Keerthana Sampath: తమిళనాడు టీవీకే పార్టీలోని కీలక నేతల్లో కీర్తనా సంపత్ ఒకరు. ఆమెకు మంత్రి పదవిని కూడా ఇచ్చారు విజయ్. తెలుగులోనే ప్రచారం చేస్తూ మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచిన కీర్తన ఎవరు? ఈమెకు తెలుగుదేశం పార్టీకి సంబంధం ఏమిటి?
తమిళనాడు తాజా ఎన్నికల్లో టీవీకే పార్టీ అధినేత విజయ్ తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న నేత కీర్తనా సంపత్. తెలుగులో మాట్లాడుతూ తమిళనాడులో విజయం సాధించిన యువ రాజకీయ నాయకురాలు. ఎన్నికల్లో తెలుగులో ప్రచారం చేయడం ఆమెకు చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయింది. తెలుగు తెలిసిన ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నం మంచి ఫలితాన్నిచ్చింది. సోషల్ మీడియాలో కీర్తన ప్రచార వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. దీంతో ఎన్నికల సమయంలో ఆమె పేరు తమిళనాడు అంతటా వినిపించింది. తమిళనాడుకు చెందిన అమ్మాయి తెలుగులో ఎందుకు మాట్లాడింది? తెలుగుకు ఆమెకు ఉన్న అనుబంధం ఏమిటి?
24
తెలుగుదేశం పార్టీతో అనుబంధం
తమిళనాడులోని విరుద్ నగర్ జిల్లా చత్రరెడ్డియపట్టి గ్రామానికి చెందిన యువతి కీర్తనా సంపత్. ఆమె 1996లో జన్మించారు. తమిళ మీడియంలోనే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. తర్వాత మధురై యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశారు. ఆ తర్వాత పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో స్టాటస్టిక్స్ ఎమ్మెస్సీ పూర్తి చేశారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె రాజకీయ సలహాదారుగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఎంకే స్టాలిన్ వంటి పలువురు రాజకీయ నాయకులతో కలిసి పనిచేశారు. ఆ తర్వాత హైదరాబాదులో ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగానికి టీం లీడర్ గా సమర్థవంతంగా పనిచేశారు. అప్పుడే ఆమెకు తెలుగు భాష పరిచయమైంది. అక్కడున్న తెలుగు ఉద్యోగులతో మాట్లాడుతూ ఆమె తెలుగు భాష పై పట్టు సాధించింది.
34
విజయ్ పిలిచి మరీ టిక్కెట్
ఎంతో మంది నాయకులను తన వ్యూహాలతో గెలిపించిన కీర్తన తానే స్వయంగా రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఆమె సొంత జిల్లాలో ప్రజలు ఎన్నో విషయాల్లో ఇబ్బందులు పడడం ఆమె గమనించారు. ఇక శివకాశిలో జరిగే అగ్ని ప్రమాదాలు, తాగునీరు, రోడ్లు వంటి కనీసం అవసరాలు కూడా లేకపోవడం ఆమెను తీవ్ర ఆలోచనలోకి తోసేసాయి. తన చేతిలో ఉన్న పెద్ద ఉద్యోగాన్ని కూడా వదిలేసి సొంతూరికి వచ్చేశారు.జిల్లాల్లోని పరిస్థితులును వివరిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ, స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేశారు. ఆమె సోషల్ మీడియాలో మాట్లాడే తీరు, ఆమెకున్న పేరు చూసి టీవీకే పార్టీ అధినేత విజయ్ తన పార్టీలోకి ఆహ్వానించారు. శివకాశి నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ను కూడా ఇచ్చారు. ఇక ప్రచారంలోకి దిగిన కీర్తన ఎక్కడ తగ్గకుండా దూసుకుపోయారు. స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ వాటి పరిష్కారానికి ఎలా కృషి చేస్తుందో కూడా ప్రజలకు వివరించారు. ఇక శివకాశిలో తెలుగు మాట్లాడే ప్రజలు కూడా ఎంతోమంది ఉన్నారు. వారిని ఆకట్టుకోవడానికి తెలుగులోనే ఆమె ప్రసంగించారు. తెలుగులో మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆమె ప్రచార శైలికి, మాట తీరుకు ఓటర్లు భారీ మెజారిటీతో శాసనసభకు పంపించారు. శివకాశిలో ఇప్పటివరకు గెలిచిన తొలి మహిళా ఎమ్మెల్యే కీర్తన సంపత్ మాత్రమే.
కీర్తన తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ సులభంగా మాట్లాడగలరు. కీర్తనను నమ్మిన విజయ్ తన క్యాబినెట్లో ఆమెకు మంత్రి పదవిని కూడా ఇచ్చారు. చాలా తక్కువ వయసులో మంత్రి బాధ్యతలు చేపట్టిన నాయకురాలిగా ఇప్పుడు ఆమె వార్తల్లో నిలిచారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి కష్టపడేతత్వంతో ఆమె ఎంతో మందికి స్ఫూర్తిగా మారారు. సోషల్ మీడియా విభాగంలో పనిచేసిన యువతి ఇప్పుడు ఎమ్మెల్యే ఆ తర్వాత మంత్రి స్థాయికి ఎదగడం అంటే సాధారణ విషయం కాదు. యువతకు అవకాశం వస్తే ఎలా ముందుకు వస్తారో కీర్తన సంపత్ పెద్ద ఉదాహరణగా నిలిచారు.