New Year: మరికొన్ని గంటల్లో న్యూ ఇయర్ మొదలు కానుంది. అయితే ప్రపంచంలో పలు దేశాల్లో వివిధ సమయాల్లో న్యూఇయర్ వేడుకలు జరుగుతాయి. వేడుకలు జరుపుకునే మొదటి, చివరి దేశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచం మొత్తం ఒకే క్షణంలో నూతన సంవత్సరాన్ని స్వాగతించదు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉండటంతో, ఒక్కో ప్రాంతంలో సమయం మారుతుంది. అదే టైమ్ జోన్ వ్యవస్థ. ఈ కారణంగా కొన్ని ప్రాంతాల్లో జనవరి 1 మొదలయ్యేలోపు, మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా డిసెంబర్ 31 కొనసాగుతూనే ఉంటుంది. అందుకే న్యూ ఇయర్ వేడుకలు ప్రపంచం చుట్టూ దశలవారీగా జరుగుతాయి.
25
ప్రపంచంలో మొదట న్యూ ఇయర్ జరుపుకునే ప్రదేశం
ప్రపంచ పటంలో తూర్పు చివరగా ఉండే కిరితిమతి దీవి నూతన సంవత్సరానికి ముందుగా అడుగు పెడుతుంది. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న కిరిబాటి దేశానికి చెందిన ద్వీపం. ప్రపంచం ఇంకా డిసెంబర్ 31 రాత్రిలో ఉండగానే, ఇక్కడ అర్థరాత్రి 12 గంటలు దాటి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఆసక్తికరంగా, ఈ దీవిలో పారిస్, లండన్, పోలాండ్ వంటి పేర్లతో గ్రామాలు ఉండటం ప్రత్యేక ఆకర్షణ.
35
న్యూజిలాండ్ నుంచి ఆస్ట్రేలియా వరకూ సంబరాలు
కిరితిమతి తర్వాత నూతన సంవత్సరం న్యూజిలాండ్ దీవుల్లో అడుగుపెడుతుంది. చాథమ్ దీవుల్లో భారత కాలమానం ప్రకారం సాయంత్రం 3:45కే కొత్త ఏడాది మొదలవుతుంది. ఆక్లాండ్, వెల్లింగ్టన్ నగరాల్లో కొద్దిసేపటి తర్వాత వేడుకలు మొదలవుతాయి. ఆస్ట్రేలియాలో సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ వద్ద జరిగే బాణసంచా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 ప్రాంతంలో అక్కడ న్యూ ఇయర్ సంబరాలు గరిష్ఠ స్థాయికి చేరతాయి.
భారత్ డిసెంబర్ 31 అర్థరాత్రి 12 గంటలకు నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తుంది. ఈ సమయానికి జపాన్, దక్షిణ కొరియా, చైనా ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకలు ముగించుకుంటాయి. భారత్ తర్వాత ఐరోపా దేశాలు కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తాయి. లండన్ బిగ్ బెన్ గడియారం మోగిన తర్వాతే అక్కడ జనవరి 1 మొదలవుతుంది.
55
చివరగా న్యూ ఇయర్ చెప్పుకునే ప్రాంతం
ప్రపంచంలో అందరికంటే చివరగా న్యూ ఇయర్ జరుపుకునే ప్రాంతం అమెరికన్ సమోవా. ఇది UTC-11 టైమ్ జోన్‌లో ఉంటుంది. ప్రపంచమంతా ఇప్పటికే జనవరి 1 ఆనందాల్లో మునిగిపోయినా, ఇక్కడ మాత్రం ఇంకా డిసెంబర్ 31నే కొనసాగుతుంది. భారత కాలమానం ప్రకారం జనవరి 1 సాయంత్రం 4:30 సమయానికి అక్కడ అర్థరాత్రి 12 గంటలు అవుతాయి. అంటే మనం మధ్యాహ్న భోజనం పూర్తిచేసే వేళ, వారు కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు.