ప్రజలకు అందుబాటులో ఉండే రవాణా సాధనాల్లో రైల్వే ఒకటి. సుదూర ప్రయాణాలకు ఇదే సౌకర్యవంతంగా వుంటుందని చాలా మంది ప్రయాణికులు భావిస్తారు. అయితే కుటుంబంతో కలిసి ప్రయాణించేవారికి ఓ సందేహం వుంటుంది. ఎన్ని సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్ తీసుకోవాలి అని. ఇండియన్ రైల్వే నిబంధనలను పరిశీలిస్తే ఈ విషయంపై క్లారిటీ వస్తుంది.
కొంతమంది రైలు నిబంధనల గురించి తెలియక చిన్న పిల్లలకు కూడా పెద్దల టికెట్ కొనుగోలు చేస్తారు. అయితే కొన్ని సంవత్సరాలలోపు వయసు గల చిన్నారులకు అసలు రైలు టికెట్ ఉండదు...ఉచితంగా ప్రయాణించవచ్చు.ఇక మరికొన్నేళ్ల వయసు పిల్లలకు సగం టికెట్ తీసుకోవాల్సి వుంటుంది. ఈ నిబంధనల గురించి తెలుసుకుందాం.
భారతీయ రైల్వే పిల్లల టికెట్లకు సంబంధించి కొన్ని నిబంధనలు విధించింది. వీటి ప్రకారం, నాలుగు సంవత్సరాల లోపు పిల్లలకు ఎటువంటి టికెట్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. నాలుగు సంవత్సరాల లోపు పిల్లలు రైలులో ఉచితంగా ప్రయాణించవచ్చు.
భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం, 5 నుండి 12 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్ తీసుకోవడం తప్పనిసరి. స్లీపర్ కోచ్‌లలో మీ పిల్లలకు సీటు అవసరం లేకపోతే సగం టికెట్ తీసుకోవచ్చు. సగం టికెట్ తీసుకుంటే తల్లిదండ్రులు తమ పిల్లలను తమ సీట్లోనే కూర్చోబెట్టుకోవాలి. సగం టికెట్ తీసుకున్నా పిల్లలకు ప్రత్యేక సీటు కేటాయించబడదు.
5-12 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రత్యేక బెర్త్ అవసరమైతే పూర్తి టికెట్ కొనుగోలు చేయాలి. రిజర్వేషన్ సమయంలో 4 సంవత్సరాల లోపు పిల్లల వివరాలు కూడా అందించాలి. దీనికి ఎటువంటి రుసుము ఉండదు. సాధారణ ప్రయాణంలో, అంటే జనరల్ కోచ్‌లో 5-12 సంవత్సరాల లోపు పిల్లలకు సగం టికెట్ తీసుకోవాలి.