రాష్ట్రాల వారీగా ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్స్‌లో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలవగా, మహారాష్ట్ర రెండో స్థానంలో, కర్ణాటక మూడో స్థానంలో నిలిచాయి. ఆ తర్వాత కేరళ, పంజాబ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ వరుసగా టాప్-10లో చోటు దక్కించుకున్నాయి. ఈ లిస్టులో టాప్ 10 లో ఏపీ, తెలంగాణలు లేవు. కానీ, ఇండియా స్కిల్స్ రిపోర్ట్ వంటి జాతీయ స్థాయి నైపుణ్య సర్వేల్లో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తమ ప్రతిభను చాటుకున్నాయి. 18 నుండి 21 ఏళ్ల వయస్సు గల యువతలో ఉద్యోగ అర్హత (జోబ్-స్కిల్ రెడీనెస్) పరంగా తెలంగాణ 85.45 శాతంతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అంతేకాకుండా, సంఖ్యాత్మక నైపుణ్యాలలో (78.68%) అగ్రస్థానం సాధించడంతో పాటు క్రిటికల్ థింకింగ్ విభాగంలోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది.
మహిళా ఉద్యోగ అర్హత విభాగంలో తెలంగాణ 3వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో నిలిచి, మహిళా సాధికారతలో జాతీయ సగటు కంటే మెరుగైన ఫలితాలను సాధించాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలు STEM, డేటా అనలిటిక్స్, ఫైనాన్స్ రంగాలకు అవసరమైన విశ్లేషణాత్మక ప్రతిభకు నిలయాలుగా మారుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ ఐటీ, పారిశ్రామిక రంగాలు విస్తరిస్తుండగా, రెండు రాష్ట్రాలు కూడా నాణ్యమైన మానవ వనరులను, సాంకేతిక నైపుణ్యం కలిగిన యువతను దేశానికి అందిస్తూ కీలకమైన వర్క్‌ఫోర్స్ హబ్‌లుగా ఎదుగుతున్నాయి.