Kerala New CM VD Satheesan Net Worth: కేరళ కొత్త ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్‌ను కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. పదేళ్ల వామపక్ష పాలనకు చెక్ పెట్టి యూడీఎఫ్‌ను విజయతీరాలకు చేర్చిన సతీశన్ ఆస్తుల వివరాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కేరళ సీఎంగా వీడీ సతీశన్.. ఆయన భార్య దగ్గర కేజీకి పైగా బంగారం?
కేరళ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఎల్‌డీఎఫ్ (LDF) పదేళ్ల సుదీర్ఘ పాలనకు చరమగీతం పాడుతూ, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది యూడీఎఫ్ (UDF). కేరళ తదుపరి ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ పేరును కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా ఖరారు చేసింది. కార్యకర్త స్థాయి నుంచి సీఎం వరకు ఎదిగి, పినరయి విజయన్ వంటి ఉద్దండుడిని సతీశన్ ఢీకొట్టారు.
24
హైకమాండ్ భారీ కసరత్తు.. సతీశన్‌కే పట్టం
ముఖ్యమంత్రి పీఠం కోసం కాంగ్రెస్‌లో గట్టి పోటీనే నెలకొంది. ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పే కేసీ వేణుగోపాల్, దశాబ్దాల అనుభవం ఉన్న రమేష్ చెన్నితాల వంటి పేర్లు వినిపించినప్పటికీ, హైకమాండ్ మాత్రం క్షేత్రస్థాయిలో పార్టీని గెలిపించిన నాయకుడికే మొగ్గు చూపింది. ముస్లిం లీగ్ వంటి మిత్రపక్షాల సపోర్టు, యువతలో ఉన్న క్రేజ్ సతీశన్‌కు ప్లస్ అయ్యాయి. పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉండి నీరసించిపోయిన కార్యకర్తల్లో ఉత్సాహం నింపినందుకు గాను ఆయనకే హైకమాండ్ జై కొట్టింది.
34
వీడి సతీశన్ ఆస్తుల లెక్కలు ఇవే
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న తరుణంలో సతీశన్ ఆర్థిక నేపథ్యంపై చర్చ మొదలైంది. ఆయన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, సతీశన్ కుటుంబానికి సుమారు రూ. 6.69 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.
సతీశన్ పేరిట రూ. 53.82 లక్షలు, ఆయన భార్య లక్ష్మీప్రియ పేరిట రూ. 68.45 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయి.
సతీశన్ వద్ద 35 గ్రాముల బంగారం ఉంటే, ఆయన భార్య వద్ద ఏకంగా 1,128 గ్రాముల (సుమారు 1.1 కేజీ) బంగారం ఉన్నట్లు వెల్లడించారు.
పారావూర్, నెట్టూర్ ప్రాంతాల్లో వీరికి రూ. 4.27 కోట్ల విలువైన భూములు, ఇళ్లు ఉన్నాయి. అలాగే, వీరికి సుమారు రూ. 41.5 లక్షల అప్పులు కూడా ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
వీడీ సతీశన్ ప్రయాణం ఏమీ పూలపాన్పు కాదు. 1964లో కొచ్చి సమీపంలోని నెట్టూర్‌లో జన్మించిన ఆయన, కేరళ స్టూడెంట్స్ యూనియన్ (KSU) ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే, పార్టీలో చురుగ్గా పనిచేశారు.
2001లో పారావూర్ నుండి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, అప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు. అసెంబ్లీలో ఆయన చేసే ప్రసంగాలు, లోతైన అధ్యయనం చూసి ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోయేవారు. ముఖ్యంగా 2021 పరాజయం తర్వాత ప్రతిపక్ష నేతగా ఆయన చూపిన తెగువ, ఎల్‌డీఎఫ్ సర్కార్‌లోని అవినీతిని ఎండగట్టిన తీరు నేడు ఆయనను సీఎం కుర్చీలో కూర్చోబెట్టాయి.