పదేపదే IRCTC వెబ్ సైట్, యాప్ ఎందుకు పనిచేయడం లేదు?
ఇండియన్ రైల్వే టికెట్ బుకింగ్ యాప్, వెబ్ సైట్ IRCTC సేవలకు పదేపదే అంతరాయం కలగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇలా ఒకటిరెండు సార్లు కాదు ప్రతిసారీ టికెట్ బుకింగ్ కోసం ప్రయత్నించే వినియోగదారులకు సమస్యే ఎదురవుతోంది. కేవలం ఈ ఒక్క నెలలోనే (డిసెంబర్ 2024) ఇలా ఐఆర్ సిటిసి పనిచేయకపోవడం ఇది మూడోసారి. దీన్నిబట్టే దీని పనితీరు ఎలావుందో అర్థం చేసుకోవచ్చు.
అయితే ఐఆర్ సిటిసి వెబ్ సైట్, యాప్ ప్రతిసారి సరిగ్గా తత్కాల్ టికెట్ విడుదల సమయంలోనే పనిచేకపోవడంపై పలువురు నెటిజన్లు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. 'ప్రతిరోజు ఉదయం 10 గంటలకు IRCTC వెబ్ సైట్ పనిచేయదు. మళ్లీ ఓపెన్ చేయగానే తత్కాల్ టికెట్స్ అన్ని బుక్ అయిపోతాయి. కేవలం అధిక ధర టికెట్స్ మాత్రమే అందుబాటులో వుంటాయి. దీంతో డబుల్ రేట్లకు టికెట్స్ కొనాల్సిన పరిస్థితి'' అంటూ ఎక్స్ లో ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్, ప్రధాని మంత్రి కార్యాలయానికి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసాడు ఓ నెటిజన్.
ఇక ఐఆర్ సిటిసి వెబ్ సైట్ పనిచేయకపోవడంపై కొందరు నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. 'ఇండియా చంద్రుడిని చేరుకుంది. కానీ ఇప్పటికీ ఇండియన్ రైల్వే టికెట్ బుకింగ్ యాప్ కేవలం తత్కాల్ టికెట్స్ ను కూడా సమస్యలు లేకుండా అమ్మలేకపోతోంది. రాకెట్ సైన్స్ కంటే టికెట్ బుకింగ్స్ యాప్ నిర్వహణ కష్టమేమో' అంటూ సెటైర్లు వేస్తున్నారు.