Telecom Scams : ఫేక్ మెసెజ్ లు, ఫోన్ కాల్స్ కారణంగా ఆర్థికంగా బాధితులుగా మారుతున్న భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. టెక్నాలజీని ఆసరాగా చేసుకుని పలువురు మోసాలకు పాల్పడుతున్నారు. భారతీయులు నిత్యం డజన్ల సంఖ్యలో ఫేక్ మెసెజ్ లు, కాల్స్ అందుకుంటున్నారనీ, ఇలా మోసాలకు గురవుతున్న వారి సంఖ్య పెరుగుతున్నదని తాజాగా మెకాఫీ నివేదిక పేర్కొంది.
ఇలా మోసాలకు తెరలేపే మెసెజ్ లు, ఫోన్ కాల్స్ లో అత్యధికం ఫేక్ జాబ్స్, ఆఫర్లు, బ్యాంకు సంబంధిత లావాదేవీలవిల ప్రకటనలు ఉంటున్నాయి. సుమారు 64 శాతం నకిలీ ఉద్యోగ నోటిఫికేషన్లు / ఆఫర్లు, 52 శాతం బ్యాంక్ అలర్ట్ సందేశాలు అత్యంత ప్రబలమైన మోసాల రకాలు అని నివేదించింది.
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 93,081 టెలికమ్యూనికేషన్ స్కామ్‌లు నమోదయ్యాయని టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) నివేదించింది. ఇది భారతదేశంలో మోసపూరిత కమ్యూనికేషన్ కేసులలో భయంకరమైన పెరుగుదలను సూచిస్తుంది.
మోసపూరిత కమ్యూనికేషన్‌లలో బ్యాంక్ ఖాతా, చెల్లింపు వాలెట్, సిమ్ కార్డ్, గ్యాస్ లేదా విద్యుత్ కనెక్షన్, కేవైసీ అప్‌డేట్, ఖాతాల గడువు ముగియడం లేదా నిష్క్రియం చేయడం, ప్రభుత్వ అధికారి లేదా బంధువుల మాదిరి నటించడం, సెక్స్‌టార్షన్ ఇలా చాలా రకాల సంబంధిత మోసాలు ఉన్నాయి.
టెలికమ్యూనికేషన్ శాఖ నివేదిక ప్రకారం కాల్, ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా ఇప్పటి వరకు 93,081 అభ్యర్థనలు అందాయి. వీటిలో కాల్స్ ద్వారా 60,730, వాట్సాప్ ద్వారా 29,325, ఎస్ఎంఎస్ ద్వారా 3,026 అభ్యర్థనలు అందాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి అత్యధిక అభ్యర్థనలు వచ్చాయి (10,392 కేసులు).
ఇప్పటివరకు, 80,209 కాల్‌లు, 5,988 వాట్సాప్, 997 ఎస్‌ఎంఎస్‌ల ద్వారా 89,970 నమోదైన కేసులు విజయవంతంగా పరిష్కరించబడ్డాయని కూడా పేర్కొంది. మోసపూరితంగా ఉన్న ఇప్పటి వరకు మొత్తం 2,776 మొబైల్ హ్యాండ్‌సెట్‌లు, 997 హెడర్‌లు, 5,988 వాట్సాప్ ఖాతాలు బ్లాక్ చేశారు. అత్యధిక కేసులు పరిష్కరించడం, చర్యలు తీసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ (13,380 కేసులు) ముందుంది.
ప్రఖ్యాత సైబర్ సెక్యూరిటీ సంస్థ McAfee తన మొదటి 'గ్లోబల్ స్కామ్ మెసేజ్ స్టడీ'ని 2023లో నిర్వహించింది. భారతీయులు మోసపూరిత సందేశాలను గుర్తించేందుకు వారానికి 1.8 గంటలు వెచ్చిస్తున్నారనీ, ప్రతిరోజూ సగటున 12 స్కామ్‌లు లేదా నకిలీ సందేశాలను అందుకుంటున్నారని తెలిపింది.
మొత్తం 82 శాతం మంది భారతీయులు నకిలీ సందేశాల ద్వారా మోసపోయారు. McAfee 64 శాతం నకిలీ ఉద్యోగ నోటిఫికేషన్లు/ఆఫర్లు, 52 శాతం బ్యాంక్ హెచ్చరిక సందేశాలు అత్యంత ప్రబలమైన స్కామ్‌ల రకాలుగా నివేదించింది. అలాగే, 83 శాతం వాయిస్ స్కామ్ బాధితులు, దాదాపు సగం మంది భారతీయ ప్రతివాదులు నిజమైన వాయిస్- క్లోన్ మధ్య వ్యత్యాసాన్ని గుర్తించలేరని పేర్కొంది.
ఈ ఏడాది ఆగస్టు 28న, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) తన స్పామ్ వ్యతిరేక చట్టాలకు కొన్ని మార్పులను వివరిస్తూ ఒక సంప్రదింపు పత్రాన్ని విడుదల చేసింది. భారతదేశంలో జరుగుతున్న మోసపూరితమైన, స్పామ్ కాల్‌లు, ఎస్ఎంఎస్ సందేశాల పెరుగుదలతో రెగ్యులేటర్‌కు ఇబ్బందులు ఎదురవుతున్న క్రమంలో ఈ చర్యలు తీసుకుంది.
మీరు బాధితులుగా మారినట్టు తెలిస్తే ఏం చేయాలి?
• సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930లో రిపోర్ట్ చేయండి.
• https://www.cybercrime.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్ లైన్ లో కూడా రిపోర్టు చేయవచ్చు.
• https://sancharsaathi.gov.in/sfc/Home/sfc-complaint.jsp లో 'CHAKSHU' పోర్టల్‌ని సందర్శించడం ద్వారా గత 30 రోజులలో ఏదైనా అనుమానిత మోసపూరిత కమ్యూనికేషన్‌ను స్వీకరించినట్లైతే దానిని నివేదించవచ్చు.
• అలాగే 'సంచార్ సాథి' పోర్టల్ లో కూడా ఫిర్యాదులు చేయవచ్చు.
• ఫిర్యాదును సమీప పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాలులు చేయవచ్చు.
• గుర్తించబడని లేదా సందేహాస్పద లింక్‌లపై ఎప్పుడూ క్లిక్ చేయవద్దు.
• ఓటీపీ, పిన్, పాస్‌వర్డ్, ఏదైనా ముఖ్యమైన పత్రాలు లేదా ముఖ్యమైన వ్యక్తిగత వివరాలను షేర్ చేయవద్దు.