ఉత్తరాఖండ్ టన్నెల్ నుండి బైటికొచ్చిన కార్మికులతో ప్రధాని మోదీ ఫోన్‌ సంభాషణ..

First Published Nov 29, 2023, 8:16 AM IST

కార్మికులను విజయవంతంగా, సురక్షితంగా బయటకు తీసుకురావడానికి రెస్క్యూ టీమ్ చేసిన ప్రయత్నాలను ప్రధాని అభినందించారు.
 

ఢిల్లీ : ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బైటికి తీసుకువచ్చే రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం అయ్యింది. 17 రోజుల తర్వాత కూలిన సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులు మంగళవారం రాత్రి సురక్షితంగా బైటికి వచ్చారు. మృత్యుంజయులైన ఆ కూలీలతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. 

కార్మికులంతా ఒక గదిలో ఉండి ప్రధానితో టెలిఫోన్‌లో మాట్లాడారు.
కార్మికులను విజయవంతంగా, సురక్షితంగా బయటకు తీసుకురావడానికి రెస్క్యూ టీమ్ చేసిన ప్రయత్నాలను ప్రధాని అంతకుముందే అభినందించారు.

"ఉత్తరకాశీలో మా సోదరుల రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం కావడం ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది. సొరంగంలో చిక్కుకున్న స్నేహితులకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను.. మీ ధైర్యం, సహనం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిని కలిగిస్తుంది. మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను"  అని ప్రధానమంత్రి X లో పోస్ట్ చేసారు.

Latest Videos


"సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, మన స్నేహితులు ఇప్పుడు వారి ఆప్తులను కలుసుకోవడం సంతృప్తిని కలిగించే విషయం. ఈ సవాలు సమయంలో ఈ కుటుంబాలన్నీ చూపిన సహనం, ధైర్యాన్ని ప్రశంసించాలి" అని ప్రధాన మంత్రి అన్నారు.

ప్రతిష్టాత్మక చార్ ధామ్ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న సొరంగం నవంబర్ 12న కుప్పకూలింది. కార్మికులను సురక్షితంగా తరలించడానికి కేంద్ర, రాష్ట్ర రెస్క్యూ బృందాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. కానీ, చివరి నిమిషంలో హైటెక్ డ్రిల్లింగ్ మెషీన్‌లు చివరి కొన్ని మీటర్లను క్లియర్ చేయడంలో విఫలమయ్యాయి. ర్యాట్ -హోల్ మైనింగ్‌ నిపుణులు రంగంలోకి దిగడంతో విజయం సాధ్యమయ్యింది. చివరి 12 మీటర్ల విస్తీర్ణాన్ని 24 గంటల్లోపు తవ్వారు.

కార్మికులను బయటకు తీసే ఆపరేషన్ మంగళవారం రాత్రి 8 గంటలకు ప్రారంభమైంది. దాదాపు గంటలో కార్మికులందరినీ స్ట్రెచర్లపై బయటకు తీశారు. ఈ సమయంలో బయట ఉష్ణోగ్రత దాదాపు 14 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఈ పరిస్థితులకు ప్రతి కార్మికుడు తిరిగి అలవాటు పడేందుకు వెలికితీత ప్రక్రియకు కొంత సమయం పట్టింది.

కార్మికులు ప్రత్యేక స్ట్రెచర్లపై బయటకు తీసుకువచ్చారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ ప్రక్రియ మొత్తాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. కార్మికులు బయటకు రాగానే కౌగిలించుకున్నారు. మొదటి కార్మికుడు సొరంగం నుండి బయటకు వచ్చిన వెంటనే, రెస్క్యూ సిబ్బంది,  సైట్ వద్ద ఉన్నవారు పూలమాలలు, మిఠాయిలు పంచి ఆనందోత్సాహాలతో వారికి స్వాగతం పలికారు. 

17 రోజుల తర్వాత మొదటిసారిగా తమ వారిని కలుసుకోవడంతో ఆ కార్మికుల కుటుంబాలు సంతోషించాయి. అప్పటికే సిద్ధంగా ఉంచిన 41 అంబులెన్స్‌లలో ఒక్కో కార్మికుడిని 30 కి.మీ దూరంలో ఉన్న చిన్యాలిసౌర్‌లో ఏర్పాటు చేసిన అత్యవసర వైద్య సదుపాయాల కోసం తరలించారు. 

click me!