Odisha Train Accident: ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ.. ఘటన స్థలంలో సహాయక చర్యలపై సమీక్ష..

First Published Jun 3, 2023, 5:05 PM IST

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటన స్థలాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ప్రమాద స్థలంలో జరుగుతున్న సహాయక చర్యలను సమీక్షించారు. 

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటన స్థలాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. రైలు ప్రమాద స్థలంలో జరుగుతున్న సహాయక చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా  స్థానిక అధికారులు, విపత్తు సహాయక దళాల సిబ్బంది, రైల్వే అధికారులతో ప్రధాని మాట్లాడారు. వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

ప్రధాని మోదీ వెంటే కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రదాన్‌లతో పాటు పలువురు రైల్వే శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా ప్రమాదానికి సంబంధించి వివరాలను కేంద్ర మంత్రులు, అధికారులు.. ప్రధాని మోదీకి వివరించారు. 
 

ఇక, ప్రమాద స్థలం నుంచే ప్రధాని మోదీ.. క్యాబినెట్ సెక్రటరీ, ఆరోగ్య మంత్రితో మాట్లాడారు. క్షతగాత్రులకు, వారి కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయాలు అందేలా చూడాలని ఆయన కోరారు. మృతుల కుటుంబాలకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, బాధితులకు అవసరమైన సహాయాన్ని అందజేస్తూ ఉండాలని ఆయన అన్నారు.
 

రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం ప్రధాని మోదీ కటక్ బయలుదేరి వెళ్లారు. అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్న మోదీ.. వారికి ధైర్యం చెప్పనున్నారు. 

ఇదిలా ఉంటే ఒడిశా రైలు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘ఒడిశాలో రైలు ప్రమాదం కలకలం రేపింది. ఈ దుఃఖ సమయంలో నా ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మాట్లాడాను. పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులకు అన్ని విధాలా సహాయాన్ని అందజేస్తున్నారు’’ అని మోదీ పేర్కొన్నారు. 

శనివారం ఉదయం ఒడిశా రైలు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదం గురించిన వివరాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు. అనంతరం ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి బయలుదేరి ఒడిశాలోని రైలు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. 

click me!