్లు, కార్యాలయాల దగ్గర లిఫ్ట్‌లు, కాఫీ మిషన్ బటన్లను నొక్కుతున్నట్లయితే వాటిని ప్రెస్ చేసిన తర్వాత చేతులను శుభ్రపరచుకోవాలి. ఆ మిషన్ వాడిన వారిలో ఎవరికైనా కరోనా సోకి ఉంటే.. మీకూ వైరస్ సోకే అవకాశాలు ఉన్నాయి. ఇదే సూత్రాన్ని ఏటీఎంల వద్దా ఉపయోగించండి
ఇప్పుడు ఎక్కడ చూసినా శానిటైజర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇళ్లలోనూ, కార్యాలయాల్లోనూ, ఆసుపత్రుల్లోనూ పెద్ద పెద్ద శానిటైజర్ బాటిళ్లను పెడుతున్నారు. వీటిని వైరస్ సోకిన వ్యక్తులు సైతం వాడే అవకాశం ఉంది.. దీని పైభాగాన మీరు నొక్కినట్లయితే వైరస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి.
ఏ చిన్న జలుబు, దగ్గు వచ్చినా ఆసుపత్రికి వెళితే.. మన వంతు వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే. మన పక్కనే కరోనా బాధితుడు వుండొచ్చు.. ఆ విషయం మనకు తెలియదు. అలాంటప్పుడు అక్కడే ఉన్న కుర్చీల్లో వెయిట్ చేస్తాం. సాధ్యమైనంత వరకు అక్కడున్న టిష్యూ బాక్స్, న్యూస్ పేపర్స్ తాకకపోవటమే మంచిది. ఇవే కాదు.. పక్కవాళ్ల సెల్‌ఫోన్లు, నగదు, డెబిట్, క్రెడిట్ కార్డులు, డోర్ హ్యాండిల్స్ వంటి వస్తువులను కూడా పట్టుకునేముందు జాగ్రత్తలు తీసుకోవాలి.