Tungabhadra Dam Repairs: సగానికి పైగా ఖాళీ అవుతున్న తుంగభద్ర డ్యామ్.. రైతుల పరిస్థితేంటి?

First Published | Aug 12, 2024, 2:09 PM IST

తుంగభద్ర డ్యామ్‌లో 19వ గేటు కొట్టుకుపోవడంతో లక్ష క్యూసెక్కుల నీటికి దిగువకు వదులుతున్నారు. కాగా, డ్యామ్ ఖాళీ అయితే, పంటలపై తీవ్ర ప్రభావం ఉంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తుంగభద్ర జలాశయం 19వ గేటు కొట్టుకుపోయిన ఘటన రిజర్వాయర్ చరిత్రలో ఇదే తొలిసారి. అయితే, ఐదేళ్ల క్రితం ఓ చిన్న విషాదం చోటు చేసుకుంది. అదేంటంటే..? 2019లో తుంగభద్ర ఎడమ గట్టు ఎగువ కాలువ (మునీరాబాద్) వద్ద గేటు విరిగింది. అప్పుడు కూడా నాలుగు రోజుల పాటు పెద్ద ఎత్తున నీరు నదిలోకి ప్రవహించింది. అప్పట్లో నిపుణుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుని క్షుణ్నంగా పరిశీలించింది. మరమ్మతుల కోసం వారాల తరబడి శ్రమించింది. అనంతరం అప్పటి ఇరిగేషన్ కార్పొరేషన్ ఎండీ మల్లికార్జున్ గుంగే నిరంతర కృషితో ఆర్కే మెడిక్ పద్ధతిని ఉపయోగించి భారీ క్రేన్ల సాయంతో భారీ ఇసుక బస్తాలు అడ్డుగా వేసి మరమ్మతులు చేపట్టారు.

తాజాగా జరిగిన 19వ గేటు కొట్టుకుపోయిన ఘటనపై కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. ఆంధ్రప్రదేశ్‌ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సోమవారం పరిశీలించనుండగా.. కర్ణాటక మంత్రులు ఇప్పటికే డ్యామ్‌ను పరిశీలించారు. మూడు రాష్ట్రాలు అంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన నీటిని ఎలాగైనా నిలుపుకోవడం ద్వారా తుంగభద్ర డ్యామ్ గేటును మరమ్మతు చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. తుంగభద్ర జలాశయం పరిశీలనకు ముందు తన నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. నీటిని విడుదల చేస్తే తప్ప గేటుకు మరమ్మతులు చేయలేమని నిపుణులు చెప్పారన్నారు. కాబట్టి నిపుణుల నివేదిక తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Latest Videos


తుంగభద్ర డ్యాంకు చెందిన 1 నుంచి 16 గేట్లను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నిర్వహిస్తుంది. 17 నుంచి 32వ గేట్‌ వరకు నిర్వహణ బాధ్య కర్ణాటక ప్రభుత్వానిదే. కాగా, 19వ గేటు కొట్టుకుపోవడంతో కేంద్ర జలసంఘం కొందరు నిపుణుల బృందాన్ని పరిశీలనకు పంపింది. అలాగే, కర్ణాటక ప్రభుత్వం తరఫున పలువురు నిపుణులైన టెక్నీషియన్లను కూడా పంపినట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ తెలిపారు. డ్యామ్‌ గేటు కొట్టుకుపోయిన రోజు శనివారం రాత్రి నుంచి అధికారులతో ఫోన్‌లో టచ్‌లో ఉంటూ ప్రతిక్షణం సమాచారం తెలుసుకుంటున్నట్టు చెప్పారు.

కాగా, తుంగభద్ర డ్యాం 19వ గేటు గొలుసులో లింక్ తెగిపోవడంతో సమస్య తలెత్తింది. గేటు విరిగి నీటిలో కొట్టుకుపోయిన నేపథ్యంలో డ్యామ్ భద్రత దృష్ట్యా అన్ని గేట్లు ఎత్తి నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. ఆనకట్ట దిగువ ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

తుంగభద్ర జలాశయం గేటు కొట్టుకుపోవడంతో జలాశయం నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని నదిలోకి వదులుతున్నారు. మూడు రోజుల్లో జలాశయం నుంచి 52 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. ఇప్పుడు జలాశయం నుంచి నీరు ఖాళీ అవుతుండటంతో కర్ణాటక రైతులు ఆందోళన చెందుతున్నారు. అప్పులు చేసి మరీ వేసిన వరి పంటకు నీరందకపోతే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అయితే, డ్యామ్‌ని సగం వరకు ఖాళీ చేయడం తప్ప.. తుంగభద్ర బోర్డు, జలవనరుల శాఖ వద్ద ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గం లేదు.

నీటిని వృథా చేయవద్దు

గేటుకు మరమ్మతులు చేపట్టేందుకు తుంగభద్ర జలాశయాన్ని సగం వరకు ఖాళీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నీటిని వృథా చేయొద్దని, గేట్లకు మరమ్మతులు చేసి త్వరితగతిన ఏర్పాటు చేయాలని కర్ణాటక రైతులు, ప్రజలు కోరుతున్నారు. జలాశయం నుంచి పెద్ద ఎత్తున నీటిని నదిలోకి విడుదల చేయడంతో పెద్ద ఎత్తున వచ్చి హోస్పేట్-మునీరాబాద్ బ్రిడ్జి వద్ద నిల్చొని నీటి ప్రవాహాన్ని చూసి చలించిపోయారు. జలాశయం నుంచి ఇంత పెద్ద మొత్తంలో నీరు వృథాగా పోతుండటం చూసి కలత చెందారు. మరోవైపు హోస్పేట, గంగావతి, కొప్పల్, బళ్లారి, రాయచూర్, ఇతర ప్రాంతాల రైతులు గంగమ్మను శాంతింపజేసేందుకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. 

తుంగభద్ర డ్యాం గేట్ కొట్టుకుపోవడంపై ప్రభుత్వం అప్రమత్తమైందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. నీటిని నిలువరించేందుకు తీసుకుంటున్న చర్యలపై కర్ణాటక ప్రభుత్వం, తుంగభద్ర డ్యాం ఇంజనీర్లతో చర్చించామన్నారు. తుంగభద్ర డ్యాంకు గేట్ లాక్ సిస్టం లేకపోవడం వల్లే ఇబ్బందులు తలెత్తాయన్నారు. గేట్ కొట్టుకుపోతే నీటిని నిలువరించే వ్యవస్థ తుంగభద్ర డ్యాంకు లేదని... కొట్టుకుపోయిన గేట్ స్థానంలో ప్రత్యామ్నాయ గేట్ ఏర్పాటు చేసేందుకు ఏపీ వైపు నుంచి పూర్తి సహకారం అందిస్తున్నామని తెలిపారు. తాత్కాలిక రబ్బర్ డ్యాం ఏర్పాటుతో సహా అన్ని ప్రత్యామ్నాయ అవకాశాలపై ప్రభుత్వం యోచిస్తుందన్నారు. డ్యాం అధికారులతో, డ్యాంపై గతంలో పని చేసిన గన్నయ్య నాయుడు లాంటి  నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామన్న పయ్యావుల కేశవ్... తుంగభద్ర డ్యాంపై ఆధారపడ్డ ఏపీలోని అనంతపురం, కర్నూలు జిల్లాల రైతులకు నష్టం వాటిల్లకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

click me!