
''ఎవడైనా కోపంగా కొడతాడు లేపోతే బలంగా కొడతాడు... వీడేంట్రా చాలా శ్రద్దగా కొట్టాడు. జాగ్రత్తగా, పద్దతిగా కొట్టాడ్రా'' అంటూ అతడు సినిమాలో తనికెళ్ల భరణి చెప్పే డైలాగ్ గుర్తుందా? ఈ యువకుడిని చూస్తే సేమ్ ఇదే ఫీలింగ్ కలుగుతుంది. ఈతరం కుర్రాళ్లు చేస్తున్న పనే అతడు చేసాడు... కానీ చాలా పద్దతిగా, శ్రద్దగా చేసాడు. అందువల్లే అతడికి ప్రపంచస్థాయిలో గుర్తింపు లభించింది.
అతడు సరదాగా చేసిన పనికి ఏకంగా గిన్నిస్ బుక్ కు చేరింది. స్వయంగా గిన్నిస్ బుక్ వారే అతడి రికార్డును నమోదు చేసుకున్నారు. ఇంతకూ ఆ యువకుడు గిన్నిస్ రికార్డ్ సాధించేందలా ఏం చేసాడో తెలుసుకుందాం.
రీల్ తో గిన్నిస్ బుక్ ఏంట్రా బాబు :
ఈ టెక్నాలజీ యుగంలో చిన్నపిల్లల నుండి ముసలివాళ్ల వరకు ప్రతిఒక్కరూ మొబైల్ ఫోన్ వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతిఒక్కరూ తప్పకుండా సోషల్ మీడియాను వాడుతుంటారు. మరీముఖ్యంగా నేటి యువతరం అయితే దీన్ని విరివిగా వాడేస్తున్నారు... కొత్తకొత్త రీల్స్ చేస్తూ నెటిజన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రస్తుతం రీల్స్ కల్చర్ మరీ ఎక్కువైపోయింది... ఇలా ఓ కుర్రాడు కూడా ఏదో సరదాకు ఓ రీల్ చేసాడు. చాలా సాధారణమైన ఈ వీడియో నెటిజన్స్ కు తెగ నచ్చేసింది... ఇంకేముంది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంతలా అంటే చివరకు ఈ ఒక్క రీల్ గిన్నిస్ బుక్ రికార్డును సొంతం చేసుకుంది.
కేరళకు చెందిన మహ్మద్ రిజ్వాన్ స్నేహితులతో కలిసి వాటర్ ఫాల్ వద్దకు వెళ్ళాడు. అయితే స్నేహితులు వాటర్ ఫాల్ వద్దగల నీటిలోకి దిగగా ఇతడు మాత్రం పుట్ బాల్ మ్యాజిక్ చేసాడు. పుట్ బాల్ ను సరిగ్గా గురిచూసి కిక్ చేయగా అది సరిగ్గా వాటర్ ఫాల్ లోకి వెళ్లింది. రాళ్లను తాకుతూనే వాటర్ ఫాల్ లోకి దూరింది ఈ ఫుట్ బాల్.
ఇలా రిజ్వాన్ ఫుట్ బాల్ ను అత్యంత చాకచక్యంగా వాటర్ ఫాల్ లోకి కిక్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో ఎంతలా వైరల్ అయ్యిందంటే ఏకంగా 554 మిలియన్ వ్యూస్ సాధించింది. అంటే మన దేశ జనాభాలో దాదాపు సగంమంది ఈ వీడియోను చూసారన్నమాట. అలాగే 84 లక్షల లైక్స్ ను ఈ ఒక్క రీల్ సొంతం చేసకుంది.
ఇప్పటివరకు సోషల్ మీడియాలో అత్యధిక వ్యూస్ సాధించిన రీల్ గా రిజ్వాన్ ఫుట్ బాల్ వీడియో చరిత్ర సృష్టించింది. ఇది గుర్తించిన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఈ రికార్డును నమోదు చేసుకున్నారు. ఇలా కేవలం ఒకే ఓక్క రీల్ తో రిజ్వాన్ కు గిన్నిస్ బుక్ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు వందలు వేల రీల్స్ చేసినవరికి దక్కని అవకాశం కేవలం ఒకే ఒక్క వీడియోతో రిజ్వాన్ కు దక్కింది. ఇది అతడి అదృష్టమే అని చెప్పాలి.
సోషల్ మీడియా వల్ల ఓవర్ నైట్ లో స్టార్స్ :
సోషల్ మీడియా పుణ్యాన సామాన్యులు సైతం ఓవర్ నైట్ స్టార్లుగా మారుతున్నారు. ఒక్క వీడియో క్లిక్ అయ్యిందంటే చాలు... మంచి గుర్తింపు లభిస్తోంది. ఇలా ఇటీవల 'కోయ్ కోయ్' సాంగ్ తో ఖమ్మం జిల్లాకు చెందిన పాస్టర్ మీసాల గురప్ప ఏ స్థాయిలో ఫేమస్ అయ్యాడో అందరికీ తెలిసిందే. అతడి పాడే పాటలు ఏ బాషలోనివో తెలీదు? వాటి అర్థం తెలీదు? కానీ ఇవి మంచి రిథమ్ తో వుండటంతో నెటిజన్లకు తెగ నచ్చాయి. అంతేకాదు పాటులు పాడే సమయంలో పాస్టర్ హావభావాలు కామెడీగా వున్నాయి. దీంతో అతడు సోషల్ మీడియా స్టార్ గా మారారు.
ఇక ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో ఓ పూసలమ్మే అమ్మాయి ఎంత ఎంత ఫేమస్ అయ్యిందో అందరం చూస్తున్నాం. స్టార్ హీరోయిన్లను మించిన ఆమె అందానికి అందరూ ఫిదా అవుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు, వీడియో తెగ చక్కర్లు కొడుతున్నాయి. లక్షలు, కోట్లు పెట్టినా రాని గుర్తింపు ఒక్క కుంభమేళాతో ఈమెకు వచ్చేసింది.
ఇక ఇదే కుంభమేళాలు కొందరు సన్యాసులు కూడా బాగా ఫేమస్ అవుతున్నారు. వీరిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఐఐటి బాబా గురించి. దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థలైన ఐఐటీలో చదివిన అతడు సన్యాసిగా మారడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో అతడి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. టీవి,యూట్యూబ్ వాళ్ల ఇంటర్వ్యూలతో ఈ ఐఐటీ బాబాకు మరింత గుర్తింపు వచ్చింది.