
ఇన్సూరెన్స్ డబ్బులు అంటే, చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక భరోసా. కానీ, అదే డబ్బుల కోసం ఏకంగా ఒక ప్లాస్టిక్ బొమ్మను శవంగా కాల్చేందుకు తెగించారంటే ఎంతకు దిగజారారో ఊహించండి! ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసిన ఈ రూ. 50 లక్షల బీమా మోసం కథ తెలిస్తే.. డబ్బుల కోసం ఇంతటి దారుణమా? అని నోరు వెళ్లబెట్టక తప్పదు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఓ వ్యక్తి పన్నిన ఈ పకడ్బందీ కుట్ర చివరకు బయటపడింది.
ఉత్తరప్రదేశ్‌లోని హాపుర్ జిల్లా గఢ్‌ముక్తేశ్వర్ గంగా ఘాట్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఒక ఘటన అందరినీ షాక్ కు గురిచేసింది. ఓ ప్లాస్టిక్ మనిషి బొమ్మను నిజమైన శవంగా చిత్రీకరించి అంత్యక్రియలు చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. అయితే, స్థానికుల అనుమానంతో ఈ వ్యవహారం మొత్తం బయటపడింది. ఈ ప్రయత్నం వెనుక రూ. 50 లక్షల భారీ బీమా మోసం దాగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
త్యక్రియల ముసుగులో జరిగిన నేరాన్ని చూసి ప్రజలు, పోలీసులు షాక్ అయ్యారు. ప్రధాన నిందితులు పారిపోవడానికి ప్రయత్నించారు. మోసానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించగా, మిగిలిన ఇద్దరు పరారయ్యారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. హర్యానా రిజిస్ట్రేషన్ గల ఐ20 కారులో నలుగురు వ్యక్తులు ఒక మృతదేహాన్ని తీసుకుని గఢ్‌ముక్తేశ్వర్ ఘాట్‌కు చేరుకున్నారు. తమ వెంట తెచ్చింది శవం అని వారు స్థానికులకు తెలిపారు.
అక్కడున్న వారు తెలిపిన ప్రకారం.. ఆ నలుగురు వ్యక్తులు ఘాట్‌లో నిర్వహించాల్సిన సంప్రదాయ కర్మకాండలు ఏవీ చేయకుండా, నేరుగా చితి వద్దకు వెళ్లాలని తొందరపెట్టారు. దీంతో అనుమానం వచ్చి అక్కడ ఉన్న కొందరు స్థానికులు కట్టెలపై ఉంచిన వస్త్రాన్ని పక్కకు తీసి చూశారు. ఒక్కసారిగా షాక్.. మనిషి శవం బదులు, ప్లాస్టిక్ బొమ్మ అక్కడుంది.
ఆ ప్లాస్టిక్ బొమ్మను మానవ దేహాన్ని పోలి ఉండేలా సీల్ చేసి, అందులో వస్తువులతో నింపి సిద్ధం చేశారు. ఇది సాధారణంగా కనిపించే విషయం కాదని గుర్తించిన స్థానికులు.. ఇద్దరిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అరెస్ట్ అయిన నిందితులు మొదట పోలీసులకు ఒక వింత కథనాన్ని అల్లడానికి ప్రయత్నించారు. ఢిల్లీలోని ఒక ఆసుపత్రి పొరపాటున నిజమైన శవం బదులు, సీల్ చేసిన బొమ్మ లాంటి ప్యాకేజీని తమకు ఇచ్చిందని పేర్కొన్నారు.
అయితే, వారి మాటల్లో తేడాతను గుర్తించిన పోలీసులు.. స్టేషన్‌కు తరలించి తమ స్టైల్లో విచారించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
విచారణ సందర్భంగా, నిందితులు చివరకు నిజం ఒప్పుకున్నారు. నిందితుల్లో కైలాశ్‌పురి, పాలమ్ (ఢిల్లీ) నివాసి కమల్ సోమాని, అతని స్నేహితుడు ఉత్తమ్ నగర్ నివాసి ఆశిష్ ఖురానా ఉన్నారు. గఢ్ సర్కిల్ ఆఫీసర్ (సీఓ) స్తుతి సింగ్ అందించిన వివరాల ప్రకారం, కమల్ సోమాని రూ. 50 లక్షలకు పైగా అప్పుల ఊబిలో కూరుకుపోయాడు.
ఈ అప్పుల నుండి తప్పించుకోవడానికి, కమల్ ఒక కుట్ర పన్నాడు. అతను తన మాజీ ఉద్యోగి అన్షుల్ కుమార్ ఆధార్, పాన్ కార్డులను అతని ప్రమేయం లేకుండా తీసుకున్నాడు. సుమారు ఒక సంవత్సరం క్రితం, కమల్, అన్షుల్ పేరు మీద రూ. 50 లక్షల జీవిత బీమా పాలసీని తీసుకున్నాడు. అప్పటి నుండి క్రమం తప్పకుండా ప్రీమియంలు కూడా చెల్లిస్తున్నాడు. బుధవారం రోజున, కమల్ ఆ ప్లాస్టిక్ బొమ్మను శవంగా చుట్టి బ్రజ్‌ఘాట్‌కు తీసుకువచ్చాడు. నకిలీ అంత్యక్రియలు నిర్వహించాలనేది అతని ఉద్దేశం. ఆ తర్వాత నకిలీ మరణ ధృవీకరణ పత్రాన్ని పొందడం, బీమా క్లెయిమ్‌ను దాఖలు చేయడం, ఆ సొమ్మును కాజేయడం అతని లక్ష్యం. అయితే, కమల్ మోసాన్ని ప్లాస్టిక్ బొమ్మతో బయటపడింది.
ఈ వ్యవహారంలో మిగిలిన అనుమానాలను తొలగించడానికి, పోలీసులు అన్షుల్‌ను సంప్రదించారు. ప్రయాగ్‌రాజ్‌లోని తన నివాసం నుండి అన్షుల్ ప్రశాంతంగా తాను ఆరోగ్యంగా, సజీవంగా ఉన్నట్లు ధృవీకరించాడు. అంతేకాక, తన పేరు మీద బీమా పాలసీ తీసుకున్న విషయం తనకు తెలియదని చెప్పాడు.
పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్‌లో ఉపయోగించిన ఐ20 కారును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.