
Pawan Kalyan : సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ పవన్ కల్యాణ్ క్రేజ్ మామూలుగా లేదు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ తో జనసేన పార్టీని గెలిపించుకోవడమే కాదు టిడిపి, బిజెపి ల గెలుపులోనూ కీలక పాత్ర పోషించి కూటమికి అద్భుత విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇలాంటి ప్రదర్శనే కనబర్చి పాలిటిక్స్ లో కూడా తాను పవర్ స్టార్ నే అని నిరూపించుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంను మహారాష్ట్ర ఎన్నికల్లో ఉపయోగించుకుని మంచి రిజల్ట్ రాబట్టింది ఎన్డిఏ. మహాయుతి కూటమి తరపున తెలుగు ప్రజలు ఎక్కువగా వుండే ప్రాంతాల్లో పవన్ ప్రచారం నిర్వహించారు. ఇలా పవన్ ప్రచారం చేపట్టిన అన్ని నియోజకవర్గాల్లోనూ మహాయుతి కూటమి విజయం సాధించింది.
పవన్ ప్రచారం చేపట్టిన నియోజకవర్గాల పలితాలివే :
పూణే కంటోన్మెంట్ :
పూణే కంటోన్మెంట్ నియోజకవర్గంలో మహాయుతి కూటమి తరపున బిజెపి అభ్యర్థి కాంబ్లే సునీల్ ద్యాన్ దేవ్ బరిలోకి దిగారు. ఈ నియోజకవర్గంలో తెలుగు ప్రజలు ఎక్కువగా వుండటంతో పవన్ కల్యాణ్ ను ప్రచారంలోకి దించింది బిజెపి. ఈ ప్రభావం ఎన్నికలపై పడి బిజెపి 10 వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు.
పూణే కంటోన్మెంట్ లో సునీల్ ద్యాన్ దేవ్ కు మొత్తం 76,032 ఓట్లు రాగా మహా వికాస్ అఘాడీ తరపున పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ ఆనంద్ రావ్ కు కేవలం 65,712 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ తెలుగు ప్రజల ఓట్లు చాలా కీలకం... కాబట్టి పవన్ ప్రచారం బాగా పనిచేసిందనే చెప్పాలి.
బల్లార్ పూర్ :
మహారాష్ట్రలోని బల్లార్ పూర్ నియోజకవర్గంలో జనసేనాని పవన్ కల్యాణ్ బిజెపి అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. తాజాగా వెలువడిన ఎన్నికల పలితాల్లో ఇక్కడ బిజెపి విజయం సాధించింది. మహాయుతి కూటమి తరపున పోటీచేసిన ముంగతివార్ సుధీర్ సచ్చిదానంద్ ఏకంగా 26,047 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆయనకు 1,04,975 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి రావత్ సంతోష్ సింగ్ చందన్ సింగ్ కు 78,928 ఓట్లు వచ్చాయి.
డెగ్లూర్ :
మహారాష్ట్రలోని డెగ్లూర్ నియోజకవర్గంలో కూడా పవన్ కల్యాణ్ ప్రచారం నిర్వహించారు. ఇక్కడ కూడా మహాయుతి కూటమి తరపున పోటీచేసిన బిజెపి అభ్యర్థి అంతపూర్కర్ జితేష్ రావుసాహెబ్ విజయం సాధించారు. ఆయనకు మొత్తం 1,07,841 ఓట్లు పోలవగా మహా వికాస్ అఘాడి కూటమి తరపున పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్థి నివృత్తి కొండిబ కాంబ్లె సాంగ్వికర్ కి కేవలం 64,842 ఓట్లు వచ్చాయి. ఇలా ఏకంగా 42,999 ఓట్ల మెజారిటీతో విజయం బిజెపి విజయం సాధించింది.
షోలాపూర్ :
షోలాపూర్ సిటీ సెంట్రల్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి దేవేంద్ర రాజేష్ కోతే విజయం సాధించారు. ఆయనకు మద్దతుగా పవన్ ప్రచారం నిర్వహించారు. తాజా విజయం తర్వాత దేవేంద్ర మాట్లాడుతూ... పవన్ కల్యాణ్ ప్రచారం తన విజయానికి ఎంతగానో దోహదపడిందని అన్నారు. తనకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన పవన్ కల్యాణ్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
లాతూర్ :
లాతూర్ లో కూడా పవన్ కల్యాణ్ ప్రచారం నిర్వహించారు. కానీ ఇక్కడ మిశ్రమ ఫలితం వచ్చింది. లాతూర్ సిటీలో బిజెపి అభ్యర్థి అర్చన పాటిల్ చకుర్కర్ పై అమిత్ విలాస్ రావు దేశ్ ముఖ్ విజయం సాధించారు. ఇక లాతూర్ రూరల్ లో మాత్రం బిజెపి అభ్యర్థి రమేష్ కాశీరాం కరద్ విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ధీరజ్ విలాస్ రావు దేశ్ ముఖ్ ఓటమిపాలయ్యారు.