భారతదేశంలో పాపులర్ బిజినెస్ రియాలిటీ షో 'షార్క్ ట్యాంక్ ఇండియా' కేవలం టెలివిజన్ రంగానికే కాకుండా, దేశం మొత్తంలో వ్యాపారం పట్ల దృష్టికోణాన్ని మార్చేసింది. ప్రస్తుతం నాలుగో సీజన్‌లో ఉన్న ఈ షోకి శ్రీకాంత్ బొల్లా కొత్త జడ్జ్‌గా వచ్చారు. ఈ విషయాన్ని ఆయన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. "షార్క్స్‌తో నిండి ఉన్న నీటిలో బతకాలంటే, నీవు కూడా ఒక షార్క్ కావాల్సిందే" అనే ఆసక్తికరమైన క్యాప్సన్‌ను రాసుకొచ్చారు.
Srikanth Bolla
దీని గురించి శ్రీకాంత్ బొల్లా ఇంకా మాట్లాడుతూ.. "అవును, నాకు షార్క్ ట్యాంక్ ఇండియాలో ఒక షార్క్ అవడానికి అవకాశం వచ్చింది. కలలు కనే వాళ్లకే కాదు, ఆ కలల్ని నిజం చేసేవాళ్ల కోసం కూడా అవి ఉంటాయి! షోలో ఉన్న ప్రతిభావంతులైన షార్క్స్‌ను కలవడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రతీ పిచ్ వెనక ఉన్న ఆలోచనలు చాలా ప్రేరణాత్మకంగా అనిపించాయి, ఎక్కడ చూసినా ఇన్నోవేషన్ కనిపిస్తోంది' అని చెప్పుకొచ్చారు.
ఎవరీ శ్రీకాంత్ బొల్లా.?
శ్రీకాంత్ బొల్లా ఒక భారతీయ పారిశ్రామికవేత్త. ఆయన బొల్లంట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కి సీఈఓ, సహ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌గా ఉన్నారు. శ్రీకాంత్‌కి దృష్టి సమస్య ఉన్నా, ఆయన ఓ విజయవంతమైన వ్యాపారవేత్తగా, సేవాభావం ఉన్న వ్యక్తిగా ఎదిగారు. శ్రీకాంత్ బొల్లా.. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)కు చెందిన స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్లో మేనేజ్‌మెంట్ సైన్స్‌లో విద్యనభ్యసించిన తొలి దివ్యాంగుడిగా పేరు సంపాదించుకున్నారు. బొల్లంట్ కంపెనీ వార్షిక ఆదాయం 150 మిలియన్ డాలర్లకు పైగా ఉంది. ప్రస్తుతం ఈ సంస్థలో 500 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
శ్రీకాంత్ బొల్లా మన తెలుగు వారని తెలుసా.?
శ్రీకాంత్ బొల్లా 1991 జూలై 7న ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం సమీపంలోని సీతారామపురంలో జన్మించారు. ఆయన ఒక తెలుగు రైతు కుటుంబానికి చెందినవారు. శ్రీకాంత్ తల్లిదండ్రులు చదువుకోలేదు, వ్యవసాయమే వారి జీవనం.
శ్రీకాంత్‌కు జన్మతోనే దృష్టి సమస్య ఉండటంతో చిన్ననాటి నుంచి చదువు విషయంలో చాలా సవాళ్లు ఎదుర్కొన్నారు. అవసరమైన సదుపాయాలు లేకపోవడం వల్ల విద్య కోసం చాలా కష్టపడ్డారు. ఇంటర్మీడియట్‌లో 98 శాతం మార్కులు సాధించినప్పటికీ, అప్పట్లో ఆయనకు ఉన్నత విద్య కోసం అవకాశాలేవీ లేవు.
కానీ శ్రీకాంత్ మాత్రం తగ్గలేదు. తన హక్కు కోసం కోర్టులో కేసు వేశారు. ఆ కేసు గెలవడానికి ఆరు నెలలు పట్టింది. తర్వాత ఆయన కాలేజీలో చేరారు.
అయితే ఇంజనీరింగ్ చదవాలని ఆసక్తి ఉన్నా, ఐఐటీలో చేరేందుకు అవసరమైన కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు ఆయనకు అడ్మిషన్ ఇవ్వలేదు.
శ్రీకాంత్ బొల్లా సాధించిన ఘనతలు ఇవే:
భారత మాజీ రాష్ట్రపతి స్వర్గీయ డా. ఏ.పీ.జే. అబ్దుల్ కలామ్ ప్రారంభించిన 'లీడ్ ఇండియా 2020: ది సెకండ్ నేషనల్ యూత్ మూమెంట్' లో ఆయన సభ్యుడయ్యారు. 2011లో శ్రీకాంత్ బొల్లా 'సమన్వయ్ సెంటర్ ఫర్ చిల్డ్రెన్ విత్ మల్టిపుల్ డిసెబిలిటీస్' అనే సంస్థను కూడా సహ-వ్యవస్థాపకుడిగా ప్రారంభించారు. ఈ కేంద్రంలో దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన సేవలు అందించడానికి బ్రెయిల్ ముద్రణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు.
2017 ఏప్రిల్‌లో ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన ‘ఆసియా 30 అండర్ 30’ లిస్ట్‌లో శ్రీకాంత్ బొల్లా చోటు దక్కించుకున్నారు. ఆ జాబితాలో ఉన్న ముగ్గురు భారతీయుల్లో ఒకరయ్యారు. శ్రీకాంత్ బొల్లా 2012లో రవి మంథాతో కలిసి 'బొల్లంట్ ఇండస్ట్రీస్'ను ప్రారంభించారు. ఈ సంస్థకు రతన్ టాటా కూడా పెట్టుబడి పెట్టారు. బొల్లంట్ ఇండస్ట్రీస్ అరేకా ఆధారిత ప్లేట్స్‌ను తయారు చేస్తుంది. అలాగే, దివ్యాంగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది.
ఈ కంపెనీ మునిసిపల్ వ్యర్థాలు లేదా ఉపయోగం లేని కాగితాన్ని తిరిగి వినియోగించుకుని పర్యావరణహిత క్రాఫ్ట్ పేపర్ తయారు చేస్తుంది. అంతేకాదు, రీసైకిల్ చేసిన కాగితంతో ప్యాకేజింగ్ ఉత్పత్తులు, ప్రకృతిలో లభించే ఆకులతో డిస్పోజబుల్ ఉత్పత్తులు, ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించుకుని కొత్త ఉత్పత్తులను తయారు చేస్తుంది. శ్రీకాంత్ బొల్లా జీవిత కథ ఎంతో మందికి ప్రేరణగా మారింది. ఆయన జీవితంపై రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో బాలీవుడ్‌లో 'శ్రీకాంత్' అనే సినిమా కూడా రూపొందింది.