పెట్రోల్ పంప్ జంప్ ట్రిక్ స్కామ్:
ప్రస్తుత కాలంలో పెట్రోల్, డీజిల్ అనేవి నిత్యావసర సరుకులుగా మారిపోయాయి. మనిషి బ్రతుకు బండి నడవాలంటే అతడి ఏదో ఒక బండి ఎక్కాల్సిందే... అది ముందుకు నడవాలంటూ ఇంధనం వుండాల్సిందే. ఇలా మనిషికి ఆహారం లాగా వాహనాలకు ఇంధనం అవసరం. ప్రతిఒక్కరి వద్ద సొంత వాహనాలు పెరిగిపోవడంతో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా ఆకాశాన్ని అంటున్నాయి.
అయితే మీరు వందలు, వేల రూపాయలు పెట్టి బండిలో ఇంధనం (పెట్రోల్, డీజిల్) కొట్టిస్తున్నారా? పెట్రోల్ బంక్ కు పోయిన ప్రతిసారి మనం చెల్లించే డబ్బులకు సరిపడా పెట్రోల్ కొడుతున్నాడా అనే అనుమానం వస్తుంది. మరి నిజంగానే పెట్రోల్ బంకుల్లో మోసాలు జరుగుతాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది.
'సార్, 0 చూడండి' పెట్రోల్ పోయడానికి ముందు బంక్ సిబ్బంది నుండి వినిపించే మాట. అంటే రీడింగ్ సున్నా నుండే స్టార్ట్ అవుతుందని... మేము ఎలాంటి మోసాలకు పాల్పడటం లేదని వారి ఉద్దేశం. అయితే కొన్ని బంకుల్లో ఈ మాటల వెనకే అసలు మోసం దాగి వుంటుందట. కేవలం సున్నా చెక్ చేయడం వల్ల సరైన ఇంధనం వస్తుందని హామీ లేదు. చాలా పెట్రోల్ పంపులు 'జంప్ ట్రిక్' ద్వారా వినియోగదారులను మోసం చేస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి.