ప్రధాని మోదీ ప్రసంగం : పండగ చేసుకోండి

Published : Sep 21, 2025, 05:14 PM ISTUpdated : Sep 21, 2025, 05:28 PM IST

PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. జీఎస్టీ 2.0 సంస్కరణలు సహా పలు కీలక అంశాలను ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు.

PREV
16
నవరాత్రుల నుంచే జీఎస్టీ ఉత్సవ్

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన రేపటి నుండి అమల్లోకి రానున్న జీఎస్టీ 2.0 సంస్కరణలు భారత ఆర్థిక వృద్ధికి కొత్త ఊపు ఇస్తాయని చెప్పారు. సోమవారం నుండి దేశవ్యాప్తంగా ‘జీఎస్టీ బచత్ ఉత్సవం’ ప్రారంభమవుతుందని ఆయన ప్రకటించారు.

26
ఆత్మనిర్భర్ భారత్ వైపు మరో అడుగు

పీఎం మోదీ మాట్లాడుతూ, “రేపటి నుండి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఆ రోజుతోనే దేశం ఆత్మనిర్భర్ భారత్ దిశగా మరో పెద్ద అడుగు వేస్తుంది. కొత్త తరం జీఎస్టీ సంస్కరణలు రేపటి నుంచే అమలులోకి వస్తాయి” అని తెలిపారు. ఈ సంస్కరణలు ప్రజల ఖర్చులను తగ్గించి, పొదుపులను పెంచుతాయని, దీంతో దేశ ఆర్థిక స్థిరత్వం మరింత బలపడుతుందని ఆయన అన్నారు.

36
పెట్టుబడులు పెరుగుదలతో ప్రజల్లో సంతోషం

ప్రధాని మోదీ తన ప్రసంగంలో “జీఎస్టీ బచత్ ఉత్సవం పెట్టుబడులను పెంచుతుంది. పొదుపులు పెరిగి, ప్రజల జీవితాల్లో సంతోషం నింపుతుంది. ఇవన్నీ కలిపి భారత వృద్ధి కథనాన్ని వేగవంతం చేస్తాయి” అని పేర్కొన్నారు.

46
భారత ఆర్థిక వృద్ధికి ఊతం

ఈ సంస్కరణలు కేవలం పన్ను మార్పులు మాత్రమే కాకుండా దేశ ఆర్థిక నిర్మాణానికి కొత్త శక్తి అని ప్రధాని మోదీ అన్నారు. ఉత్పత్తి, వినియోగం, పెట్టుబడుల విభాగాలన్నింటిలోనూ జీఎస్టీ 2.0 ఒక సానుకూల ప్రభావాన్ని చూపుతుందని చెప్పారు.

56
పన్నుల సంక్లిష్టత నుంచి విముక్తి లభించింది : మోదీ

“2017లో జీఎస్టీ మొదలైనప్పటి నుండి పన్నుల చరిత్రలో కొత్త అధ్యాయం రాశామని గుర్తుచేశారు. “దశాబ్దాల పాటు మన దేశ ప్రజలు, వ్యాపారులు ఆక్ట్రోయ్, ఎంట్రీ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, ఎక్సైజ్, వ్యాట్, సర్వీస్ ట్యాక్స్ వంటి అనేక పన్నుల గజిబిజిలో చిక్కుకున్నారు. ఒక నగరం నుండి మరొక నగరానికి సరుకులు పంపడానికి అనేక చెక్‌పోస్టులు దాటాల్సి వచ్చేది” అని ప్రధాని మోదీ అన్నారు.

ప్రధాని మోదీ ఒక ఉదాహరణ ప్రస్తావించారు. “2014లో నేను ప్రధాని పదవి చేపట్టిన కొద్ది రోజులకే ఒక విదేశీ పత్రికలో ఆసక్తికరమైన వార్త వచ్చింది. ఒక కంపెనీ బెంగళూరులో నుండి హైదరాబాద్‌కు (570 కి.మీ దూరం) సరుకులు పంపడం కష్టంగా అనిపించడంతో, మొదట యూరప్‌కు పంపి, అక్కడి నుండి హైదరాబాద్‌కు పంపడమే తక్కువ కష్టమని భావించింది. ఇదే పరిస్థితి అప్పట్లో అనేక కంపెనీలు ఎదుర్కొన్నాయి. చివరికి ఈ ఖర్చు పేదలకు, వినియోగదారులపై పడింది” అని అన్నారు.

66
జీఎస్టీ 2.0 వల్ల కలిగే లాభాలు

జీఎస్టీ 2.0 వల్ల కలిగే లాభాలను కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. “ఇప్పుడు ఈ సంస్కరణల వల్ల వినియోగదారులు క్లిష్టమైన పన్నుల నుండి విముక్తి పొందారు. అవసరమైన రోజువారీ వస్తువులు పన్ను లేకుండా లేదా 5% జీఎస్టీతో అందుబాటులో ఉంటాయి. ఇది మధ్యతరగతికి రెట్టింపు లాభం ఉంటుంది. ధరలు తగ్గుతాయి, పొదుపులు పెరుగుతాయి. పెట్టుబడులు పెరిగి ప్రజల జీవితాల్లో సంతోషం నిండుతుంది. ఇవన్నీ కలిపి భారత వృద్ధిని మరింత వేగవంతం చేస్తాయి” అని చెప్పారు.

Read more Photos on
click me!

Recommended Stories