
Maharashtra Assembly Election Results 2024 : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయం ఖాయమయ్యింది. ఇవాళ(శనివారం) ఇప్పటివరకు వెలువడిన పలితాలను బట్టి చూస్తే మహాయుతి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అర్థమవుతోంది. అయితే ముఖ్యమంత్రి ఎవరన్న సస్పెన్స్ కొనసాగుతోంది. కూటమిలోని బిజెపి, శివసేన (శిండే వర్గం), నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం) లో ఎవరు సీఎం పీఠాన్ని అధిరోహిస్తారో క్లారిటీ లేదు. ఎవరికి వారు సీఎం పదవి తమదేనన్న ధీమాతో వున్నారు.
బిజెపిదే సీఎం సీటు :
మహాయుతి కూటమిలో ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను దాటి 288 సీట్లకుగాను 220కి పైగా సీట్లలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇందులో అత్యధిక సీట్లు బిజెపి ఖాతాలో వున్నాయి... ఈ పార్టీ ఏకంగా 125 స్థానాల్లో ఆధిక్యంలో వుంది. ఓ చోట విజయం కూడా సాధించింది. ఇక ఈ కూటమిలోని షిండే శివసేన 56, అజిత్ పవార్ ఎన్సిపి 39 సీట్లలో ఆధిక్యంలో వుంది.
అత్యధిక సీట్లను సాధించే అవకాశం వున్న బిజెపికే సీఎం పదవి దక్కే అవకాశాలున్నాయి. ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర పడ్నవీస్ ఈసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే అవకాశాలు కనిపిస్తున్నారు. ఈ నెల 26న ఆయన మహారాష్ట్ర సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన ఇంట్లో సంబరాలు కూడా మొదలయ్యాయి.
ఓవైపు ఎన్నికల పలితాలు వెలువడుతుండగానే మరోవైపు బిజెపి పావులు కదుపుతోంది. మహాయుతి కూటమి విజయం ఖాయమైన నేపథ్యంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షులు చంద్రశేఖర్ బవాన్కులే కూడా పడ్నవీస్ తో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే పలితాలతో పాటు ప్రభుత్వ ఏర్పాటు, సీఎం పదవిపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం. కూటమి పార్టీలతో చర్చలు జరిపేందుకు బిజెపి అదిష్టానం ముంబైకి పరిశీలకులను పంపుతోంది... వీరు పడ్నవీస్ ను సీఎంగా ప్రతిపాదించడంతో పాటు కూటమి పార్టీలను ఒప్పించనున్నట్లు సమాచారం.
ఏక్ నాథ్ షిండే పరిస్థితి ఏమిటి?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో షిండే శివసేన అద్భుత ప్రదర్శన కనబర్చింది. మహాయుతి కూటమిలో భాగమైన షిండే శివసేన 81 స్థానాల్లో పోటీచేసి 56 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంటే మహాయుతి కూటమిలో రెండో పెద్దపార్టీ శివసేనే. దీంతో ఆ పార్టీ కూడా సీఎం రేసులో వుంది... ప్రస్తుత సీఎం ఏక్ నాథ్ షిండే మరోసారి పాలనాపగ్గాలు చేపడతారని ఆ పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నారు.
అయితే ఏక్ నాథ్ షిండేకు మరోసారి సీఎం బాధ్యతలు అప్పగించేందుకు బిజెపి సుముఖంగా లేనట్లు కనిపిస్తోంది. గతంలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో షిండే సహకరించారు... శివసేనను చీల్చి బిజెపి ప్రభుత్వ ఏర్పాట్లుకు మార్గం సుగమం చేసాడు. అందువల్లే ఆయనకు సీఎం పదవి దక్కింది. కానీ ఇప్పుడు బిజెపికి మ్యాజిక్ ఫిగర్ రాకున్నా ఎన్సిపి (అజిత్ పవార్ వర్గం) మద్దతు వుంటుంది. కాబట్టి షిండే శివసేనకు సీఎం పదవి దక్కే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.
ముఖ్యమంత్రి పదవి దక్కకుంటే ఏక్ నాథ్ షిండే ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తన ఎమ్మెల్యేలతో కలిసి మహాయుతి కూటమిలోంచి బయటకు వస్తారా? లేదంటే సర్దుకుపోయి అందులోనే కొనసాగుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి కూటమి కూడా బలహీనంగా వుంది కాబట్టి ఆయనకు మహాయుతి కూటమితో కలిసి నడవడం తప్ప మరో అవకాశం లేదు.
సీఎం రేసులో అజిత్ పవార్?
శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కంటే అజిత్ పవార్ సారథ్యంలోని పార్టీదే ఈ ఎన్నికల్లో పైచేయిగా నిలిచింది. మహాయుతి కూటమిలోకి అజిత్ పవార్ ఎన్సిపి 59 స్థానాల్లో పోటీచేసి 39 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కానీ మహా అఘాడీ వికాస్ కూటమిలోని శరద్ పవార్ ఎన్సిపి కేవలం కేవలం 12 సీట్లకే పరిమితం అయ్యింది. అంటే మామ శరద్ పవార్ కంటే మేనల్లుడు అజిత్ పవార్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించాడు.
ఇలా మామ సుదీర్ఘ రాజకీయ జీవితానికి అజిత్ పవార్ చెక్ పెట్టాడు. ఇలా బలమైన నేతను ఢీకొట్టి విజయం సాధించిన అజిత్ కు మహాయుతి కూటమిలో మంచి పదవి దక్కనుంది. ఆయితే ఆయన వర్గానికి చెందిన ఎన్సిపి నేతలు తమ నాయకుడికే ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మహారాష్ట్ర ఎన్నికల పలితాలు :
భారతీయ జనతా పార్టీ - 124 స్థానాల్లో ఆధిక్యం - ఘట్కోపర్ ఈస్ట్, వదాలాలో విజయం
షిండే శివసేన - 54 స్థానాల్లో విజయం - పాల్ఘర్, భీవండి రూరల్ సీట్లలో విజయం
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్) - 37 స్థానాల్లో ఆధిక్యం - 2 చోట్ల విజయం (నిఫడ్, శ్రీవర్ధన్)
మహా వికాస్ అఘాడి :
కాంగ్రెస్ పార్టీ - 22 స్థానాల్లో ఆధిక్యం
శివసేన (ఉద్దవ్ థాక్రే) - 18 స్థానాల్లో ఆధిక్యం
ఎన్సిపి (శరద్ పవార్) - 12 స్థానాల్లో ఆధిక్యం (మధ అసెంబ్లిలో విజయం)