జననం
మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26వ తేదీన పంజాబ్‌లోని (ఇప్పటి పాకిస్థాన్) గాహ్ గ్రామంలో జన్మించారు. మన్మోహన్ సింగ్ 1952లో తన బ్యాచిలర్ డిగ్రీని పంజాబ్ యూనివర్సిటీ నుంచి, 1954లో మాస్టర్ డిగ్రీని ఛండీగడ్ యూనివర్సిటీ నుంచి పూర్తి చేశారు. ఆ తర్వాత 1957లో కేంబ్రిడ్జి యూనివర్సిటీలో బ్యాచిలర్స్ డిగ్రీని ఆ తర్వాత 1962లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌ను పూర్తి చేశారు. ఇలా రాజకీయాల్లో అత్యంత విద్యావంతులైన నాయకుల్లో ఒకరిగా పేరుగా సంపాదించుకున్నారు మన్మోహన్.
ఉద్యోగం..
మన్మోహన్ సింగ్ సాధారణ లెక్చరర్‌గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 1957 నుంచి 1959 మధ్య ఆర్థిక శాస్త్రంలో సీనియర్ లెక్చరర్‌గా సేవలందించారు. ఆ తర్వాత పంజాబ్, ఛండీగడ్ వంటి విశ్వవిద్యాలయాల్లో ఆర్థికశాస్త్రంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. అలాగే 1976లో జవహర్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఢిల్లీ యూనివర్సిటీలో గౌరవ ప్రొఫెసర్‌గా సేవలందించారు. ఆ తర్వాత ఐఎంఎఫ్, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వంటి అంతర్జాతీయ స్థాయి బాధ్యతలను నిర్వహించారు. ఆ తర్వాత ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా సేవలందించారు. ఇలా సాధారణ ఉద్యోగిగా మొదలైన మన్మోహన్ జీవిత ప్రయాణం ప్రధాని స్థాయికి చేరడం ఎంతో స్పూర్తిదాయకం.
దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం..
భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి మన్మోహన్ చేసిన కృషి వెలకట్టలేనిది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన వినూత్న ఆలోచనలు, సరళీకృత ఆర్థిక వ్యవస్థ నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులు వేశాయి. 1991-96 మధ్య పీవీ నర్సింహరావు హయాంలో ఆర్థికమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలకు శ్రీకారం చుట్టారు. దేశాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించారు. ఎల్‌పీజీ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత మన్మోహన్ సింగ్‌దే. భారత ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టడంలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారని చెప్పడంలో ఎలాంటి సందేం లేదు.
భారత ఆర్థిక వ్యవస్థకు మన్మోహన్ చేసిన సేవలు..
1991లో ఆర్థిక సంక్షోభ సమయంలో ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్ ఎన్నో ఆర్థిక సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చాయి. ఆర్థిక సంస్కరణలతో ఎగుమతులు పెంచడం, దిగుమతులపై నియంత్రణలను సడలించడం, విదేశీ పెట్టుబడులకు అవకాశాలను పెంచడం వంటి చర్యలు చేపట్టారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను సులభతరం చేసి, వ్యాపార కార్యకలాపాల్లో పారదర్శకతను తీసుకువచ్చారు. 1991 నాటి సంస్కరణల తర్వాత భారత జీడీపీ వృద్ధి రేటు గణనీయంగా పెరిగింది. 1980లలో 3-4% వృద్ధి రేటు ఉండగా, 1990ల మధ్యన 6% దాటింది. ఇక విదేశీ పెట్టుబడులకు కూడా మన్మోహన్ సింగ్ అవకాశం కల్పించారు.
మన్మోహన్ సాధించిన మరికొన్ని ఘనతలు..
* అత్యధిక జీడీపీ 10.8 శాతం వృద్ధిరేటు మన్మోహన్ సింగ్ హయాంలోనే నమోదు కావడం విశేషం.
* ఫోర్బ్స్ అత్యంత శక్తిమంతుల జాబితాలో కూడా మన్మోహన్‌కు చోటు దక్కింది.
* ప్రధానికగా ఎన్నికైన తొలి హిందూయేతర వ్యక్తిగా కూడా మన్మోహన్ రికార్డు సృష్టించారు.
* 2005లో సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది కూడా మన్మోహన్ సింగ్.