Sardar Vallabhbhai Patel birth anniversary: ఉక్కు మనిషి పటేల్‌కు ఘన నివాళి.. దేశానికి ఆయన చేసిన సేవలు ఇవే..

First Published Oct 31, 2021, 2:09 PM IST

ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్.. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత దేశ ఉప ప్రధానిగా పటేల్ పనిచేశారు. అప్పట్లో భారత్‌తో విభేదిస్తున్న, కలిసేందుకు విముఖంగా ఉన్న 500కు పైగా సంస్థానాలను తన చాకచాక్యంతో ఇండియన్ యూనియన్‌‌లో ఐక్యం చేసిన ధీశాలి సర్దార్ పటేల్.

ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్.. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత దేశ ఉప ప్రధానిగా పటేల్ పనిచేశారు. అప్పట్లో భారత్‌తో విభేదిస్తున్న, కలిసేందుకు విముఖంగా ఉన్న 500కు పైగా సంస్థానాలను తన చాకచాక్యంతో ఇండియన్ యూనియన్‌‌లో ఐక్యం చేసిన ధీశాలి సర్దార్ పటేల్. నేడు సర్దార్ పటేల్ 146వ జయంతి సందర్భంగా ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను తెలుసుకుందాం.. 
 

1875, అక్టోబర్ 31న జన్మించిన ఆయన... భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించారు. ఆయన ఒక న్యాయవాది. ముందు నుంచి మహాత్మాగాంధీ మద్దతుదారుడు. 1918లో గాంధీ అధ్వర్యంలో నిర్వహించిన ఖేదా సత్యాగ్రహం తర్వాత ఇరువురి మధ్య పరిచయం పెరిగింది. 22 ఏళ్లకు మెట్రిక్యూలేషన్ పాసయ్యారు. ఆయన 36 నెలల బారిస్టర్ కోర్సును కేవలం 30 నెలల్లో పూర్తి చేశారు. పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచారు.

పటేల్ గుజరాత్ మరియు వెలుపల మద్యపానం, అంటరానితనం, కుల వివక్ష మరియు మహిళా విముక్తి కోసం విస్తృతంగా కృషి చేశారు. మహాత్మా గాంధీని జైలులో పెట్టినప్పుడు, భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడాన్ని నిషేధించే బ్రిటిష్ చట్టానికి వ్యతిరేకంగా 1923లో నాగ్‌పూర్‌లో సత్యాగ్రహ ఉద్యమానికి నాయకత్వం వహించమని పటేల్‌ను కోరారు.

గాంధీ నిర్వహించిన ఉద్యమాల్లో పటేల్ చురుకుగా పాల్గొన్నారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో లక్షలాది మందిని ప్రభావితం చేశారు. భారీగా విరాళాలు సేకరించారు. 1946లో జరిగిన కాంగ్రెస్ ఎన్నికలో పటేల్‌కు మెజారిటీ వచ్చినప్పటికీ.. గాంధీజి మాట విని నెహ్రును తొలి ప్రధాని చేశారు. 

దేశానికి తొలి ఉప ప్రధానిగా, తొలి హోంశాఖ మంత్రిగా విశేష సేవలు అందించారు. రాచరిక రాష్ట్రాల ఏకీకరణలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఉక్కు మనిషిగా పేరు తెచ్చుకున్నారు. 1950 డిసెంబర్ 15 ఆయన ఆరోగ్యం క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. 

సర్దార్ వల్లభభాయి పటేల్ (Sardar Vallabhbhai Patel) జయంతిని(అక్టోబర్ 31) 2014 నుంచి  భారత ప్రభుత్వం రాష్ట్రీయ ఏక్తా దివస్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నేడు సర్దార్ వల్లభభాయి పటేల్ 146వ జయంతి సందర్భంగా (Sardar Vallabhbhai Patel birth anniversary) రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు.
 

మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత పటాల్ సేవలకు గుర్తుగా.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాన్ని గుజరాత్‌లోని కెవాడియాలో నిర్మించారు. దీనికి  స్టాట్యూ ఆఫ్ యూనిటీగా నామకరణం చేశారు.  దీని ఎత్తు 182 మీటర్లు. ఈ విగ్రహం చైనాలోని స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ విగ్రహం కంటే 23 మీటర్ల పొడవు ఉంటుంది. అదే సమయంలో, ఇది అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ (93 మీటర్ల ఎత్తు) కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ.

భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. . ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేలా ఈ వేడుకలను నిర్వహిస్తోంది. 2021 మార్చి 12 నుంచి నుంచి 2022 ఆగస్టు 15 వరకు మొత్తం 75 వారాల పాటు ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’ ప్రత్యేక సంబరాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా స్వతంత్ర్య సమరయోధులను గుర్తుచేసుకుంటున్నారు. 
 

click me!