Volcano: పేలిన భారీ అగ్నిపర్వతం.. మనదేశ గాలిలో కలిసిపోతున్న బూడిద, విమానాలకు ఇబ్బంది

Published : Nov 25, 2025, 04:49 PM IST

Volcano: భారీ అగ్నిపర్వతం పేలడం వల్ల విపరీతంగా బూడిద గాలిలో కలిసిపోతుంది. ఆ గాలి ఢిల్లీ వాతావరణాన్ని కలుషిత పరుస్తోంది. ఇంతకీ అగ్నిపర్వతం ఎక్కడో పేలిందో తెలుసా? ఇథియోపియాలో. 

PREV
15
పేలిన అగ్నిపర్వతం

ఇథియోపియాలోని హైలీ గుబ్బి అనే అగ్నిపర్వతం విస్ఫోటం కావడంతో ఆకాశంలో పెద్ద ఎత్తున బూడిద వ్యాపించింది. ఈ బూడిద గాలిలో కలిసిపోయి అరేబియా సముద్రం, గల్ఫ్ దేశాలను దాటి భారత దేశం వైపు వచ్చింది. ఈ పరిస్థితి విమానాలకు ప్రమాదకరం అని భావించి భారత వాతావరణ శాఖ, DGCA ముందస్తు హెచ్చరికలు జారీ చేశాయి.

25
బూడిదలో ఏముంటాయి?

అగ్నిపర్వతం నుంచి వచ్చిన బూడిదలో చిన్న రాళ్ల కణాలు, ధూళి ఉంటాయి. ఇవి విమాన ఇంజిన్లకు హాని చేసే అవకాశం ఉంది. అందుకే DGCA అన్ని ఎయిర్‌లైన్స్‌కి విమానాల మార్గాలను మార్చాలని, ఎగిరే ఎత్తును మార్చుకోవాలని సూచించింది. బూడిద కనిపించే ప్రాంతాలను పూర్తిగా వదిలివేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అదనంగా, ఏదైనా విమానంలో వాసన, పొగ, శబ్దం వంటి సమస్యలు గమనిస్తే వెంటనే జాగ్రత్త పడాలని తెలిపింది.

35
విమానాలు రద్దు

ఈ పరిస్థితి వల్ల భారతదేశంలోని పలు విమానయాన సంస్థలు తమ షెడ్యూళ్లను మార్చుకోవాల్సి వచ్చింది. ఎయిర్ ఇండియా కనీసం 11 విమానాలను రద్దు చేసింది. అగ్నిపర్వతం బూడిద దాటి వచ్చిన విమానాలను ప్రత్యేక తనిఖీకి పంపింది. అకాసా ఎయిర్ గల్ఫ్ దేశాలకు వెళ్లే కొన్ని విమానాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇండిగో కూడా కొన్ని అంతర్జాతీయ విమానాలను మార్గం మార్చి ఇతర నగరాల్లో దిగేలా చేసింది.

45
ఎప్పటికప్పుడు క్లీనింగ్

విమానాశ్రయాలపై కూడా బూడిద పడే అవకాశం ఉండటంతో DGCA రన్‌వేలు, టాక్సీవేలు, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించాలని ఆదేశించింది. బూడిద కనిపిస్తే వెంటనే శుభ్రపరచాలని, టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రయాణికులకు ముందుగానే విమానాలపై మార్పుల వివరాలు తెలియజేయాలని కూడా ఎయిర్‌లైన్స్‌కి చెప్పింది.

55
భారత్ పై ఎక్కువ ప్రభావం

మొత్తం మీద ఇథియోపియా అగ్నిపర్వతం విస్ఫోటం ప్రభావం భారత విమానాలపై తాత్కాలిక ఇబ్బందులను కలిగిస్తోంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం బూడిద మేఘం కొన్ని గంటల్లో తగ్గొచ్చు. అప్పటి వరకు విమానాలు ఆలస్యం కావడం, రద్దు కావడం లేదా రూట్లు మారడం సాధారణం. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు సంబంధిత ఎయిర్‌లైన్ సమాచారాన్ని చెక్ చేసుకోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories