ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా చుట్టుపక్కల దేశాలు పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ లలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇప్పుడు ఇండియాలో కూడా పెట్రోల్ ధరలు పెరగనున్నాయట. ఎప్పట్నుంచో తెలుసా..?
దేశంలో త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని 'కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్' (KIE) నివేదించింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తికాగానే ఇంధన ధరలు పెరుగుతాయని ఈ రిపోర్ట్ స్పష్టం చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగినందున, లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.25 నుంచి రూ.28 వరకు పెంచాల్సిన అవసరం ఉందని తెలిపింది. అయితే ప్రజలపై భారం పడకుండా ఉండేందుకు, ఒకేసారి కాకుండా దశలవారీగా ధరలు పెంచే అవకాశం ఉన్నట్లు కొటక్ రిపోర్ట్ చెబుతోంది.
25
ఎందుకు ధరల పెంపు..?
పశ్చిమ ఆసియాలో ఇంకా యుద్దవాతావరణమే నెలకొంది. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే సముద్ర రవాణాలో కీలకమైన 'హార్ముజ్ జలసంధి' మూతపడింది. అందువల్లే మిడిల్ ఈస్ట్ దేశాల నుండి జరిగే చమురు వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడింది. దీనివల్ల ముడిచమురు ధరల్లో భారీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. స్పాట్ ధరలు, ఫ్యూచర్స్ ధరల మధ్య వ్యత్యాసం పెరుగుతోంది. ఇది చమురు సరఫరాపై తీవ్రమైన ఒత్తిడి ఉందని సూచిస్తోంది.
35
దిగుమతి ఖర్చులభారం...
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడంతో భారత్ దిగుమతి ఖర్చు గణనీయంగా పెరిగింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో భారత్ 'క్రూడ్ బాస్కెట్' ధర బాగా పెరిగింది. దిగుమతుల పరిమాణం 13-15% తగ్గినా, దిగుమతి ఖర్చు పెరగడంతో రోజుకు 190 నుంచి 210 మిలియన్ డాలర్ల మేర అదనపు భారం పడుతోంది. అందువల్లే ఆయిల్ కంపెనీలు ధరల పెంపుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.
అయితే పెట్రోల్, డీజిల్ ధరల పెంపు పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశాలున్నాయి... అందుకే కేంద్రం తాత్కాలికంగా పెంపును అడ్డుకుంది. ఎన్నికలు ముగియగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం ఖాయమని కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ చెబుతోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో ముడి చమురు ధరలు పెరిగినా, భారత్‌లో ఇంధన ధరలను సవరించలేదు. ఇది చమురు శుద్ధి కర్మాగారాలకు (రిఫైనరీలకు) భారీ ఆర్థిక భారంగా మారింది. కంపెనీలకు ప్రతినెలా సుమారు రూ.27,000 కోట్ల అదనపు నష్టం వాటిల్లుతోంది. ప్రభుత్వం ఎక్సైజ్ సుంకంలో రూ.10 మినహాయింపు ఇచ్చినా, అది కంపెనీల భారీ నష్టాలను పూడ్చడానికి సరిపోవడం లేదు. అందుకే ధరలు పెంపు తప్పేలా లేదంటున్నారు మార్కెట్ నిపుణులు.
55
ఏప్రిల్ 29 తర్వాత ధరల సవరణ..?
రాజకీయ కారణాల వల్లే ప్రస్తుతం ధరల పెంపును నిలిపివేశారని కోటక్ ఈక్విటీస్ విశ్లేషించింది. ఏప్రిల్ 29న చివరి దశ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంధన ధరలను సవరించే అవకాశం ఉంది. ముడి చమురు ధర బ్యారెల్‌కు సుమారు 120 డాలర్లకు చేరడంతో, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని, చిన్న మొత్తాల్లో ధరలు పెంచాలని కంపెనీలు నిర్ణయించాయి. దీన్నిబట్టి వచ్చేనెల మే లో ఎప్పుడైనా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఉంటుందన్నమాట.